మంచం పట్టిన తండాలు

20 Aug, 2016 21:12 IST|Sakshi
అస్వస్థతకు గురైన గిరిజనులు
  • జ్వరాలతో వణికిపోతున్న జనాలు
  • సుభాష్‌తండా, బిల్లా తండాల్లో 25 మందికి అస్వస్థత
  • అందని వైద్య సేవలు.. ఆందోళనలో జనం
  • రామాయంపేట: విష జ్వరాలతో గిరిజన తండాల వాసులు వణికిపోతున్నారు. ఏ ఇంట్లో చూసినా జ్వరంతో బాధపడుతున్నవారే కన్పిస్తున్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.

    మండలంలోని దంతేపల్లి పంచాయతీ పరిధిలోని సుభాష్‌తండా, బిల్లా తండాలు మంచం పట్టాయి. ఈ రెండు తండాల్లో సమారు 25 మంది జ్వరంతో బాధపడుతున్నారు. ప్రభుత్వ వైద్యసేవలు అందక పోవడంతో వారు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దోమల దాడితో గిరిజనులు రోగాల బారిన పడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా జ్వరంతో వణికిపోతున్నారు.

    రెండో ఏఎన్‌ఎంలు సమ్మెలో ఉండడంతో వైద్య సేవలందక గిరిజనులు తల్లడిల్లిపోతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో జ్వరం వచ్చినా గడప దాటడం లేదు. తమ ఇంటిల్లిపాదికీ జ్వరం వచ్చిందని.. ఇంటికి తాళంవేసి ఆసుపత్రికి వెళ్లినట్టు సుభాష్‌ తండాకు చెందిన హరి, దేవీసింగ్‌ తెలిపారు. రెండు తండాల్లో జ్వరాలు సోకడంతో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

    పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
    ఈ తండాల్లో పారిశుద్ధ్యం లోపించింది. పెంట కుప్పలు ఇళ్లకు సమీపంలో ఉన్నాయి. నీటి గుంతలు ఉన్నాయి. దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో వీధులన్నీ కంపు కొడుతున్నాయి.  వెంటనే తమ తండాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని గిరిజనులు కోరుతున్నారు. పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు