జీవించే ఉన్నారా?

31 May, 2016 02:58 IST|Sakshi
జీవించే ఉన్నారా?

జిల్లా యంత్రాంగం సరికొత్త కార్యక్రమం
అక్రమాలకు చెక్ పెట్టేందుకు ‘ప్రయోగం’
జూన్ 1 నుంచే అమల్లోకి..
‘లైవ్ సర్టిఫికెట్’ ఉంటేనే ‘ఆసరా’

జిల్లాలో 3,40,880 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 92,802 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నారు.

లబ్ధిదారులు జూన్ 1 నుంచి 25లోపు ‘లైవ్ సర్టిఫికెట్ల’ను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించాలి. వాటిని సమర్పించిన వారికే పింఛన్లు.

మీసేవ కేంద్రాల్లో బయోమెట్రిక్, ఐరీస్ పద్ధతిలో వివరాలు సమర్పిస్తే వెనువెంటనే లైవ్ సర్టిఫికెట్లు జారీ అయ్యేలా జిల్లా యంత్రాంగం ఇప్పటికే చర్యలు తీసుకుంది.

ఆసరా పథకంలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి పింఛన్ దారుడు ఇకపై జీవించి ఉన్నట్టు నిర్ధారణ (లైవ్ సర్టిఫికెట్) పత్రాన్ని సమర్పిస్తేనే పింఛన్ డబ్బులు ఇచ్చేలా చర్యలు చేపడుతోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రామీణ ప్రాంతాల్లో బయోమెట్రిక్ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుడికే పింఛన్ డబ్బులు అందిస్తుండగా.. పట్టణ ప్రాంతంలో మాత్రం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో ఈ మొత్తాన్ని  జమచేస్తున్నారు. ఈక్రమంలో లబ్ధిదారులు మరణించినప్పటికీ.. వారి కుటుంబీకులు  పింఛన్ డబ్బులను బ్యాంకు నుంచి డ్రా చేస్తున్నారు. ఈక్రమంలో మరణించిన  వారిని జాబితా నుంచి తొలగించేందుకు ఉపక్రమించిన యంత్రాంగం.. జీవించి ఉన్నట్లు నిర్ధారించే సర్టిఫికెట్లను లబ్ధిదారుల నుంచి కోరుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లా ప్రాంతానికి చెందిన లబ్ధిదారులంతా జూన్ 1వ తేదీ నుంచి 25లోపు ఈ సర్టిఫికెట్లను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. వీటిని సమర్పించిన వారికే పింఛన్ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.

 జిల్లాలో 3,40,880 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 92,802 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నారు. అల్వాల్, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి-1, శేరిలింగంపల్లి-2, ఉప్పల్, కాప్రా సర్కిళ్ల పరిధిలోని ఈ లబ్ధిదారులకు పింఛన్ డబ్బును బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నారు. జిల్లా యంత్రాంగం తాజా నిర్ణయంతో ఈ సర్కిళ్లలోని లబ్ధిదారులు లైవ్ సర్టిఫికెట్లను సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి. ఇందుకుగాను సమీప మీసేవ కేంద్రాల్లో బయోమెట్రిక్, ఐరీస్ పద్ధతిలో వివరాలు సమరిస్తే వెనువెంటనే లైవ్ సర్టిఫికెట్లు జారీ అయ్యేలా యంత్రాంగం సాఫ్ట్‌వేర్ తయారు చేసింది. ఇందుకు సంబంధించి మీసేవ నిర్వాహకులకు రెండ్రోజుల క్రితం కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చింది. ఈ సర్టిఫికెట్లు సమర్పించకుంటే వారికి వచ్చే నెల నుంచి ఆసరా ఫించన్ నిలిచిపోనుంది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా