రేడియోలు కనబడవు... పాఠాలు వినబడవు

12 Dec, 2016 15:02 IST|Sakshi
రేడియోలు కనబడవు... పాఠాలు వినబడవు
తొలి రోజు సగం పాఠశాలలకే పరిమితం 
ఉపాధ్యాయుల్లో కానరాని చైతన్యం 
బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న అధికారులు
భానుగుడి (కాకినాడ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు రాజీవ్‌ విద్యామిషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ‘విందాం–నేర్చుకుందాం’ కార్యక్రమం తొలి రోజు జిల్లాలో సగం పాఠశాలలకే పరిమితమైంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో చైతన్యం తెచ్చి, సులభంగా పాఠాలు అర్థమయ్యేందుకు రూపొందించిన ఈ కార్యక్రమంపై క్షేత్రస్థాయి సిబ్బందిలో చిత్తశుద్ధి కొరవడడం, అ«ధికారులు– ఉపాధ్యాయుల మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పాఠశాలల పనివేళల్లో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకూ ఈ కార్యక్రమం రేడియోలో ప్రసారం కానుంది. విద్యాశాఖ, సర్వశిక్షాభియాన్, ఆకాశవాణి, దూరదర్శన్‌ చానళ్ల సంయుక్త పర్యవేక్షణలో ఉండే ఈ కార్యక్రమానికి రాజీవ్‌ విద్యామిషన్‌ పాఠ్యాంశాలకు రూపకల్పన చేయగా, ఆకాశవాణి దూరదర్శన్‌ చానల్‌ ప్రసారం చేస్తుంది.
ఇదీ కార్యక్రమం...
ప్రతి మంగళవారం ఒకటి, రెండు తరగతులకు, బుధ, గురు, శుక్రవారాల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పద్యాలు, పాఠాలు, కృత్యాలు, పొడుపు కథలు, హాస్యోక్తులు, నాటికలతో పాటు విలువైన సమాచారంతో విద్యా సంవత్సరం పొడవునా పాఠాలు ప్రసారమయ్యేలా కార్యక్రమం రూపొందించారు. నిష్ణాతులయిన ఉపాధ్యాయుల ద్వారా రాజీవ్‌ విద్యామిషన్‌ పాఠాలను ప్రసారం చేస్తుంది. జిల్లాలో 3751 పాఠశాలల్లో 4 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో 3320 ప్రాథమిక,, 431 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. తొలిరోజు అధికారిక అంచనా ప్రకారం 1900 పాఠశాలల్లో మాత్రమే రేడియో పాఠాల కార్యక్రమం జరిగినట్టు సమాచారం.
కొరవడిన సమన్వయం
ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు అధికారుల్లో సమన్వయం లేకపోవడం వల్లే సుమారు 1850 పాఠశాలల్లో రేడియో పాఠాలు వినలేని పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ సమయంలో ఆదేశాలివ్వడం, పాఠశాలల్లో రేడియోలు పనిచేయకపోవడం, కొన్ని చోట్ల రేడియోలే లేకపోవడంతో తొలిరోజు సగం పాఠశాలల్లోని విద్యార్థులు పాఠాలు వినలేకపోయారు. తొలిరోజు కాలం, క్యాలెండర్ తదితర పాఠాలు బోధించారు. పాఠశాలలకు కేటాయించిన మేనేజ్‌మెంట్‌ నిధుల్లో రేడియోలను కొనుగోలు చేయాలని, ఆ నిధులతో రేడియోలు రిపేర్‌ చేయించుకోవాలని అ«ధికారులు ఆదేశాలు జారీ చేసినా ఉపాధ్యాయులు అంతగా పట్టించుకోలేదన్న ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాలలు గ్రాంట్‌లను పలు పనులకు ఉపయోగించడం వల్ల నిధుల కొరతతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలిసింది.
పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూస్తాం 
విందాం– నేర్చుకుందాం కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లోనూ పూర్తిస్థాయిలో అమలయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఎంఈఓలు, డీవైఈఓలకు సమాచారం ఇచ్చాం. ఏడాది పాటు కార్యక్రమానికి గ్యాప్‌ రావడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది.
  - చామంతి నాగేశ్వరరావు, అకడమిక్‌ మానటరింగ్‌ ఆఫీసర్‌ (రాజీవ్‌ విద్యామిషన్‌)
చర్యలు తీసుకుంటాం 
విద్యార్థుల్లోని సృజనకు పదునుపెట్టే ఈ కార్యక్రమం పాఠశాలల్లో ప్రారంభం కాలేదన్న విషయంపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలకు డీఈఓకు నివేదిస్తాం. ఈ కార్యక్రమంపై కొన్ని రోజుల ముందే నియమ, నిబంధనలతో పాఠశాలలకు సమాచారం అందించాం. రేడియో పాఠాలు ప్రారంభం కాని పాఠశాలలను గుర్తించాలని మానటరింగ్‌ అధికారులను ఆదేశించాను.    
- మేకా శేషగిరి, రాజీవ్‌ విద్యామిషన్‌ పీఓ
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా