తెరిపించాలి

26 Mar, 2016 03:10 IST|Sakshi
తెరిపించాలి

నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవాలి
వేతన బకాయిలు చెల్లించాలి
లేకపోతే ఉద్యమం ఉధృతం
కార్మిక కుటుంబాల ఆందోళన బాట
నేడు రోడ్డు  దిగ్బంధం

ఎన్‌డీఎస్‌ఎల్ లే ఆఫ్ ఎత్తివేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నెరవేర్చాలన్న ప్రధాన డిమాండ్‌లతో నిజాంషుగర్స్ రక్షణ కమిటీ చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. తొమ్మిది నెలల క్రితం తెలంగాణ ప్రజాఫ్రంట్, తొమ్మిది వామపక్ష పార్టీలు కలిసి నిజాంషుగర్స్ రక్షణ కమిటీని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, శివసేన, టీడీపీలు మద్దతు పలికాయి. ఫ్యాక్టరీ రక్షణ కోసం కొన్ని నెలల నుంచి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అఖిల పక్షం అధ్వర్యంలో శనివారం బోధన్ మండలం సాలూర వద్ద అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేయనున్నారు. 

బోధన్ : 2015-16 క్రషింగ్ సీజన్‌ను నవంబర్, డిసెంబర్ మాసాల్లో ప్రారంభించాల్సి ఉండగా ఎన్డీఎస్‌ఎల్ యాజమాన్యం చేతులెత్తేసింది, ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు వెనుకంజ వేసింది. బోధన్‌లోని శక్కర్‌నగర్, ముత్యంపేట (కరీంనగర్) ముంజోజిపల్లి (మెదక్) ఫ్యాక్టరీల పరిధిలోని చెరకును ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలకు మళించారు. ముడిసరుకు కొరత సాకు చూపి ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం 2015 డిసెంబర్ 23న లేఆఫ్ నోటీసు జారీ చేసి ఫ్యాక్టరీలను తాత్కాలికంగా మూసివేసింది. దీంతో మూడు యూనిట్ల పరిధిలోని కార్మికులు ఉపాధి కోల్పో యి రోడ్డున పడ్డారు.

అప్పటి నుంచి కార్మికులు ఆందోళన బాటపట్టారు. కార్మికుల ఆందోళనకు నిజాంషుగర్స్ రక్షణ కమిటీ అండగా నిలిచింది. నిజాంషుగర్స్ రక్షణ కమిటీ, ఎన్‌డీఎస్‌ఎల్ కార్మిక సంఘాలు ఐక్యతతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్‌డీఎస్‌ఎల్ లేఆఫ్ ప్రకటించి మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంలో జాప్యం చేస్తోంది. దీంతో కార్మికులు, రైతుల్లో ప్రభుత్వం పై అసహనం, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ.. ఫ్యాక్టరీ భవిష్యత్తు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి కావస్తున్నా నిజాంషుగర్స్ స్వాధీనం పై ప్రభుత్వం విధాన పరమైన సానుకూల నిర్ణయం తీసుకోకుండా కమిటీల అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తోందని అఖిల పక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

 129 రోజులుగా రిలే నిరహార దీక్షలు
నిజాంషుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడుపాలని ప్రధాన డిమాండ్‌తో ఏర్పడిన నిజాంషుగర్స్ రక్షణ కమిటీ ఒక వైపు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తునే, మరో వైపు రిలే నిరహార దీక్ష శిబిరాన్ని కొనసాగిస్తోంది. 2015 నవంబర్ 18 పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరహార దీక్షను ప్రారంభించా రు. అప్పటి నుంచి ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు, వామపక్ష పార్టీలు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు వంతుల వారీగా రిలే నిరహార దీక్షలో కూర్చుంటున్నారు. శుక్రవారం నాటికి రిలే నిరహార దీక్షలు 129 రోజులు పూర్తికాగా.. కార్మికుల కుటుంబాలు పిల్లాపాపలతో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్డీఎస్‌ఎల్ యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని రక్షణ కమిటీ సంకల్పంతో ముందుకెళ్తోంది. సాలూర వద్ద అంతర్రాష్ట్ర రోడ్డు దిగ్బంధం కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని నిజాంషుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు కోరారు.

మరిన్ని వార్తలు