విశాఖలో అంతర్జాతీయ సాగర ఉత్పత్తుల ప్రదర్శన

5 Aug, 2016 23:43 IST|Sakshi
సాక్షి, విశాఖపట్నం :విశాఖ నగరం మరో అంతర్జాతీయ కార్యక్రమానికి వేదికవుతోంది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివద్ధి సంస్థ (ఎంపెడా) భారత సీఫుడ్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌తో కలిసి వచ్చే నెల 23 నుంచి 25 వరకు అంతర్జాతీయ సీఫుడ్‌ షోను నిర్వహించనుంది. నగరంలోని పోర్టు డైమండ్‌ జూబ్లీ స్టేడియంలో ఈ ప్రదర్శన జరగనుంది. విశాఖలో 2001లో తొలిసారి సీఫుడ్‌ షో జరిగిందని, 15 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చే నెలలో నిర్వహిస్తున్నామని ఎంపెడా చైర్మన్‌ ఎ.జయాతిలక్‌ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద సీఫుడ్‌ షో అని చెప్పారు. సుమారు 65 విదేశీ సంస్థల ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రదర్శనలో సీఫుడ్‌ ప్రాసెసింగ్‌ యంత్రాల తయారీదారులు, సర్టిఫికేషన్లు, ప్రాసెసింగ్‌ ఇంగ్రీడియెంట్లు, కోల్డుచైన్‌ సిస్టంలు, లాజిస్టిక్స్, సీఫుడ్‌ పరిశ్రమ భాగస్వాముల యంత్ర, వస్తు సామగ్రి ప్రదర్శిస్తారని తెలిపారు. భారత మత్స్య పరిశ్రమ ఉత్పత్తి, శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు తెలియజేయడం ఈ షో లక్ష్యమన్నారు. దేశంలో పాటించే భద్రతతో కూడిన సుస్థిర ఆక్వా కల్చర్, సముద్ర మత్స్యపరిశ్రమలో సాంకేతికాభివద్ధి, సుస్థిర వేట, మత్స్యకారులు, ఆక్వా రైతులు, సీఫుడ్‌ ఎగుమతిదార్లు పాటించే విధానాలను తెలియజేస్తారని చెప్పారు. 
ఎగుమతుల విలువ రెట్టింపు!
ప్రస్తుత ఎగుమతుల ఫలితాలను బట్టి భారత విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల విలువ రెండింతలు పెరిగే అవకాశం ఉందని ఎంపెడా చైర్మన్‌ తెలిపారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.30,420.83 కోట్ల (4.7 బిలియన్‌ డాలర్ల) విలువైన 9,45,892 టన్నుల మత్స్య ఉత్పత్తులు మన దేశం నుంచి ఎగుమతి చేశామన్నారు. 2020 నాటికి భారత సముద్ర, ఆక్వా కల్చర్‌ ఉత్పత్తుల ఎగుమతుల టర్నోవర్‌ 10 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ఎల్‌–వెనామీ రొయ్య కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. భారత సీఫుడ్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏఐ) జాతీయ అధ్యక్షుడు వి.పద్మనాభం మాట్లాడుతూ సెప్టెంబర్‌లో జరిగే సీఫుడ్‌ షోకు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించామన్నారు. సమావేశంలో ఎంపెడా కార్యదర్శి బి.శ్రీకుమార్, ఎస్‌ఈఏఐ సెక్రటరీ జనరల్‌ ఇలియాస్‌ సేట్, ట్రెజరర్‌ కె.జి.లారెన్స్‌ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు