కలెక్టరేట్‌ వద్ద వీఆర్‌ఏల ధర్నా

25 Jul, 2017 21:27 IST|Sakshi
కలెక్టరేట్‌ వద్ద వీఆర్‌ఏల ధర్నా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు హెచ్చరించారు. వీఆర్‌ఏల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వీఆర్‌ఏలు స్థానిక కలెక్టరేట్‌ వద్ద రెండో రోజు ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు వీఆర్‌ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. వీఆర్‌ఏలు ఐక్యంగా పోరాడుతున్నారని తెలిసి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వారి మధ్య చీలికలు తేవాలని చూస్తోందన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టి పాత, కొత్త వీఆర్‌ఏలందరూ ఐక్యంగా తమ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి, కె.ఏసురత్నం, ఎం.రాఘవులు, ఎస్‌కే.మస్తాన్, ఎ.రవికుమార్, కె.నాగరాజు, డి.వెంకటేశ్వరరావు, ఎం.చంటిబాబు, కె.నాగమ్మ, సీహెచ్‌.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు