విలపించేను

28 Feb, 2017 01:53 IST|Sakshi
విలపించేను
అత్తిలి : వరి చేలకు సాగు నీరందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కళ్లెదుటే పంట ఎండిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. కనీసం ఒక్క తడయినా పెట్టి పంటను కాపాడుకుందామనే ఆశతో రేయింబవళ్లు చేల గట్లపైనే కాపలా ఉంటున్నారు. చుక్క నీరైనా అందక వేదనకు చెందుతున్నారు. వంతులవారీ విధానంలోనూ సాగునీరందకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. అత్తిలి మండలంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మండలంలో 15 వేల ఎకరాల్లో దాళ్వా సాగు చేపట్టిన రైతులు నాట్లు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. కీలకమైన తరుణంలో చేలకు నీరందక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అత్తిలి శివారు బొంతువారి పాలెంలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అక్కడి ఆయకట్టుకు కనీస మాత్రంగానైనా నీరు అందటం లేదు. దీంతో ఆ ప్రాంతంలోని చేలన్నీ బీటలువారాƇు కేఎస్‌ చానల్‌ ద్వారా ఈ ఆయట్టుకు సాగునీరు సరఫరా కావాల్సి ఉండగా, ఒక్కతడి కూడా పెట్టుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి దిగువకు నీరు రావటం లేదని, వేలాది రూపాయలు వెచ్చించి ఆయిల్‌ ఇంజిన్లతో తోడుకుంటున్నా పంటను కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇంజిన్‌తో నీటిని తోడి చేనుకు మళ్లిస్తే మరుసటి రోజుకే ఇంకిపోతున్నాయని, వారానికి మూడుసార్లు నీటిని తోడుతున్నా పంట గట్టెక్కుతుందో లేదోనని పలువురు రైతులు వాపోతున్నారు. ఆయిల్‌ ఇంజిన్ల కోసం పెట్టుబడి పెట్టలేని రైతులు పంటను అలాగే వదిలేస్తున్నారు. నాట్లు వేసిన తరువాత నీటి సరఫరా లేక చేలన్నీ ఎండిపోయానని.. దీంతో మరోసారి మూనలు నాటామని కొందరు రైతులు చెప్పారు. చేలల్లో నీరులేక కలుపు విపరీతంగా పెరిగిపోతోందని.. దానిని తొలగించడానికి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని వివరించారు.
 
ఈడూరులోనూ ఇదే పరిస్థితి
ఈడూరు గ్రామ పరిధిలోని అల్లం కోడు, ఆవబోదె ఆయకట్టు పరిధి లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతానికి వంతుల సమయంలో వరుసగా మూడు దఫాలు నీరు సరఫరా కాలేదని రైతులు పెరికెల సత్యనారాయణ, వానపల్లి సత్యనారాయణ, తలారి విష్ణుమూర్తి చెప్పారు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, కీలక తరుణంలో నీరందకపోవడంతో చేలు బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మురుగు డ్రెయిన్ల నుంచి ఆయిల్‌ ఇంజిన్ల సాయంతో నీటిని తోడుకున్నామని, ఇటీవల కాలంలో రొయ్యల చెరువులు పెరిగిపోవడంతో కలుషిత జలాలు డ్రెయిన్‌లోకి చేరి ఉప్పుమయంగా మారుతోందని వివరించారు. ఆ నీటిని చేలకు తోడుకుంటే చౌడుబారే ప్రమాదముందని వాపోతున్నారు. కాలువ శివారు ప్రాంతాలకు వంతుల సమయంలో పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా అయ్యేవిధంగా సాగునీటి సంఘాలు, అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.  
 
గట్టెక్కేదెలా
అత్తిలి శివారు బొంతువారిపాలెంకు చెందిన ఈ రైతు పేరు బొంతు సతీష్‌. 7 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. దాళ్వా నాట్లు వేసిన తరువాత నీరందకపోవడంతో వరి దుబ్బులు ఎండిపోయాయి. తిరిగి మరోసారి నాట్లు వేశాడు. మూన తిరిగాక ఇప్పటివరకు చేలకు సాగునీరు అందలేదు. దీంతో ఆయిల్‌ ఇంజిన్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఎకరం పొలానికి తడి పెట్టేందుకు విడతకు 6 లీటర్ల డీజిల్‌ ఖర్చవుతోంది. కొనేందుకు డబ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఎకరానికి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.1.05 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయినా.. సగం పంట ఎండిపోయింది. మరోవైపు కలుపు పెరిగిపోతోంది. ఇప్పటికే కలుపు తీతకు రూ.25 వేల వరకు ఖర్చయ్యింది. సాగునీటి కోసం పొరుగు రైతులతో తరచూ ఘర్షణకు దిగాల్సి వస్తోంది. రెండో కోటా ఎరువులు వేయాల్సి ఉంది. తెగుళ్ల నుంచి పంటన రక్షించుకునేందుకు పురుగు మందులూ వాడాల్సి ఉంది. వీటికోసం ఎకరానికి కనీసం రూ.10 వేల వరకు ఖర్చయ్యే పరిస్థితి. కూలీలకు చెల్లింపులు మామూలే. మొత్తంగా చూస్తే రూ.2 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. ఇంత చేసినా పంట పండుతుందో లేదో తెలియదు. పండినా దిగుబడి దారుణంగా పడిపోవడం ఖాయం. ఈ పరిస్థితుల్లో అప్పులు ఎలా తీర్చాలో.. భూస్వామికి కౌలు మగతా ఎలా చెల్లించాలో తెలియక సతీష్‌ సతమతమవుతున్నాడు. 
‘వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. నీరివ్వలేమని అధికారులు ముందే చెప్పి ఉంటే అపరాలు సాగు చేసుకునేవాళ్లం. నీటిఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సబ్సిడీపై విద్యుత్‌ మోటార్లను ఇచ్చి ఉంటే నీటి సమస్య నుంచి బయటపడేవాళ్లం. దాళ్వా సాగుతో నిండా అప్పుల్లో మునిగాం. ఏం చేయాలో పాలుపోవడం లేదు’ అని సతీష్‌ వాపోతున్నాడు.
 
ముందెప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు
సాగునీటి కోసం గతంలో ఇంతటి దారుణ పరిస్థితి ఎన్నడూ చూడలేదు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టాం. ఈ సమయంలో నీరులేక పంటలు ఎండిపోవడం బాధాకరం. అధికారులు, సాగునీటి సంఘాలు సక్రమంగా సాగు నీరందించే ఏర్పాటు చేయాలి. – టీవీవీఎస్‌ఎన్‌ మూర్తి, రైతు, అత్తిలి
 
బీటలు వారుతున్నాయి
వంతు సమయంలోనూ మూడు దఫాలుగా మా ఆయుకట్టు ప్రాంతానికి సాగునీరు అందటం లేదు. పంటచేలు ఎండి బీటలు వారుతున్నాయి. సాగునీటి కోసం అవస్థలు పడుతున్నాం. ఆయిల్‌ ఇంజిన్లతో తోడుకుందామన్నా పంట బోదెల్లో నీళ్లు లేవు.
– సంకు సూర్రావు, రైతు, ఈడూరు 
 
మరిన్ని వార్తలు