వీవీల నియామకమెప్పుడో..?

3 Aug, 2016 18:00 IST|Sakshi
వీవీల నియామకమెప్పుడో..?
  • విద్యావలంటీర్ల నియామకంలో అంతులేని నిర్లక్ష్యం
  • 1202 ఖాళీలకు 492 వీవీల భర్తీ
  • 710 ఖాళీల భర్తీ ఎప్పుడో ?
  • కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌ : విద్యావలంటీర్ల నియామకంపై సర్కార్‌ చేతులెత్తేసింది. ప్రతిపాదనలు పంపాలని జిల్లా విద్యాశాఖను ఆదేశించి వివరాలు తీసుకుని అందులో మూడో వంతుకూడా నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో సర్కార్‌ పాఠశాలల్లో విద్యాబోధన సక్రమంగా జరుగుతుందా..అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.    
     
    ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే డీఎస్సీ నిర్వహించి కొత్త పంతుళ్లను భర్తీ చేస్తామన్న ప్రభుత్వం చివరకు మాట మార్చింది. అదే సందర్భంలో ఉన్నఫలంగా జిల్లాల్లో ఖాళీల వివరాలను పంపాలని, విద్యావలంటీర్లను నియమించుకుని బోధనకు ఆటంకం కలుగకుండా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లాలో 1,202 మంది విద్యావలంటీర్లు అవసరమని జిల్లా విద్యాశాఖ నివేదిక పంపింది. అయితే ఇందులో కేవలం 492 మంది నియామకానికి  రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ  గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  మిగతా విద్యావలంటీర్ల నియామకంపై ఎలాంటి సూచనలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు 492 మంది నియామకపు ప్రక్రియను ముగించారు. ఈ లెక్కన దీంతో జిల్లాలో మరో 710 మంది విద్యావలంటీర్ల నియామకం జరగాలి. అయితే అది జరుగుతుందో.. లేదో వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా అటు రెగ్యులర్‌ ఉపాధ్యాయులు, ఇటు విద్యావలంటీర్లు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా తయారైంది. విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెబుతున్న సర్కార్‌ ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది, మౌలిక వసతుల విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
     
    మూడు మండలాలకు ప్రాతినిథ్యం కరువు
    ఖాళీల వివరాలు సమర్పించాలని డీఈవో కోరిన సమయంలో కమలాపూర్, కోనరావుపేట, ఎలిగేడు మండలాల ఎంఈవోలు సకాలంలో స్పందించలేదని సమాచారం. ఖాళీల గురించి అందజేయకపోవడంతో మూడు మండలాలకు సంబంధించి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించలేకపోయినట్లు తెలిసింది. కోనరావుపేట మండలంలో 8 మంది, కమలాపూర్‌లో ఆరుగురు, ఎలిగేడులో ఆరుగురు విద్యావలంటీర్లు అవసరముంది. 
     
    నివేదించాం..
    –శ్రీనివాసాచారి, డీఈవో
    విద్యావలంటీర్ల ఖాళీల వివరాలను జూన్‌లోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపాం. 492 మందిని భర్తీ చేసుకునేందుకు ఉత్తర్వులు వచ్చాయి. జూలై 15లోపు ప్రక్రియను పూర్తిచేసి పాఠశాలల్లోకి పంపాం. మిగతా విద్యావలంటీర్ల అవసరం విషయాన్ని మరోసారి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు నివేదించాం. ఉత్తర్వులు రాగానే భర్తీ చేస్తాం. టీచర్ల కొరత ఉన్న చోట సర్‌ప్లస్‌ టీచర్లను సర్దుబాటు చేస్తున్నాం. 
     
     
    భర్తీచేయాలి..
    – పాకాల శంకర్‌గౌడ్, టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి
    ప్రభుత్వం స్పందించి విద్యావలంటీర్ల నియామకాన్ని భర్తీ చేయాలి. లేకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి ప్రజల పిల్లలకు తీరని అన్యాయం జరుగుతుంది. ప్రతిపాదనలు అందని కమలాపూర్, కోనరావుపేట, ఎలిగేడు మండలాలకు ఖాళీల వివరాలను భర్తీ చేసేలా చూడాలి.
     
     
     
మరిన్ని వార్తలు