మళ్లీ అవే బారులు

3 Jan, 2017 23:06 IST|Sakshi
మళ్లీ అవే బారులు

► వేతన కష్టాలు షురూ..
► ఇబ్బందులు పడ్డ పెన్షనర్లు
► బ్యాంకులు, ఏటీఎంల క్యూ

నిర్మల్‌ టౌన్ :
వేతనజీవుల కష్టాలు ప్రారంభమయ్యాయి. వేతనాలు అలా ఖాతాలో వేయడమే ఆలస్యం బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద బారులు ప్రారంభమయ్యాయి. ప్రతీ నెల వేతనం కోసం ఎదురుచూసే సగటు జీవికి ఈసారి కూడా కష్టాలు తప్పేలా లేవు. బ్యాంకుల్లో తగినంత నగదు లేకపోవడంతో బ్యాంకు అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. అలాగే బ్యాంకుల వద్ద కూడా ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లను చేయలేదు. దీంతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు పడాలి అంటూ వారు అసహనం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడి 50 రోజులు దాటినా ఇంకా ఎలాంటి నగదు కొరత వేధిస్తుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఉదయం నుంచే బారులు
బ్యాంకులు, ఏటీఎంల వద్ద వేతన జీవులు ఉదయం నుంచే బారులు తీరి కనిపించారు. బ్యాంకుల్లో పూర్తిస్థాయిలో నగదు లేకపోవడంతో మళ్లీ పాత పరిస్థితే కనిపించింది. బ్యాంకుల నుంచి ప్రతీరోజు రూ.10 వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నా, అంతస్థాయిలో నగదు లేకపోవడంతో పరిమితిని తగ్గించి నగదును ఖాతాదారులకు అందజేశారు. ఏటీఎంలలో కూడా భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరి కనిపించారు. ఎస్బీహెచ్‌ ప్రధాన ఏటీఎం మూసి ఉండడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎక్కువగా సేవలు అందించిన ఏటీఎం మూసి ఉండడంతో వారు ఇక్కట్లు పడ్డారు. ఏటీఎంలలో రూ.4,500 నగదు వస్తుండడం ఒక్కటే ఇన్ని కష్టాల మధ్య వేతన జీవులకు ఊరట కలిగించే అంశం.

తప్పని ఇబ్బందులు
రెండు నెలలుగా వేతనాల ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటి నుంచి బ్యాంకు అధికారులు ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. బ్యాంకుల్లో వేతనాల కోసం వచ్చే ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. దీంతో పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే మహిళ ఉద్యోగులు సైతం క్యూలైన్లలో వేచి ఉండలేక అవస్థలు పడ్డారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ బ్యాంకుల్లో అ లాంటి ఏర్పాట్లు కనిపించలేదు. ఒకవైపు కార్యాలయాలకు వెళ్లాల్సి రావడం మరోవైపు క్యూలైన్లలో నిల్చుండాల్సి రావడంతో వారు అసహనం వ్యక్తంచేశారు. మొదటి తేదీ ఆదివారం రావడంతో సోమవారం పెద్ద సంఖ్యలో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్దకు చేరుకున్నారు. ఉదయం బ్యాంకులు తెరవకముందే పింఛన్ దారులు పడిగాపులు కాయడం కనిపించింది.

వేతన ఇబ్బందులకు మూడో నెల
పెద్ద నోట్ల రద్దు అనంతరం రెండు నెలలుగా వేతన కష్టాలను వివిధ ఉగ్యోగులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మూడో నెల కూడా వారికి వేతనాల వెతలు తప్పలేదు. నిత్యావసర సరుకులు, ఇంటి అద్దె, విద్యుత్‌ బిల్లులు, ఇతర అవసరాల కోసం నగదు అవసరమవుతుంది. కనీస అవసరాలయిన వీటి కోసం కూడా సరిపడా నగదు చేతికి అందకపోతుండడంతో వేతన జీవులు ఆవేదన చెందుతున్నారు. రెండు నెలలుగా తాము కష్టాలను ఎదుర్కొంటున్నామని, ఈ నెల అయినా ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేస్తుందని వారు ఆశపడ్డారు. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి.

మరిన్ని వార్తలు