వినయాది గుణాల విశ్వనాథ

9 Sep, 2016 21:26 IST|Sakshi
వినయాది గుణాల విశ్వనాథ
  • అహంకారమనే అపవాదే కాదు.. 
  • మూర్తీభవించిన సౌజన్యం ఆయన సొంతం
  • గోదావరితో ఆయనకు సాహిత్యానుబంధం
  •  
    తెలుగు కవులు ఏ ప్రాంతానికి చెందిన వారైనా గోదావరిని ప్రస్తుతించని వారు అరుదనే చెప్పాలి. కవిసామ్రాట్‌ విశ్వనా£ý lసత్యనారాయణ ఇందుకు మినహాయింపు కాదు. ఆంధ్రప్రశస్తిలో ‘గోదావరీ పావనోధారవాఃపరిపూరమఖిలభారతము మాదన్ననాడు’ అని ఎలుగెత్తి చాటారు. విశ్వనాథకు అహంకారం ఎక్కువని లోకంలో ఒక అపవాదు ఉంది. ‘ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి..’అని తనను గురించి రామాయణ కల్పవృక్షంలో పేర్కొన్న కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణలో మూర్తీభవించిన సౌజన్యం, వినయాది గుణాలు పుష్కలంగానే ఉన్నాయి. ఆయన రాజమహేంద్రికి చెందిన సీనియర్‌ న్యాయవాది పోతుకూచి సూర్యనారాయణమూర్తికి రాసిన లేఖ ఒకటి ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. సాహితీగౌతమి తరఫున విశ్వనాథను రామాయణ కల్పవృక్షంపై ప్రసంగించాల్సిందిగా పోతుకూచి సూర్యనారాయణమూర్తి విశ్వనాథను ఆహ్వానించారు. ఆ రోజుల్లో విశ్వనాథ కరీంనగర్‌లో కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తుండేవారు.. ‘‘ నేడు కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ జయంతి’ సందర్భంగా ఆ లేఖలో కొంతభాగం.. 
    – రాజమహేంద్రవరం కల్చరల్‌ 
     
    ‘‘ కరీంనగరము,
    20–09–1960
    నమస్కారములు. అయ్యా!  
    తమరు వ్రాసిన జాబు చేరినది. తమఱందరు కలసియింత యెత్తుగడ యెందుకెత్తినారో నాకు తెలియదు. మిత్రులు, భావుకులు అయినవారికి నా గ్రంథము వినిపించవలయునని మాత్రమే నా వాంఛ. దానిని మీరు పెద్ద యుత్సవముగా మార్చినారు. కొందఱధికోత్సాహవంతులగు మిత్రుల దయ, కొంత మనస్సునకు ఇరుకు అనిపించినను సహించక తప్పదు. సాహిత్య విషయమున నాయందొక నిష్కర్షయున్నది. అది నేనకున్న యాదార్థ్యము– దీనిని లోకము ధూర్తత యనుకొనుచున్నది. అది ధూర్తత కాదని నాకు తెలియును. నేను సాధువనుట యిది నిజము. అందుచేతనే నాకట్టి యుత్సవములు బడాయిగా గనిపించి యొడలు కంపరమెత్తినట్లు యుండును. గుడివాడలో నేనుగు నెక్కుమన్నచో నెక్కలేదు. చూచిన వారేమనుకుందురో యని.. అది యట్లుంచి మీరు ఎంత తక్కువ హంగామాతో చేసిన నంత సంతోషింతును. అచ్చటికెందరో కవులు, పండితులు వత్తురు. వారు నా కావ్యము విని సంతోషించవలయుననియే నా ప్రధానోద్దేశము. వారందరిలో నేనుత్తముడనని నాయూహౖయెనట్లు భాసింపచేసినచో అది నాకు సుతరాం ఇష్టము లేదు. మధునాపంతులవారు , వెంపరాలవారు మొదలయిన వారుందురు. వారికంటె నేనెక్కువ పొడిచివేసిన దేమియు లేదు. శ్రీరామచంద్రకథాగతమైన భక్తిని నేను నా ప్రత్యేక జీవబాధతో వెళ్ళబోసికున్నది వారందరకు విన్నవించవలయునని మాత్రమే నా ప్రయత్నము.....’
     
    విశ్వనాథ అంతరంగానికి అద్దం పట్టే ఈ ఉత్తరాన్ని నవితికి (90)చేరువలో ఉన్న‘సాహితీసర్వజ్ఞ’ పోతుకూచి సూర్యనారాయణమూర్తి నేటికీ పదిలంగా దాచుకున్నారు. కాగా, ఈ ఇన్‌లాండ్‌ లెటర్‌ ఖరీదు పది పైసలు. నాడు గోదావరిగట్టుపై ఉన్న రామకృష్ణమఠంలో విశ్వనాథ తాను రచించిన రామాయణ కల్పవృక్షంపై ప్రసంగాలు నిర్వహించారు.1939–40 మధ్యకాలంలో కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో జరిగిన ఆంధ్రాభ్యుదయోత్సవాలలో విశ్వనాథ పాల్గొన్నారు. జిల్లాలోని కోరుకొండలో ఆయనకు కనకాభిషేకం జరిగింది. మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
     
    ఏ పేజీ వస్తే అక్కడ నుంచి చెప్పమనేవాళ్లం
    మా సాహితీగౌతమి ఆహ్వానం మేరకు విశ్వనాథ సత్యనారాయణ తన రామాయణ కల్పవృక్షం గ్రంథాన్ని తీసుకుని ఏపేజీ వస్తే, అక్కడి నుంచి చెప్పేవారు. అప్పటికి ఇంకా యుద్ధకాండ రచన పూర్తికాలేదు. అప్పట్లో రామకృష్ణమఠం గోదావరిగట్టుపై, వాటర్‌వర్క్స్‌ వీధి మలుపులో ఉండేది. ఎందరో ఉద్దండ సాహితీమూర్తులు ఆయన ప్రసంగాలకు హాజరయ్యారు.
    – పోతుకూచి సూర్యనారాయణ మూర్తి, సీనియర్‌ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పూర్వసభ్యుడు
     
    అది నాకు దేవుడిచ్చిన వరం
    విశ్వనాథ ప్రసంగాలకు రాజమహేంద్రవరానికి వచ్చినప్పుడు, నేను పండిట్‌ ట్రెయినింగ్‌ అవుతుండేవాడిని. నా సమీప బంధువు చెరుకుపల్లి్ల జమదగ్నిశర్మ ఇంటిలో ఆయన మకాం. నేను ఆయనకు స్నానానికి నీళ్లు తోడివ్వడం, ఆయన్ను సభాస్థలికి తీసుకువెళ్లడం వంటిపనులు చేసేవాడిని. నాకు లభించిన శుశ్రూషాభాగ్యానికి నేటికీ నేను ఆనందపడుతున్నాను.
     
    – భారతభారతి శలాక రఘునాథ శర్మ
     
మరిన్ని వార్తలు