హోదా కోసం రావడం పబ్లిక్‌ న్యూసెన్సట!

27 Jan, 2017 02:46 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం విశాఖ వచ్చిన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేతను పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. రెండు గంటలకు పైగా అక్కడినుంచి కదలనివ్వలేదు. చివరకు 143 సెక్షన్‌ను ప్రయోగించాల్సి వస్తుందని జగన్‌కు చెప్పిన జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, నగర పోలీస్‌ కమిషనర్‌ టి.యోగానంద్‌లు ఆయనను బలవంతంగా విమానంలో తిరిగి హైదరాబాద్‌కు పంపించేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారనే మాట వినబడుతుంటుంది. ప్రజలకు ఈ సెక్షన్‌ గురించిన పూర్తి వివరాలు తెలియకపోయినా సంబంధిత ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో గుమిగూడకూడదు వంటి ఆంక్షలు ఉంటాయని అర్థమైపోతుంది.

మరి 143 సెక్షన్‌ ఏమిటి? 144 సెక్షన్‌కు కాస్త అటు ఇటుగా ఉండే ఈ సెక్షన్‌ గురించి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 45/1860లో వివరంగా ఉంది. ప్రజా జీవనానికి నిర్విరామంగా విఘాతం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్, సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచిగానీ, జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచి గానీ అధికారం పొందిన ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేయవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే పబ్లిక్‌ న్యూసెన్స్‌ (ప్రజాజీవనానికి విఘాతం) పేరిట అరెస్ట్‌ చేయడానికి 143 సెక్షన్‌ అవకాశం కల్పిస్తోంది. అయితే విపక్ష నేత ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనడానికి వస్తే అది పబ్లిక్‌ న్యూసెన్స్‌ ఎలా అవుతుందో, హక్కుల కోసం మాట్లాడటం ప్రజా జీవనానికి విఘాతం ఎలా అవుతుందో పాలకులు, అధికారులే చెప్పాలి. ప్రతిపక్ష నేతగా కేబినెట్‌ హోదా కలిగిన వ్యక్తిపై 143 సెక్షన్‌ ప్రయోగానికి విశాఖ పోలీసులు పూనుకోవడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు