జ్వరాల విజృంభణ

22 Mar, 2017 23:51 IST|Sakshi
జ్వరాల విజృంభణ

అనంతపురం మెడికల్‌ : జిల్లా వ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. మరీముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఒకవైపు తీవ్రమైన మండలు, మరోవైపు పారిశుద్ధ్యలోపంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలో 80 పీహెచ్‌సీలు, 15 సీహెచ్‌సీలు, రెండు ఏరియా ఆస్పత్రులు, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రులు ఉన్నాయి. మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా సర్వజనాస్పత్రి ఉంది. క్షేత్రస్థాయిలో రోగాల నియంత్రణ చేయాల్సిన పీహెచ్‌సీల్లో నామమాత్రపు వైద్య సేవలు అందుతున్నారు. అసలు వైద్యులు ఉంటున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి.

పైగా ఇక్కడ సేవలపై నమ్మకం లేని ప్రజలు రెఫరల్‌ సెంటర్లకు వెళ్తున్నారు. చాలా మంది సర్వజనాస్పత్రిని నమ్ముకుని వస్తున్నారు. రోజూ 1500 మందికి పైగా ఔట్‌ పేషెంట్స్‌ వస్తుండగా వీరిలో సగానికి పైగా కేసులు జ్వరంతో వచ్చినవే ఉంటున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం సరిగా అందకపోవడంతో ప్రధానంగా చిన్న పిల్లలను ప్రైవేట్‌ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా నష్టపోతున్నారు.

నిర్లక్ష్యం వీడని వైద్య ఆరోగ్యశాఖ
గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు జ్వరం రోగాలతో విలవిల్లాడుతుంటే వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ఇంకా నిద్రమత్తులోనే ఉంది. వేసవి నేపథ్య​లో ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉన్నా అవేం పట్టడం లేదు. జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే దాఖలాలు కానరావడం లేదు. కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతూ సమీక్షలతో సరిపెడుతున్నారు. డివిజన్ల వారీగా అధికారులకు ప్రత్యేక బాధ్యతలు కేటాయించినా ప్రయోజనం లేకుండాపోతోంది.

తాము విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు వెళ్లి రావడం మినహా గ్రామాల్లో పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. వాస్తవానికి చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై పీహెచ్‌సీల వారీగా సిబ్బంది అవగాహన కల్పించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. పంచాయతీలు, మునిసిపాలిటీల్లో పైపులు పగిలిపోయి తాగునీరు కలుషితమవుతోంది. ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు క్లోరినేషన్‌ చేయడం లేదు. ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షణ చేయాల్సి ఉన్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ప్రజలు రోగాలతో తల్లడిల్లుతున్నారు.

మరిన్ని వార్తలు