రైతు క్షేమం పట్టని ప్రభుత్వం

10 May, 2017 23:18 IST|Sakshi
రైతు క్షేమం పట్టని ప్రభుత్వం

- ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ మంజూరులో అన్యాయం
- పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యం
- ఉరవకొండ ధర్నాలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం


ఉరవకొండ : జిల్లా రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక, రుణమాఫీ కాక అన్నదాతలు ఆత్మహత్యల బాట పడుతున్నా వారిని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి ఏ కోశానా లేదన్నారు. రైతాంగ సమస్యలతో పాటు చేనేత, ఉరవకొండ పట్టణ సమస్యలపై బుధవారం స్థానిక కవితా హోటల్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. పార్టీ మండల కన్వీనర్‌ వెలిగొండ నరసింహులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తీవ్ర కరువుతో అల్లాడుతున్న జిల్లా రైతాంగానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఇవ్వకుండా సర్కారు చోద్యం చూస్తోందన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.1,030 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.500 కోట్లు విడుదల చేసినా, రాష్ట్రవాటా రూ.500 కోట్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తుండటంతో కూలీలు కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారన్నారు. తీవ్ర వర్షాభావం వల్ల భూగర్భజల మట్టం పడిపోయిందని, 75వేల బోర్లు ఎండిపోయాయని వివరించారు.  పశువులకు మేత, నీరు కూడా దొరకని దయనీయ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.

ఇంకుడు గుంతల్లో దోపిడీ
జిల్లాలోని టీడీపీ నేతలకు ఇంకుడు గుంతల తవ్వకం పనులు కాసులు కురిపిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. మొత్తం పది లక్షల ఇంకుడు గుంతలు తవ్వాల్సి ఉండగా..ఇందులో 3.50 లక్షలు పూర్తి చేశారన్నారు. ఇంకా 7.50 లక్షలు తవ్వాల్సి ఉందని, వీటిలోనూ నిధులు కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో రూ.1200 కోట్లతో  చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారని, ఇందులో సగానికి పైగా నిధులు స్వాహా చేశారని అన్నారు. మొక్కల పెంపకంలోనూ నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ధర్నాలో వైఎస్సార్‌సీపీ కిసాన్‌సెల్‌ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, ఉపసర్పంచ్‌ జిలకరమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు