ఆక్వాకు వైరస్‌ గండం

27 Sep, 2016 17:58 IST|Sakshi
ఆక్వాకు వైరస్‌ గండం
 * నష్టాల్లో రైతులు
 * మెలకువలు పాటించక పోవడంతోనే ఈ పరిస్థితి
 అవగాహన ఏర్పరుచుకోవాలంటున్న మత్స్యశాఖ అధికారులు
 
నిజాంపట్నం: ఆక్వా రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.  ప్రస్తుతం రొయ్యలకు వైరస్‌ సోకుతుండటంతో రైతులు భారీగా నష్టాలను చవిచూస్తున్నారు. 1990 ప్రాంతంలో తీరప్రాంతంలో ఉర్రూతలూగించిన ఆక్వాసాగు క్రమేణ వైరస్‌ వ్యాధుల ప్రభావానికి ఉనికే కనుమరుగైంది. కొన్ని సంవత్సరాలు ఆక్వా సాగు అంటేనే రైతుల్లో వణుకు పుట్టించింది. ఇందుకోసం తవ్విన చెరువులను తిరిగి రైతులు పంట భూములుగా మలుచుకోవటం ప్రారంభించి వరిసాగువైపు పయనించారు. తిరిగి  ఇటీవల ఆక్వా సాగు ఆశాజనకంగా మారటం, ప్రకృతి ఆటుపోట్ల నడుమ వరిసాగు ప్రశ్నార్థకంగా మారుతుండటంతో తీరప్రాంతంలోని రైతులు దీనిపై దృష్టిసారించారు. అయితే సాగుపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం, సరైన మెలకువలు పాటించకపోవటంతో ఆదిలోనే నష్టాల బారిన పడుతున్నారు.  ఆక్వాసాగు చేస్తున్న చెరువుల్లో సుమారు నెలరోజుల లోపే వైరస్‌ వ్యాధులు సోకి రొయ్య పిల్లలు చనిపోతున్నాయి.
 
ప్రమాణాలు పాటించకపోవటంతోనే..
రొయ్యలను పట్టిన తరువాత చెరువులోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి నెలరోజుల పాటు ఎండబెట్టాలి. ఆసమయంలో బ్లీచింగ్, బ్యాక్టీరియా నివాణకు మందులను చల్లాల్సి ఉంది. అయితే చెరువులోని రొయ్యలను పట్టిన తరువాత  ఈజాగ్రత్తలు పాటించకుండానే తిరిగి రొయ్య పిల్లలను వేసి సాగుకు సిద్ధమవుతుండటంతో వైరస్‌ వ్యాధులు సోకుతున్నాయి. 
 
వరికి ప్రత్యామ్నాయంగా వెనామి రొయ్యపై దృష్టి..
గత రెండు మూడు సంవత్సరాలుగా సాగునీరు లేక ఖరీఫ్‌  ప్రశ్నార్థకంగా మారటంతో తీరప్రాంతంలోని రైతులు ప్రత్యామ్నాయంగా ఆక్వాసాగువైపు మళ్లుతున్నారు. సాగు చేయాలనే ఆదుర్దాతో, పూర్తి అవగాహన ఏర్పరుచుకోకుండా, పూర్తిస్థాయిలో నియమాలు పాటించకుండా  చేస్తున్న సాగు నష్టాలనే తెచ్చిపెడుతున్నది.  రైతులు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించి సాగును చేపడితే తప్పనిసరిగా ఆక్వా ఆశాజనకంగా ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలుపుతున్నారు. తాము ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి సాగును చేపట్టాలని కోరుతున్నారు. 
 
అధికారుల సూచనలు ఇవీ..
నీటి గుణాలు ఎప్పకప్పుడు పరీక్షించుకోవాలి. ప్రాణవాయువు(డి.ఒ) ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పరిశీలించాలి. వారానికి ఒకసారి నీటి పీ.హెచ్, ఆల్సలినీటి, విషవాయువులైన అమ్మోనియా, నైట్రేట్, హైడ్రోజన్‌సలై్ఫడ్‌ వంటివి పరీక్షించుకోవాలి. వెనామి సాగులో నిరంతరం ఏరియేటర్లు వాడుకోవాలి. ప్రతి 300  కేజీల రొయ్యలకు ఒక హెచ్‌పీ ఏరియేటర్‌ అవసరం.
 
బయో సెక్యూరిటీ.. 
  • చెరువు ప్రవేశ ద్వారం వద్ద చేతులు, కాళ్లు కడుగుకొనేందుకు వీలుగా పొటాషియం పెర్మాంగ్‌నేట్‌ ద్రావణం ఉంచాలి.
  • చెరువు గట్ల వెంబడి పీతలు వంటి వైరెస్‌ వాహకాల ప్రవేశాన్ని నిరోధించేందుకు వీలుగా ఆరమీటరు ఎత్తులో వల (క్రాబ్‌ఫెన్సింగ్‌) ఏర్పాటు చేయాలి.
  • ప్రతి చెరువుకు వేర్వేరు పనిముట్లు(వలలు,మగ్గు వంటివి) వాడుకోవాలి.
శుభ్ర పరిచే వ్యవస్థ తప్పనిసరి..
సాగు తొలిదశ నుంచి ఈ జాగ్రత్తలు, సూచనలు పాటించాలి. చెరువులో రొయ్యపిల్లల్ని వదలడం, చెరువులో నీటిని పెట్టుకుని తక్కువ మోతాదులో సేంద్రియ, రసాయనిక ఎరువులు వాడుకోవాలి. రొయ్యపిల్లల నాణ్యత, ఒత్తిడి పరీక్షలు చేసుకుని పి.ఎల్‌ 10 నుంచి 12 రోజులు ఉన్నవాటిని చదరపు మీటరుకు 60 పిల్లలకు మించకుండా విడుదల చేయాలి.
– ఎ.రాఘవరెడ్డి, ఎఫ్‌డీవో
మరిన్ని వార్తలు