పనికి వెళితే ప్రాణాలు పోయాయి

23 Oct, 2016 01:14 IST|Sakshi
పనికి వెళితే ప్రాణాలు పోయాయి
తాడేపల్లిగూడెం రూరల్‌ : కూలి పనులకు వెళ్లిన వారిని అకాల మృత్యువు కబళించింది. మట్టి ఇంటిని పడగొడుతుండగా ప్రమాదవశాత్తు గోడ కూలడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను ఎస్సీ ఏరియాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆరుగొలను ఎస్సీ ఏరియాలోని గెడ్డం అంజియ్యకు చెందిన మట్టి ఇంటిని పడగొట్టే పనులు ఇటీవల ప్రారంభించారు. దీనిలో భాగంగా శనివారం పనులు చేస్తుండగా కూలీలపై గోడ కూలింది. దీంతో కూలీలు గోపిరెడ్డి శ్రీనివాస్‌ (45), కండెల్లి రాముడు (55) మృతి చెందారు. శ్రీనివాస్‌ తల గుర్తుపట్టలేని విధంగా నుజ్జునుజ్జయ్యింది. వీఆర్వో వైఐవీ మంగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్సై వి.చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. 
 
కూలీ బతుకుల్లో పుట్టెడు శోకం 
మృతులు శ్రీనివాస్, రాముడు రోజు వారీ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్‌కు భార్య పద్మ, కుమార్తె కల్యాణి, కుమారుడు సతీష్‌ ఉన్నారు. కల్యాణికి వివాహం కాగా సతీష్‌ కూడా కూలీ పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.  శ్రీనివాస్‌ మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. కండెల్లి రాముడుకు భార్య చంద్రమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా పెద్ద కుమారుడు అబ్బులు కూలీ పనులు చేస్తున్నాడు. రెండో కుమారుడు వెంకటేశ్వరరావు జూనియర్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఒకే రోజు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన కుటుంబ పెద్దలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 
 
>
మరిన్ని వార్తలు