ఆప్తుల కోసం ఎదురుచూపు

9 Sep, 2016 23:30 IST|Sakshi
క్రానిక్‌వార్డులో మృత్యువుతో పోరాడుతున్న అనాథలు
మదనపల్లె టౌన్‌: వారు పొట్టకూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి చేరుకున్నారు. నా అన్నవారు లేక ఆస్పత్రిలోని క్రానిక్‌ వార్డులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలలు గడుస్తున్నా తమ వారు రాకపోవడంతో ఎదురు చూపులతోనే గడుపుతున్నారు. బీహార్‌ రాష్ట్రం నుంచి వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై నెల రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. ఇతను హిందీలో అన్నం పెట్టాలని అడగడం తప్పా మరేమీ మాట్లాడడంలేదు. అదేవిధంగా చిత్తూరు బస్టాండులో ఆటో ఢీకొని కోమాలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని 108 సిబ్బంది వారం రోజుల క్రితం ఆస్పత్రికి చేర్చారు. ఇతని పరిస్థితి దయనీయంగా ఉంది. ఉన్న చోటే మలమూత్రాలు పోతుండడంతో వార్డులోకి వెళ్లి వైద్యులు చికిత్స అందించలేని పరిస్థితి నెలకొంది. బసినికొండకు చెందిన వేణుగోపాల్‌(65) మరుగుజ్జు ఇతనికి అందరూ ఉన్నా ఆస్పత్రిలో అనాథగా జీవిస్తున్నాడు. 20 రోజుల క్రితం అంగళ్లు సమీపంలోని తట్టివారిపల్లె వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గాయపడిన మరొక అనాథను 108 సిబ్బంది ఆస్పత్రిలో చేర్చారు. వీరు ఆప్తులు, సహాయకులు లేక చావుకు దగ్గరవుతున్నారు. 
మరిన్ని వార్తలు