గ్రామాల్లో ఇంటిపన్ను రెట్టింపు!

2 Jan, 2016 08:15 IST|Sakshi
గ్రామాల్లో ఇంటిపన్ను రెట్టింపు!

చదరపు అడుగుల లెక్కన పన్నుధర పెంపు
ప్రజలపై ఏటా రూ.120 కోట్ల అదనపు భారం
త్వరలోనే బాదుడుకు సంబంధించిన ఉత్తర్వులు

 
హైదరాబాద్  చంద్రబాబు సర్కార్ గ్రామీణ ప్రజలను పన్నుతో బాదడానికి రంగం సిద్ధం చేస్తోంది. గ్రామాల్లో సొంతిళ్లు ఉన్న వారి నుంచి ఏడాదికొకసారి వసూలు చేసే ఇంటి పన్నును వంద శాతం పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రామీణ ప్రజలపై ఏటా రూ. 120 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం మైనర్ పంచాయతీల్లో ఇంటి విస్తీర్ణాన్ని బట్టి చదరపు అడుగుకు రూపాయి చొప్పున.. మేజరు పంచాయతీల్లో చదరపు అడుగుకు రెండు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. దీనిపై గ్రంధాలయ వసతి సెస్ కింద 8 శాతాన్ని అదనంగా కలిపి ఇంటి పన్నుగా వసూలు చేస్తున్నారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక వీధి దీపాల అవసరాలకు వినియోగించే విద్యుత్ చార్జీలను ఆయా గ్రామ ప్రజల నుంచి వసూలు చేయాలని నిర్ణయించి, ఇందుకు గాను ఆయా పంచాయితీల్లో విద్యుత్ వినియోగాన్ని బట్టి ఇంటి పన్నుపై ఐదు నుంచి పది శాతం మేర వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. తాజాగా చదరపు అడుగు విస్తీర్ణానికి రూపాయి చొప్పున వసూలు చేసే  చోట రెండు రూపాయలు, రెండు రూపాయలు వసూలు చేసే గ్రామాల్లో నాలుగు రూపాయలు వసూలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగే మొత్తానికి సరిపడా గ్రంధాలయ సెస్, వీధి దీపాల విద్యుత్ చార్జీల

భారం కూడా పెరుగుతాయి.
 రెట్టింపు కానున్న భారం..: పన్ను పెంచాలన్న చంద్రబాబు సర్కార్ నిర్ణయం కారణంగా.. రాష్ట్రంలో గ్రామాల్లోని ఒక్కో ఇంటి యజమానిపై కనీసంగా ఏడాదికి రూ.350 అదనపు భారం పడే అవకాశం ఉంది. మైనర్ పంచాయతీ పరిధిలోనే 30 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ఉండే చిన్న ఇంటిలో ఉండే నిరుపేద కుటుంబం ఇప్పటి వరకు ఏటా సుమారు రూ. 350 రూపాయలు చెల్లించాల్సి ఉండగా పెంపుతో ఆ మొత్తం రూ. 700 అవుతుంది. ఉదాహరణకు గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలం రెడ్డిపాలెం గ్రామంలో మొత్తం 1,200 వరకు ఇళ్లు ఉండగా.. ఇప్పుడు ఏడాదికి రూ. 1.53 లక్షల రూపాయలు ఇంటి పన్ను రూపేణా వసూలు చేస్తున్నారు. పన్ను పెంపు తరువాత ఆ ఒక్క గ్రామ ప్రజలపైనే ఏడాదికి మరో లక్షన్నర రూపాయల అదనపు భారం పడబోతుంది. రాష్ట్రంలోని మొత్తం 12,918 గ్రామ పంచాయతీల నుంచి ఏటా రూ.120 కోట్లు మేర ఇంటి పన్ను రూపేణా వసూలు చేస్తుండగా.. పెంపు తరువాత ఆ మొత్తం రూ.240 కోట్లు కానుంది.
 
 

మరిన్ని వార్తలు