రసకందాయంలో ’రెవెన్యూ’ వివాదం

6 Mar, 2017 22:40 IST|Sakshi
రసకందాయంలో ’రెవెన్యూ’ వివాదం
కలెక్టర్‌ భాస్కర్‌పై కస్సుమన్న రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు
 ఉద్యోగం చేయడానికి వచ్చావా.. రాజకీయం చేయడానికి వచ్చావా అంటూ ఆగ్రహం
 అంటరానితనాన్ని అవలంబిస్తున్నారంటూ ఆరోపణ
ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) :
జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్, జిల్లా రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎల్‌.విద్యాసాగర్‌ మధ్య తలెత్తిన వివాదం రసకందాయంలో పడింది. స్థానిక కోటదిబ్బలోని పెన్షనర్స్‌ హాల్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించిన విద్యాసాగర్‌ కలెక్టర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిమ్న జాతీయుడనైన తనను లొంగదీసుకోవడానికి కలెక్టర్‌ నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. ’కుయుక్తులు ప్రదర్శించి.. తహసీల్దార్లను బెదిరించి, ప్రలోభ పెట్టి వర్క్‌ టు రూల్‌ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయించావ్‌. అధికారులు, ఉద్యోగులు, చివరకు రాజకీయ నాయకుల మధ్య కూడా కుల వివక్ష రెచ్చగొడుతున్నావ్‌. నిమ్న జాతీయుడిని కాబట్టే నన్ను అక్రమంగా బదిలీ చేశావ్‌. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడా ఇటువంటివి జరగలేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడే పనిచేస్తున్నాను. దాంతో రేషన్‌ డీలర్లను లొంగదీసుకుని డ్రామాకు తెరలేపి నాపై ఆరోపణలు చేయించావ్‌’ అంటూ కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. ’నన్ను సస్పెండ్‌ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ను ఆదేశించావ్‌. ఆయన అది సాధ్యం కాదని చెప్పడంతో మీరంతా ఒకటే అన్నావ్‌. మీరంతా ఒకటే అనడంలో నీ ఆంతర్యమేమిటి. ఆయన, నేను ఒకే జాతికి చెందినవాళ్లమనా. ముఖ్యమంత్రి నీ చుట్టమని చెబుతావా.. నువ్వు ట్రాన్స్‌ఫర్‌ అవ్వవా. నువ్వు ఉద్యోగివి కాదా. టీఏ, డీఏలు తీసుకోవడం లేదని చెబుతున్నావు. జీతం కూడా తీసుకోకుండా పనిచేయి. తూర్పుగోదావరి జిల్లాలో నీ ఎర్రబుగ్గ కారు ఎవరు వాడుకున్నారు. దానిని వదిలేసి పారిపోయిందెవరు. అక్కడే తెలిసిపోతోంది నీ నిజాయితీ’ అంటూ ధ్వజమెత్తారు. ’నాకు ఉద్యోగం తృణ ప్రాయమని ఎప్పుడో చెప్పాను. నేను లీడర్‌ని, ఉద్యమకారుడిని. నువ్వు నన్ను ఏమీ చేయలేవ్‌. డ్రామాలొద్దు నన్ను ఎప్పుడు టెర్మినేట్‌ చేస్తావో చెప్పు కలెక్టర్‌. 2014 సంవత్సరంలో చేపట్టిన ఉద్యోగుల ఉద్యమాన్ని నిలుపుదల చేయడానికి ముఖ్యమంత్రి, మంత్రి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మాతో చర్చించాల్సి వచ్చింది. అప్పుడు కాళ్ల బేరానికి వచ్చిన సంగతి మర్చిపోయావా. అదే 2014లో నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి నేను నిర్దోషినని చెప్పావ్‌ గుర్తు లేదా. టార్గెట్‌ సాగర్‌ ఉద్యమాన్ని ప్రారంభించావు. నన్ను ఉద్యోగం నుంచి తీయగలవే తప్ప ఉరితీయలేవు కదా. ఖబడ్దార్‌.. నేను లంచగొండినైతే ఏసీబీ నిద్రపోతోందా. నువ్వు నిద్రపోతావా. ఈ జిల్లాకు వచ్చిన తరువాత నీ కుల దురహంకారంతో ఎంతమంది అధికారులను ప్రభుత్వానికి సరెండర్‌ చేశావ్. ఎంతమందిని టెర్మినేట్‌ చేశావ్. ఎంతమందిని సస్పెండ్‌ చేశావ్‌. వారి ఉసురు పోసుకుంటావ్‌. ఒక బీసీ ఉద్యోగిని నీకు సన్మానం చేస్తానంటూ ఎగతాళిగా మాట్లాడతావా. ఇప్పుడు కూడా బహిరంగ విచారణ చేసుకో. నువ్వే ఇంటింటికీ తిరుగు. నీతిగల నాయకుడిని నేను. నీ కాళ్లు పట్టుకోను. ఇకనైనా నీ వెర్రి చేష్టలకు ఫుల్‌స్టాప్‌ పెట్టు. లేకుంటే నువ్వు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టం. హద్దులు దాటిపోయావ్. అంటరానితనాన్ని అవలంబిస్తున్నావ్. అట్రాసిటీ పెడితే అట్టడుగుకు పోతావ్‌. ఖబడ్దార్‌’ అంటూ కలెక్టర్‌పై విద్యాసాగర్‌ విరుచుకుపడ్డారు. అంతకుముందు రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజులపాటి గంగాధరరావు మాట్లాడుతూ విద్యాసాగర్‌పై జరుగుతున్న ఎదురు దాడిలో రేషన్‌ డీలర్లను పావులుగా వాడుకుంటున్నారన్నారు. సాగర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన వారిలో ఎక్కువ మంది బినామీ డీలర్లేనన్నారు. ఆయన డీలర్లను డబ్బులడిగితే ఏసీబీకి ఫిర్యదు చేయాలే గానీ ఇలా అల్లరి చేయడం తగదన్నారు.
 
మరిన్ని వార్తలు