కాల్ మనీ బాధితుల ఫిర్యాదుల వెల్లువ

15 Dec, 2015 19:49 IST|Sakshi

విజయవాడ: విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి కాల్ మనీ బాధితులు భారీగా క్యూ కట్టారు. మంగళవారం ఒక్కరోజే పదుల సంఖ్యలో బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కాల్ మనీ వ్యాపారులు వేలల్లో డబ్బులు అప్పుగా ఇచ్చి లక్షల్లో వసూలు చేయడంతో పాటు భయాభ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీసులకు బాధితులు మొరపెట్టుకుంటున్నారు. తమ ఆస్తి డాక్యుమెంట్లతో పాటు బ్యాంకు చెక్కులను తీసుకున్నారని బాధితులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఫిర్యాదుల్లో రాజకీయ నాయకుల అనుచరుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి.

  • కేఎల్ రావు నగర్కు చెందిన వెంకటేశ్వరమూర్తి కాల్ మనీ వ్యాపారి శివ వేధిస్తున్నాడని రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చి రూ.18 లక్షలు కట్టించుకున్నాడని ఇంకా వేధింపులకు గురిచేస్తున్నాడని తన ఫిర్యాదులో తెలిపాడు.
  • రాత్రి వేళల్లో వ్యాపారుల అనుచరులు ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని యనమలకుదురుకు చెందిన బాధితురాలు మాధవీలత ఫిర్యాదు చేశారు. అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి వేధిస్తున్నారని బాధితురాలు పోలీసులకు దృష్టికి తీసుకువచ్చింది. ఎమ్మెల్యే వంశీ అనుచరుడు ప్రభాకర్చే ఒత్తిడి తెస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. రూ.13 లక్షలు అప్పుగా ఇచ్చి కోటి ముప్పై లక్షలు కట్టాలని నోటీసులు ఇచ్చారని వాపోయింది.
  • కాల్ మనీ మహిళా వ్యాపారులు సూర్యదేవర పద్మ, నాగరత్నం, ప్రమీలపై భవానీపురానికి చెందిన బాధితురాలు శివకుమారి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. లక్ష రూపాయలకు రూ.30 లక్షలు వసూలు చేశారని బాధితురాలు ఆరోపిస్తుంది.
  • మరో వ్యాపారి మహేంద్రపై బాధితురాలు చెరుకూరి కుమారి ఫిర్యాదు చేశారు. రూ.50 వేలు అప్పుగా ఇచ్చి లక్షన్నర కట్టినా ఇంకా రూ.2 లక్షలు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపింది. వేధింపులు భరించలేక విజయవాడ వదిలి వెళ్లిపోయానని కుమారి పోలీసులకు  చెప్పింది.
  • వ్యాపారి మానేపల్లి రణధీర్పై బాధితుడు కిరణ్ ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు