కుక్కునూరు వీఆర్వోను బలిగొన్న సీఎం సెక్యూరిటీ వాహనం

14 Mar, 2016 03:42 IST|Sakshi
కుక్కునూరు వీఆర్వోను బలిగొన్న సీఎం సెక్యూరిటీ వాహనం

♦ మరో వ్యక్తికి తీవ్రగాయాలు
♦ రెండు మోటార్ సైకిళ్లు ధ్వంసం
♦ బంధువులు, గ్రామస్తుల రాస్తారోకో
 
 ఉంగుటూరు:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి భద్రత కల్పించే విభాగానికి చెందిన వాహనం ఢీకొని ఒక గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) మృత్యువాత పడగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుక్కునూరు వీఆర్వో నేదూరి షణ్ముఖరావు (రాంబాబు) అక్కడికక్కడే మృతి చెందగా, ఉంగుటూరుకు చెందిన కొడవళ్ల రాజా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో రెండు మోటార్ సైకిళ్లు ధ్వంసమయ్యాయి.

  సీఎం చంద్రబాబు సోమవారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్ల నిమిత్తం సీఎం పేషీలోని సెక్యూరిటీ విభాగం డీఎస్పీ జోషి ఏలూరు నుంచి వాహనంలో ఆదివారం బయలుదేరారు. ఉంగుటూరు సెంటర్‌కు వచ్చేసరికి వాహనం అదుపుతప్పి రెండు మోటార్ సైకిళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మోటార్ సైకిల్ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ కిందికి దూసుకెళ్లింది. దానిపై ప్రయాణిస్తున్న కుక్కునూరు వీఆర్వో నేదూరి షణ్ముఖరావు అక్కడిక్కడే మృతి చెందారు.

మరో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న కొడవళ్ల రాజా కాలు విరిగింది. వీఆర్వో షణ్ముఖరావు స్వగ్రామం ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు. విషయం తెలుసుకున్న ఆయన బంధువులు, ఉప్పాకపాడు, కాకర్లమూడి ప్రజలు ఘటనా స్థలానికి పెద్దఎత్తున తరలివచ్చారు. పోలీసుల తీరుకు నిరసనగా సుమారు రెండు గంటలపాటు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సీఎం భద్రతా విభాగం వాహనం డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా, స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. వీఆర్వో కుటుంబానికి తగిన పరిహారం అందిస్తామని, ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు