ఆక్వాకు వైరస్‌ బెడద

4 Aug, 2016 22:10 IST|Sakshi
 గతేడాది వరదలు ఆక్వా రైతులను నిలువునా ముంచాయి. వరదలకు గుంతలు తెగిపోయి, ఏరియేటర్లు, మోటార్లు  కొట్టుకుపోవడంతో కోలుకోలేని దెబ్బతిన్నారు. ఈ క్రమంలో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే ఆలోచనతో అప్పులు చేసి మళ్లీ రొయ్యల సాగుకు సిద్ధమైన రైతులను ‘స్పాట్‌’ ఎటాక్‌ వణికిస్తోంది.  గాలి ద్వారా వ్యాపించే స్పాట్‌ నివారణకు మందులు లేక రొయ్యలను తక్కువ కౌంట్‌లోనే పట్టేయాల్సి రావడంతో రైతులు నష్టపోతున్నారు.
 
గూడూరు: జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో వేలాది ఎకరాల్లో రొయ్యల సాగుచేపడుతున్నారు. గతేడాది వరదలు ముంచెత్తడంతో తీరంలో ఆక్వా సాగుచేస్తున్న రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే ఆలోచనతో అప్పులు చేసి మరీ సాగు చేపట్టిన రైతులను ఎన్నడూ లేని విధంగా ఆదిలోనే  వైట్‌గట్‌ వణికించింది. అయితే ప్రకృతి సిద్ధమైన యాంటీ బయోటిక్స్‌ అయిన వెల్లుల్లి జ్యూస్, పెరుగు, పులిసిన కల్లు, మెంతులు, చింతపండు రసం, తదితరాలను పోసి ఎలాగోలా కంట్రోల్‌ చేసుకోగలిగారు. ఈ క్రమంలోనే రొయ్యలను సునామీలా కొత్తగా స్పాట్‌ ఎటాక్‌ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా వైట్‌గట్‌ ఒక గుంత నుంచి మరో గుంతకు వ్యాపించదు. కానీ స్పాట్‌ గాలి, నీరు ద్వారా వ్యాపిస్తుండడం..నివారణకు మందులు లేకపోవడంతో రొయ్యలను తక్కువ కౌంట్‌లోనే పట్టేయాల్సి వస్తోంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. 
మందులు లేవని చెబుతున్నారు– చంద్రమోహన్‌ 
రొయ్యలకు ఏ వ్యాధి సోకినా మందులు ఉంటే ఎంత ఖర్చు చేసైనా కాపాడుకుంటాం. కానీ స్పాట్‌ వ్యాధికి అసలు మందులే లేవని టెక్నీషియన్లు చెబుతున్నారు. గాలి ద్వారా వ్యాపిస్తుండడంతో వచ్చిన కాడికి చాలనుకుని రొయ్యలను పట్టేస్తున్నాం. 
నాసిరకం సీడ్‌తో నష్టపోతున్నాం– శ్రీనివాసులరెడ్డి
అనుమతులు లేని హేచరీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. హెచరీల్లో తనిఖీలు లేకపోవడంతో వారు నాణ్యమైన సీడ్‌ను తయారు చేయడం లేదు. నాసిరకం సీడ్‌కు కొత్తరకం వ్యాధులు వస్తుండడంతో  తీవ్రంగా నష్టపోతున్నాం.
>
మరిన్ని వార్తలు