నడిరోడ్డుపై ఓటర్ కార్డులు

14 Sep, 2015 03:08 IST|Sakshi
నడిరోడ్డుపై ఓటర్ కార్డులు

విజయవాడలో కలకలం  స్వాధీనం చేసుకున్న అధికారులు
విజయవాడ (వన్‌టౌన్): ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ఆయుధం.. ఓటు హక్కు. ఈ హక్కును వినియోగించుకోవాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. ఎంతో విలువైన ఈ గుర్తింపు కార్డులు నడిరోడ్డుపై దర్శనమిచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాది కార్డులు రోడ్డుపై పని ఉన్నాయి. విజయవాడలో ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కొత్తపేట దూది ఫ్యాక్టరీ రోడ్డులోని చేపల మార్కెట్‌కు సమీపంలో ఓటర్ గుర్తింపు కార్డులు రెండు గోనె సంచుల్లో ఉండటాన్ని ఆదివారం స్థానికులకు గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు సామినేని ఉదయభాను, పి.గౌతంరెడ్డి వచ్చి పరిశీలించారు. అక్కడ వేలాది ఓటర్ గుర్తింపు కార్డులు పడేయడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇవి అధికార టీడీపీ నేతలు గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకునేందుకు ఉపయోగించిన కార్డులేనని వారు ఆరోపించారు. దీనిపై న్యాయవిచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.
 
సెంట్రల్ నియోజకవర్గానికి చెందినవే: ఈ ఓటర్ గుర్తింపు కార్డుల్లో 90 శాతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి  చెందినవే ఉన్నాయి. ముఖ్యంగా అజిత్‌సింగ్‌నగర్, అయోధ్యనగర్, సూర్యారావుపేట ప్రాంతాలకు చెందిన కార్డులు ఉన్నాయి. ఎన్నికల సంఘం(ఈసీ) వెబ్‌సైట్‌లో పరిశీలించగా వీటిలోని పలు గుర్తింపు కార్డులు వాడుకలోనే ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కార్డులను పరిశీలించారు. ఇక్కడ ఐదు వేలకు పైగా కార్డులు ఉన్నాయని చెప్పారు.

వాటిని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. కార్పొరేషన్‌లో ఎన్నికల విభాగం అధికారులకు అప్పగించారు. ఓటర్ గుర్తింపు కార్డులను దొంగ ఓట్ల కోసం సేకరించి, పని ముగిశాక రోడ్డుపై పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లను సృష్టించి, గత ఎన్నికల్లో అసలు ఓటర్లను బూత్‌కు రాకుండా చేసేందుకు కుట్ర పన్నారని పేర్కొంటున్నారు. ఎన్నికల విభాగం అధికారుల సహకారంతోనే ఈ గుర్తింపు కార్డులను సేకరించి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు