పల్లె పొమ్మంటోంది..!

18 Jan, 2017 23:18 IST|Sakshi
లారీలలో తరలి వెళ్తున్న చిన్నారులు, కూలీలు
– పట్టించుకోని ప్రభుత్వం
 
కోసిగి : పుట్టిన ఊరులో బతుకు భారమైంది. పొట్టకూటి కోసం పల్లెలను వదిలి ప్రజలు.. పట్టణాలకు వలస వెళ్తున్నారు. బడులు మాన్పించి చిన్నారులను సైతం తమ వెంట తీసుకెళ్తున్నారు. బుధవారం కోసిగిలోని 3, 4వ వార్డు ప్రజలు.. చింతకుంట, కామన్‌దొడ్డి, కౌతాళం మండలంలోని తిప్పలదొడ్డి గ్రామల వాసులు.. వందలాది మంది రైళ్లలోనూ, లారీలలో గుంటూరు పట్టణానికి తరలి వెళ్లిపోయారు. కోసిగి మండలంలోని 26 గ్రామాల్లో 69,500 జనాభా ఉంది.  ఇందులో 90 శాతం మంది ప్రజలు వ్యసాయంపై జీవనం సాగిస్తున్నారు. మూడేళ్లుగా వానలు పడక..పంటలు ఎండి పోయి రైతులకు అప్పులు మిగిలాయి. భూగర్భజలాలు సైతం అడుగంటిపోయాయి. వ్యవసాయం కలసి రాకపోవడం..పల్లెల్లో పనులు లేకపోవడంతో ఇళ్లకు తాళాలు వేసి పిల్లాపాపలతో మూటాముల్లె  సర్దుకుని వలస బాట పడుతున్నారు. ప్రతి రోజూ వందలాది మంది వలసలు వెళ్తుండడంతో  గ్రామాలు ఖాళీ అవుతున్నాయి.
 
కరువు కనిపించలేదా?
కరువు విలయ తాండవం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం, కోసిగి మండలాలను కరువు​ప్రాంతాలుగా  ప్రకటించలేదు. పంట నష్ట పరిహారం అందక..అప్పులు తీరే మార్గం కానరాక రైతులు..పొట్ట చేతపట్టకొని ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు.  
 
గిట్టుబాటు కానీ ‘ఉపాధి’
ప్రభుత్వం కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు గిట్టుబాటు కావడం లేదు. రెండున్నర నెలలుగా.. చేసిన పనులకు కూలి ఇవ్వలేదు. దీంతో ఉపాధి పనులు ఎందుకు ఉపయోగపడడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వలస నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సి ఉంది.
 
అప్పుల భారంతో వలస వెళ్లుతున్నాం : నరసప్ప, రైతు
నాకు 3.50 ఎకరాల భూమి ఉంది. మరో 5 ఎకరాలు కౌలు తీసుకుని ఈ ఏడాది ఉల్లి, వేరుశనగ పంటలను వేశాను. వర్షాలు సకాలంలో రాకపోవడంతో పంట పూర్తి ఎండి పోయింది. పెట్టుబడి కూడా రాలేదు. మొత్తం రూ.2లక్షల అప్పు మిగిలింది. అప్పు తీర్చేందుకు కుటుంబంలో ఆరుగురం వలస వెళ్తున్నాం. 
 
కుటుంబ పోషణ భారమైంది : గోవిందమ్మ, 
గ్రామంలో ఎలాంటి పనులు దొరకడం లేదు. కుటుంబ పోషణ భారమైంది. ఇద్దరు చదువుకునే పిల్లలను బడి మానిపించి మా వెంట గుంటూరు తీసుకెళ్లుతున్నాం. ప్రభుత్వం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేదు. 
 
బడి మానుకున్నాను : రత్నమ్మ, విద్యార్థిని
కోసిగి చాకలిగేరి ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాను. మా ఇంట్లో వాళ్లంతా గుంటూరుకు వెళ్తున్నారు. నేనొక్కదాన్ని ఉండలేక బడిమాని మా అమ్మానాన్న వెంట పనులకు వెళ్లుతున్నాను. 
 
మరిన్ని వార్తలు