రైతులపై అధి‘కారం’

27 Jan, 2017 02:10 IST|Sakshi
రైతులపై అధి‘కారం’

- రైతుల అనుమతి లేకుండా పంట పొలాల్లో విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు
- పోలీసుల అండతో నాటించిన టీడీపీ శ్రేణులు
– మానవహక్కుల కమీషన్‌ను ఆశ్రయించిన బాధిత రైతులు

-------------------------------------------
అనంతపురం : అధికారం అండ చూసుకుని కొందరు టీడీపీ నేతలు ఎందాకైనా బరితెగిస్తున్నారు. మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ఇటువంటి దౌర్జన్యాలు మరింత ఎక్కువయ్యాయి. రామగిరి మండలం పేరూరులో జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ. గ్రామానికి చెందిన బాధిత రైతులు ఈశ్వరయ్య, రామాంజినేయులు కథనం ప్రకారం... గ్రామ సమీపంలోని గుట్టలో పవన విద్యుత్‌ తయారీ కోసం ఓ ప్రైవేటు కంపెనీ కొన్ని గాలి మరలు ఏర్పాటు చేసింది. అక్కడ తయారైన విద్యుత్‌ను సమీపంలోని సబ్‌స్టేషన్‌కు తీసుకెళ్లేలా రైతుల పొలాల గుండా విద్యుత్‌ స్తంభాలు నాటాల్సి ఉంది.

అందుకు కొందరు రైతులు అంగీకరించలేదు. దీంతో ఆ కంపెనీ ప్రతినిధులు స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులను సంప్రదించారు. వారి ద్వారా బలవంతంగా పొలాల్లో స్తంభాలు నాటేందుకు ప్రయత్నించారు. అడ్డుకొనేందుకు ప్రయత్నించిన రైతులపై రామగిరి సర్కిల్‌ పోలీసులకు పట్టించి వారితో కౌన్సెలింగ్‌ ఇప్పించారు. దీంతో భయపడిపోయిన రైతులు రెండ్రోజుల కిందట హైదరాబాద్‌ వెళ్లి మానవ హక్కుల కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంతలో బుధవారం సాయంత్రం రామగిరి మండలంలోని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలతో కలసి కంపెనీ ప్రతినిధులు తమ పొలాల్లోకి వెళ్లి దౌర్జన్యంతో స్తంభాలు నాటారని బాధిత రైతులు ఆరోపించారు. పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు