రియల్‌ కాదు.. దగా!

16 Sep, 2016 22:33 IST|Sakshi
డెంకాడలోని అక్రమ లే ఔట్లు
విస్తరిస్తున్న అనధికార లే అవుట్లు
మోసపోతున్న కొనుగోలుదారులు
భవనాల నిర్మాణానికి అధికారుల అభ్యంతరాలు
దష్టిసారించిన వుడా అధికారులు
 62 అక్రమ లేఅవుట గుర్తింపు
చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ అధికారులకు లేఖ
 
విజయనగరం కంటోన్మెంట్‌: జీవనసంధ్యలో ఆదుకుంటుందని ఒకరు... పిల్లల భవిష్యత్తుకోసం మరొకరు... ఏదైనా అవసరానికి ఆసరాగా నిలుస్తుందని ఇంకొకరు... ఇలా ప్రతి ఒక్కరూ చిన్నదో... పెద్దదో స్థిరాస్తికోసం వెంపర్లాడుతున్నారు. ఒకేసారి ఇళ్లు కొనుగోలు చేయలేక... ఎప్పటికైనా విలువ పెరుగుతుందన్న ఆశతో స్థలాలపై మోజు చూపిస్తున్నారు. ఇదే అదనుగా రియల్‌ఎస్టేట్‌వ్యాపారులు అక్రమ లేవుట్లతో దగా చేస్తున్నారు. నిరుద్యోగులను ఏజెంట్లుగా చేర్చుకుని వారికి కమీషన్ల ఆశచూపి కొనుగోలుదారులపైకి వదులుతున్నారు. మధ్యతరగతి ఉద్యోగులు... చిరువ్యాపారులను వారు ఏదోలా నచ్చజెప్పి బుట్టలోవేసి ఈ రొంపిలోకి లాగుతున్నారు. తీరా కొనుగోలు చేశాక అది అక్రమ లే అవుట్‌ అని తెలిసి లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఇప్పటికే వుడా పరిధిలో 62 అక్రమ లే అవుట్లు గుర్తించి చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలో కన్వర్షన్‌ అనుమతులు లేని... పంచాయతీ తీర్మానాలు పొందని అక్రమ లే అవుట్లు విస్తతంగా వెలుస్తున్నాయి. ఇవేమీ తెలియని అమాయకులు వాటిని కొనుగోలు చేసి తీరా ఇళ్ల నిర్మాణం ప్రారంభించినపుడు అధికారులు అడ్డుకోవడంతో మోసపోయామని తెలుసుకుంటున్నారు. కేవలం పెన్‌తో కొన్ని స్కెచ్‌లు గీసేసి ప్లాట్లను అమ్మేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన జిల్లా యంత్రాంగం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. జిల్లా కేంద్రం చుట్టు పక్కల ఉన్న మండలాల్లో ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. వుడా పరిధిలోకి మండలాలనుంచి వచ్చిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన అధికారులు సర్వే చేపట్టి 62 లేఔట్లను గుర్తించారు. అందులోని డ్రెయిన్లు, సర్వే రాళ్లను తొలగించారు. మిగతా చోట్ల కూడా సర్వే జరిపి ఆర్డీఓలు, డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీల ద్వారా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఉడా వైస్‌ చైర్మన్‌ టి.బాబూరావునాయుడు జిల్లా పంచాయతీ అధికారికి లేఖ రాశారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం పంచాయితీ అధికారులు ఉపక్రమిస్తున్నారు. జిల్లాలో 280.01 ఎకరాల్లో ఉన్న 62 అనధికార లే ఔట్లను గుర్తించామని ఇందులోని ప్లాట్లు అనధికారమైనవనీ లేఖలో పేర్కొన్నారు. విజయనగరం, డెంకాడ, గంట్యాడ మండలాల్లో మాత్రమే ఇన్ని లే అవుట్లు గుర్తించడం విశేషం.
 
 
అనధికార లే ఔట్లే ఎక్కువ !
జిల్లాలో 1955.06 ఎకరాల్లో అక్రమ లే ఔట్లు ఉన్నట్టు పంచాయతీ అధికారులు గతేడాది డిసెంబర్‌నాటికి గుర్తించారు. అధికారిక లే ఔట్లు మాత్రం 2463 ఎకరాల్లో ఉన్నాయి. మొత్తం 921 పంచాయతీల్లో 276 అక్రమ, 263 సక్రమ లే అవుట్లు ఉన్నట్టు గుర్తించారు. గుర్తించనవి మరో 500కు పైగానే ఉంటాయన్నది ఓ అంచనా! పంచాయతీల్లోని కార్యదర్శులు రియల్టర్‌లకు అనుగుణంగా వ్యవహరించడంతో పాటు వారి పనులే ఎక్కువగా చేస్తుండటంతో రియల్టర్లకు అడ్డు లేకుండా పోతోంది. గ్రామాల్లోని ప్రజల సమస్యల కన్నా రియల్టర్ల బేరాలతోనే కార్యదర్శులు కాలయాపన చేస్తారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 
]
 
నామమాత్రపు ఫీజులతోనే సరి! 
ల్యాండ్‌ కన్వర్షన్‌ యాక్టు 2006 ప్రకారం రెవెన్యూ శాఖకు  చెల్లించాల్సిన ఫీజులను రియల్టర్లు ఎగనామం పెడుతున్నారు. పంచాయతీలకు చెందిన సెక్యూరిటీ డిపాజిట్లు, లే ఔట్‌ ఫీజులను మాత్రం చెల్లించేయడంతో ఆయా సర్పంచ్‌లు, కార్యదర్శులు వీరికి సహకరిస్తున్నారు. మరో పక్క జిల్లా వ్యాప్తంగా ఉన్న లే ఔట్లలో బోర్డులు పెట్టి పెద్ద ప్రచారం చేస్తూ వ్యాపారం చేస్తున్న వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. 
 
 
రిజర్వు స్థలాలను రిజిస్టర్‌ చేయని వైనం!
జిల్లాలో రెండు వేలకు పైగా ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్లున్నాయి. కానీ ఈ ఎస్టేట్లు పంచాయతీకి పది శాతం స్థలాన్ని వివిధ ప్రయోజనాల కోసం రిజిస్టర్‌ చేయాల్సి ఉంది. ఈ విధంగా జిల్లాలోని పంచాయతీల్లో ఉన్న లే ఔట్లలో సుమారు 200 ఎకరాలకు పైగా రిజిస్టర్‌ కావాల్సి ఉంది. కానీ ఇప్పటికి కేవలం ఓ 70 ఎకరాలు మాత్రమే రిజిస్టర్‌ అయ్యాయి.  మిగతా వారు మాత్రం రిజిస్టర్‌ చేయకుండా ఆ స్థలాలనూ అమ్ముకున్న దాఖలాలున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. 
 
 
రోడ్లు కూడా రిజిస్టర్‌ చేయాలి – ఎస్‌ సత్యనారాయణ రాజు, డీపీఓ, విజయనగరం
జిల్లాలోని పంచాయితీల్లో 2వేల ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు నడుస్తున్నాయి. వీరు అనుమతులు పొందడం లేదు. అన్ని అనుమతులు పొందడంతో పాటు పది శాతం స్థలాన్ని ప్రభుత్వానికి రిజిస్టర్‌చేయాలి. వీటితో పాటు రోడ్లు కూడా రిజిస్టర్‌ చేయాల్సి ఉంది. త్వరలో సమావేశాలు నిర్వహించి అక్రమ లే ఔట్లు అన్నీ క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేస్తాం. త్వరలోనే దీనిపై చర్యలు తీసుకుంటాం. 
 
 
మరిన్ని వార్తలు