వేతన వెతలు

6 Mar, 2017 22:57 IST|Sakshi
వేతన వెతలు

ఉపాధి కూలీలకు అందని వేతనం
రూ.4 కోట్లు సస్పెన్స్‌ అకౌంట్లలో మూలుగుతున్న వైనం
40 వేలమంది కూలీలకు ఇబ్బందులు


ఉదయగిరి: ఉదయగిరి పట్టణానికి చెందిన కిరణ్‌ అనే వికలాంగ గ్రూపు సభ్యులు 15 వారాల నుంచి పనులు చేస్తున్నా వారికీ నగదు రాలేదు. పలుమార్లు అధికారులను అడిగినా సమాధానం లేదు. తీరా ఆరాతీస్తే కూలీ నగదు సస్పెన్షన్‌ అకౌంట్‌లో పడినట్లు గా చెబుతున్నారు. ఆ అకౌంట్‌ నుంచి కూలీల ఖాతా లోకి ఎప్పుడు జమవుతుందో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితి ఏ ఒక్కరో ఇద్దరికో సంబంధించింది కాదు. జిల్లాలోని సుమారు 40 వేలమంది ఉపాధి కూలీలు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు.

దిక్కుతోచని స్థితిలో ఉపాధి కూలీలు
కరువుతో పనులు లేక ఉపాధి పనులకు వెళితే నెలల తరబడి వేతనం రాకపోవడంతో కుటుంబాలు గడవక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా గత రెండ్రోజుల నాటికి రూ.3.85 కోట్లు సస్పెన్షన్‌ (అనుమానాస్పద ఖాతా) ఖాతాల్లో ఉంది. జిల్లాలో 4.67 లక్షల మంది ఉపాధి కూలీలున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ జిల్లావ్యాప్తంగా 20–25 వేల మంది ఉపాధి పనికి వెళుతున్నారు. వీరిలో 90 శాతం మంది ఏ పూటకాపూట కుటుంబాన్ని వెళ్లదీసే వారే ఉన్నారు. వీరికి నెలల తరబడి వేతనాలు అందకపోతే కుటుంబాలు నెట్టుకొచ్చేపరిస్థితి లేదు. మరి నాలుగు నెలలనుంచి కూలీల ఖాతాల్లో నగదు జమకాడం లేదు.

సస్పెన్షన్‌ అకౌంట్లలో జమవుతూ ఉన్నాయి. పైకి చూసేందుకు నగదు కూలీలకు చేరినట్లుగా కనిపించినా అవి మాత్రం వారి ఖాతాల్లో జమకావడం లేదు. దీనికి కారణం కూలీలకు సంబంధించిన ఆధార్‌ సంఖ్య, బ్యాంకు ఖాతా అనుసంధానంలో సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యమే. పూర్తిస్థాయిలో అనుసంధానం చేయకపోవటమే ఈ తప్పిదాలకు కారణం. జరిగిన పొరపాటును సరిదిద్దాల్సిన అధికారులు, సరిచేయాల్సిన సిబ్బంది పట్టించుకోకపోవటం ఉపాధి కూలీలకు శాపంగా మారింది.

రోజుకో మార్పు
మొదట్లో ఉపాధి కూలీలకు సీఎస్పీల ద్వారా నగదు అందించేవారు. అనంతరం పోస్టాఫీసుల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. తాజాగా బ్యాంకుల ద్వారా కూలీలకు నగదు సత్వరమే అందించేందుకు అధికారులు సంకల్పించారు. ఈ విధానంలో అతివేగంగా కూలీల ఖాతాలకు నగదు జమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వ్యవస్థలో ఉన్న లోపాలు సరిదిద్దకుండా హడావుడిగా దీనిని అమలుచేయటమే ఇబ్బందులకు కారణమైంది. దీంతో ఇప్పటికే బ్యాంకుల్లో అనుమానాస్పద ఖాతాల్లో రూ.3.85 కోట్లు మూలుగుతోంది. ఈ మొత్తం కడుపేదవారికి చేరవలసిన నగదు. కానీ వారికి చేరకపోవడంతో ఆకలితో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి సస్పెన్షన్‌ ఖాతాల్లో జమై ఉన్న నగదును కూలీల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.   

మరిన్ని వార్తలు