హైదరాబాద్ సోదాల్లో ‘గోదావరి’ టికెట్లు లభ్యం

17 Aug, 2016 11:11 IST|Sakshi
హైదరాబాద్ సోదాల్లో ‘గోదావరి’ టికెట్లు లభ్యం
  • నేడో రేపో రౌడీషీటర్ అరెస్టుకు సన్నాహాలు
  • విశాఖలో కొంతకాలం అనుచరులతో నయీం మకాం?
  • నగరంలో కొనసాగుతున్న సిట్ విచారణ
  • పూర్తి వివరాలు రాబట్టే పనిలో మూడు రోజులుగా ఇక్కడే మకాం
  • హైదరాబాద్ సోదాల్లో ‘గోదావరి’ టికెట్లు లభ్యం
  • ఆ డేటా కోసం భువనేశ్వర్‌కు.. సీసీ ఫుటేజీల కోసం కోల్‌కతాకు..
  •  
    తీగ లాగితే డొంక కదులుతోంది.. గ్యాంగ్‌స్టర్ నయీం జాడలు స్పష్టంగా కనబడుతున్నాయి.. నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖ నగరంపై కరడుగట్టిన నేరగాడు నయీం నీడలు కమ్ముకోవడం నిజమేనని.. అతగాడి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు నిర్థారణకు వచ్చారు. తమకు లభించిన కొద్దిపాటి ఆధారాలతో విశాఖలో నయీం కార్యకలాపాలపై దృష్టి సారించిన సిట్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలే లభిస్తున్నాయి.

    మూడురోజులుగా నగరంలోనే మకాం వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కీలక సమాచారాన్నే రాబట్టగలిగారు. నగర శివారులోని పోతిన మల్లయ్యపాలెంలో  పేరుమోసిన రౌడీషీటర్, భూకబ్జాదారుడిగా పోలీసు రికార్డుల్లోకెక్కిన ఓ నేరస్తుడితో నయీంకు సన్నిహితసంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులుఅనుమానిస్తున్నారు. దాంతో కొన్నాళ్లుగా ఆ రౌడీషీటర్ కదలికలు.. అతగాడు సాగించిన భూదందాలపై ఆరా తీసే పనిలో పడ్డారు.
     
    విశాఖపట్నం : గ్యాంగ్‌స్టర్ నయీం ఇళ్లలో సిట్ అధికారులు జరిపిన సోదాల్లో విశాఖ, సికింద్రాబాద్ మధ్య రైళ్లలో రాకపోకలు సాగించిన టికెట్లు లభ్యమయ్యాయి. వాటిలో  గోదావరి ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీల్లో  ప్రయాణించిన టికెట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటి ఆధారంగానే నయీం పలుమార్లు విశాఖకు వచ్చినట్టు నిర్థారించుకున్నారు. విశాఖ నగరంలో భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసేందుకే వచ్చినట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
     
    ఈ క్రమంలోనే నగర శివార్లలో పేరుమోసిన రౌడీషీటర్ కార్యకలాపాలపై దృష్టి సారించారు. దర్యాప్తులో ఆ రౌడీషీటర్‌తో పాటు నగరానికి చెందిన మరికొందరు భూకబ్జాదారులతో కలిసి నయీం దందాలు సాగించినట్టు భావిస్తున్నారు. అయితే ముందుగా పీఎంపాలెంకు చెందిన రౌడీషీటర్‌ను నేడో రేపో అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని భావిస్తున్నారు.

    కాగా, రెండు నెలల కిందట పెద్దసంఖ్యలో అనుచరులను వెంటేసుకుని విశాఖకు వచ్చిన నయీం కొంతకాలం ఇక్కడే మకాం వేసినట్టు సిట్ విచారణలో తేలింది. దాంతో వారు ఎక్కడ ఉన్నారు.. ఎవరు ఆశ్రయం కల్పించారనే విషయాలపై పక్కాగా సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు.
     
    ఫుటేజీలు మావల్ల  కాదన్న ఆర్పీఎఫ్ అధికారులు
    ఇదిలా ఉంటే రైల్వే స్టేషన్‌లోని సీసీ ఫుటేజీలను సిట్‌కు పూర్తి స్థాయిలో అందించే విషయంలో విశాఖ ఆర్పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) అధికారులు చేతులెత్తేసినట్టు తెలిసింది. అందుబాటులో ఉన్న వివరాలను గత రెండురోజులుగా అందించిన ఆర్పీఎఫ్ వర్గాలు మరింత సమాచారం కావాలంటే కోల్‌కతాలోని ఆర్పీఎఫ్ కమిషనర్‌ను సంప్రదించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది.

    ఈ మేరకు  సీసీ ఫుటేజీ వీడియోల కోసం కోల్‌కతాకు వెళ్లాలని సిట్ అధికారులు  భావిస్తున్నారు. కాగా, నయీం బృందం విశాఖ- సికింద్రాబాద్ మధ్య ప్రయాణించిన సందర్భాల్లో  రైల్వే టికెట్ల రిజర్వేషన్‌ను ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గానే తీసుకున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఆ టికెట్లు రెండు నెలల ముందువి కావడంతో వాటి సమాచారం విశాఖ రైల్వే అధికారుల వద్ద లేదు. కానీ ఆ సమాచారం తూర్పు కోస్తా రైల్వే జోన్ కేంద్రం భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఆఫీసులో నిక్షిప్తమై ఉంటుంది. దీంతో ఆ సమాచారం కోసం సిట్ వర్గాలు భువనేశ్వర్ పయనమైనట్టు తెలిసింది. కాగా, విశాఖ నగరంలో మకాం వేసిన సిట్ అధికారుల బృందంలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నట్టు తెలిసింది.
     
    డాక్యుమెంట్ రైటర్‌తో సంబంధాలు?
    విశాఖపట్నం విభజనతో ఆర్థిక రాజధానిగా మారిన విశాఖ పరిసరాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఆదే అదనుగా నగరంలో ఓ గ్యాంగ్ తయారైంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారితో తయారైన ఈ గ్యాంగ్ వెనక నయీమ్ ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధురవాడలో అనేక భూ కబ్జాలు ఈ గ్యాంగ్  చేసిందన్న అనుమానాలు ఉన్నాయి. కబ్జా చేసిన భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, వాటిని కోర్టులో వేసి అసలు భూ యజమానులను ముప్పుతిప్పలు పెట్టడం ఈ గ్యాంగ్ ప్రత్యేకత.

    దీనికోసం వారు నగరంలో ఓ డాక్యుమెంట్ రైటర్‌ను ఉపయోగించుకునేవారు. సిట్ అధికారుల తాజా విచారణలో నయీమ్‌కు నగరంలోని ఓ డాక్యుమెంట్ రైటర్‌తో సంబంధాలున్నాయని తేలింది. దీంతో ఈ మూఠా నయీమ్‌దేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇక కొందరు పోలీసు ఉన్నతాధికారులతోనూ నయీమ్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా సంబంధాలపై కూడా సిట్ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు