గొంతెండుతున్నా పట్టించుకోరా?

13 May, 2017 23:23 IST|Sakshi
గొంతెండుతున్నా పట్టించుకోరా?

- రిజర్వాయర్‌లో నీరున్నా ప్రజలకు ఎందుకివ్వరు?
- ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
- పీఏబీఆర్‌ వద్ద రక్షిత నీటి పథకం ప్రారంభానికి యత్నం
- అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత
-ఎమ్మెల్యే అరెస్ట్‌, విడుదల


కూడేరు : ప్రజల గొంతెండుతున్నా ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. సర్కారు వైఫల్యంతోనే జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తుతోందన్నారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నిర్వహణలో నిర్లక్ష్యం, ఉరవకొండ నియోజకవర్గంలోని 90 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు పీఏబీఆర్‌ వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన సమగ్ర గ్రామీణ రక్షిత నీటి పథకం ప్రారంభోత్సవంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వానికి నిరసనగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి శనివారం ఆందోళన చేపట్టారు. సుమారు 500 మంది ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పీఏబీఆర్‌ వద్ద రక్షిత నీటి పథకాన్ని ప్రారంభించేందుకు వెళ్లారు. అప్పటికే అక్కడ మోహరించిన ఆత్మకూరు, ఉరవకొండ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, పది మంది ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, స్పెషల్‌ పార్టీ పోలీసులు కలిపి సుమారు 150 మంది ప్రధాన గేటు వద్దనే వారిని అడ్డుకున్నారు.

ప్రజల తాగునీటి ఇబ్బందులు తీర్చడం కోసమే రక్షిత పథకాన్ని ప్రారంభించడానికి వచ్చామని చెబుతున్నా..పోలీసులు విన్పించుకోలేదు. అడ్డొచ్చిన ఆందోళనకారులను పక్కకు నెట్టేసి ఎమ్మెల్యేను బలవంతంగా కూడేరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అంతకుముందు పీఏబీఆర్‌ వద్ద ఎమ్మెల్యే విశ్వ విలేకరులతో మాట్లాడారు. కరువును జయిస్తామని గొప్పలు చెబుతున్న సీఎం చంద్రబాబు.. ప్రజలకు కనీసం గుక్కెడు తాగునీరు అందించలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోనే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అనంతపురం జిల్లా అని, ఈ వేసవిలో అనేక గ్రామాల్లో గుక్కెడు నీరు లభించక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు, ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో 90 గ్రామాలకు నీరందించేందుకు రూ.56 కోట్లతో ఏర్పాటు చేసిన పథకం ప్రారంభానికి నోచుకోలేదన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ పథకం ప్రారంభానికి అధికారులు చొరవ చూపడం లేదన్నారు.

ఎస్‌ఈని నిలదీసిన ఎమ్మెల్యే
ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ  హరేరాంనాయక్‌ను ఎమ్మెల్యే విశ్వ నిలదీశారు. ‘శ్రీరామరెడ్డి పథకంలో రెండు మోటార్లు ఉండగా.. కొంతకాలం నుంచి ఒక్కదాన్నే వాడుతూ వచ్చారు. ఇప్పుడు అదీ చెడిపోయింది. దాదాపు వెయ్యి గ్రామాల ప్రజలు నీరు లేక అల్లాడుతున్నారు. ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా? ఉరవకొండ తాగునీటి పథకాన్ని ప్రారంభించాలని మంత్రి దేవినేని ఉమా ఆదేశించినా మీరెందుకు పట్టించుకోలేదు? వేసవి పూర్తయ్యాక నీరిస్తారా? ప్రజల కన్నీటి కష్టాలు ప్రభుత్వానికి, మీకు పట్టవా?’ అని నిలదీశారు. శ్రీరామరెడ్డి పథకం మోటారు ఎప్పటిలోగా సరిచేసి, నీరిస్తారని అడగ్గా.. శనివారం సాయంత్రంలోపు పూర్తి చేస్తామని ఎస్‌ఈ చెప్పారు. అలాగే ఉరవకొండ తాగునీటి పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణయ్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ నాయకులు రాజశేఖర్, దేవేంద్ర, మాదన్న, తిప్పయ్య, బసవరాజు, వెంకటేశులు, రామ్మోహన్, అయ్యమ్మ, క్రిష్టప్ప, గంగాధర్‌, విజయభాస్కర్‌ రెడ్డి, Ô¶ శ్రీకాంత్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, రామచంద్ర, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు