పర్యవేక్షణ లోపమే

13 May, 2017 23:26 IST|Sakshi
పర్యవేక్షణ లోపమే

- ఆనాడే స్పందించి ఉంటే ముప్పు తప్పేది
- 8 నెలల కిందటే పీఏబీఆర్‌లో పనిచేయని విద్యుత్‌ మోటార్‌
- ప్రత్యామ్నాయ మోటార్‌ సైతం 3 రోజులుగా మొరాయింపు
- 834 గ్రామాలకు ఆగిన ‘శ్రీరామరెడ్డి’ తాగునీటి సరఫరా
అధికారులు, పాలకుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు


అనంతపురం సిటీ : శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నిర్వహణపై అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది. జిల్లాలో వందలాది గ్రామాలకు నీటిని అందించే ఈ పథకం పట్ల నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌) నుంచి శ్రీరామరెడ్డి పథకం ద్వారా 834 గ్రామాలకు, హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర మునిసిపాలిటీలకు తాగునీరు ఇస్తున్నారు. ఎనిమిది నెలల క్రితమే పీఏబీఆర్‌లో విద్యుత్‌ మోటార్‌ చెడిపోయింది. ప్రత్యామ్నాయ మోటార్‌తో నీటిని పంపింగ్‌ చేస్తూ వచ్చారు. అయితే.. చెడిపోయిన మోటారును రిపేరీ చేయించలేదు. మూడు రోజుల కిందట ‘ప్రత్యామ్నాయ’ మోటారు కూడా చెడిపోయి..  నీటి సరఫరాకు బ్రేక్‌ పడింది. గ్రామాలు దాహంతో అల్లాడుతున్నాయి.

నీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో అధికారులు నిద్రమత్తు నుంచి తేరుకున్నారు. హడావుడిగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. మోటారు మరమ్మతుకు రంగంలోకి దిగారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చాలాసార్లు పీఏబీఆర్‌ను సందర్శించినప్పటికీ అక్కడి సమస్యలను గుర్తించడంలో విఫలమయ్యారు. ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నిలదీసేసరికి చలనం వచ్చింది. యావత్‌ జిల్లా యంత్రాంగం శనివారం అర్ధరాత్రి దాకా పీఏబీఆర్‌ వద్దే తిష్టవేసింది. అయితే..ఆదివారం రాత్రికి గానీ మరమ్మతు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మూలనపడ్డ మొదటి మోటార్‌ రిపేరీ కోసం పది రోజుల కిందటే  రూ.20లక్షల నిధులు మంజూరయ్యాయి. వాటిని వినియోగించి మోటారును సరిచేసి ఉంటే.. నేడు  నీటి సరఫరాకు ఆటంకం కలిగేది కాదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల చిత్తశుద్ధిలోపం వల్లే ఇంతటి సమస్యకు దారి తీసిందని ప్రజలు మండిపడుతున్నారు. పంప్‌హౌస్‌లో మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌ను అందుబాటులో ఉంచి, ఎప్పటికప్పుడు మోటార్లను పర్యవేక్షిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా