ఏసీబీ కోర్టుకు చిన్నోడు

8 Apr, 2016 02:02 IST|Sakshi
ఏసీబీ కోర్టుకు చిన్నోడు

 సాక్షితో ఏసీబీ డీఎస్పీ రంగరాజు
 శ్రీకాకుళం సిటీ : అవినీతి ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఏసీబీకి చిక్కిన విజయనగరం ఇన్‌చార్జి ఆర్టీవో పిల్లి చిన్నోడును తమ కోర్టులో హాజరు పరిచినట్టు ఏసీబీ డీఎస్పీ రంగరాజు  వెల్లడించారు. తమకు పట్టుబడిన ఆస్తుల విలువ ప్రభుత్వ రేటు ప్రకారం రూ.3కోట్లు ఉన్నట్టు గుర్తించామని, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ సుమారు రూ.15కోట్ల పైబడే ఉంటుందని తెలిపారు. సాక్షితో ఆయన తన కార్యాలయంలో గురువారం మాట్లాడారు.
 
  విశాఖపట్నం లోలుగుంట గ్రామానికి చెందిన పిల్లి చిన్నోడు 1990లో అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా ఇచ్ఛాపురంలో తొలిసారి బాధ్యతలు చేపట్టారని చెప్పారు. అనంతరం ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారని తెలిపారు. చిన్నోడు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఇతనిపై నిఘా పెట్టామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తన ఆధ్వర్యంలో ఏక కాలంలో ఏడుగురు సీఐలతో సోదాలు చేపట్టినట్టు తెలిపారు.  
 
 అక్రమ ఆస్తులు ఇలా...
 చిన్నోడుకు విశాఖపట్నంలో నాలుగు ఫ్లాట్లు, మూడు ఇళ్లస్థలాలు ఉన్నాయి.  స్వగ్రామమైన లోలుగుంటలో ఒక ఆలయం నిర్మాణంలో ఉంది. లోలుగుంట సమీపంలో 30 ఎకరాల్లో ఒక ఫామ్ హౌస్, అందులో మామిడి, జీడి తోటలను పెంచుతున్నారు. విశాఖపట్నం జిల్లా సీతంపేటలో నాలుగు అంతస్థులు అత్యంత ఖరీదైన భవనం, ( ఆ భవనంపైన మినీ ధియేటర్), ఆ భవనం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో (స్థలం విలువ కాకుండా ఒక్క భవనమే రూ.కోటి పైబడి ఉంటుంది) ఉంది.  విజయనగరం జిల్లాలో మూడు అంతస్థుల ఇళ్లు, రెండు ఇళ్ల స్థలాలు ఉన్నాయి.
 
 రావికమతం మండలం వద్ద పది ఎకరాలు, ఆ పరిసర ప్రాంతాల్లో మరో 20 ఎకరాలు ఉన్నాయి.  ఇంట్లో రూ.3.14 లక్షల నగదు, అరకిలో బంగారం, బ్యాంకు లాకర్‌లో రెండు కేజీల బంగారం, రూ.24 లక్షలు విలువచేసే ఇన్సురెన్స్ డాక్యుమెంట్లు, రూ.8 లక్షల విలువ చేసే ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నాయన్నారు. ముఖ్యమైన డాక్యుమెంట్లు, లాకర్ కీలను అతని స్నేహితుడు వెంకట్ అనే వ్యక్తి వద్ద ఉంచాడని, దానిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
 
   విశాఖపట్నం దొండపర్తి ఎస్‌బీఐలో లాకర్ కీ ఇంకా దొరకలేదని, బ్యాంకు అధికారులతో ఈ విషయమై మాట్లాడామన్నారు. ఆ లాకర్‌లో ఇంకా ఏమిటి ఉన్నాయో పూర్తి సమాచారం త్వరలోనే తెలియజేస్తామన్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఇన్‌చార్జి ఆర్టీవోగా చిన్నోడు పని చేస్తున్నాడని, విశాఖపట్నంలో అతనిని బుధవారం అదుపులోనికి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రంగరాజు సాక్షికి వివరించారు. గురువారం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు