ప్రేమికులను బెదిరించి యువతిపై అత్యాచారం

12 Jan, 2016 11:24 IST|Sakshi
ప్రేమికులను బెదిరించి యువతిపై అత్యాచారం

శాయంపేట : వరంగల్‌ జిల్లా శాయంపేటలో అమానుష సంఘటన జరిగింది. టీఆర్‌ఎస్‌ యూత్‌ ప్రెసిడెంట్‌ రీనాకర్ ఓ ప్రేమజంటను బెదిరించి... యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు... శాయంపేటకు చెందిన గొట్టిముక్కల వినయ్ (22) హన్మకొండలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

 

అదే కళాశాలలో చదువుతున్న ఖాజీపేటకు చెందిన ఓ విద్యార్థిని, వినయ్ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలసి గత నెల 31న సాయంత్రం శాయంపేటకు చేరుకున్నారు. మైలారం రోడ్డులో నడచి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డగించారు. ఎవరని ప్రశ్నించడంతో.. పక్కనున్న యువతి తన ప్రియురాలిగా వినయ్ వారికి చెప్పాడు. దీంతో ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి టీఆర్‌ఎస్ యూత్ నాయకుడు కూతాటి రీనాకర్‌కు కాల్ చేసి ఆ విషయాన్ని తెలిపాడు. వెంటనే రీనాకర్ బైక్‌పై అక్కడకు చేరుకున్నాడు. వారు తనకు తెలిసిన వారేనని చెప్పి ఆ ముగ్గురినీ అక్కడి నుంచి పంపించేశాడు.

ఆ తర్వాత రీనాకర్ వినయ్, అతడి ప్రియురాలిని ఎక్కడికి వెళుతున్నారని అడగ్గా... వారి ప్రేమ వ్యవహారం గురించి వివరించి చెప్పారు. దీంతో మీ విషయం పోలీసులకు, మీడియాకు తెలిసిందని, వాళ్లు వస్తున్నారని తప్పించుకోవాలని సూచించాడు. వినయ్‌ను ఎటో ఒకవైపు పారిపొమ్మని చెప్పి, ఆ యువతిని మాందారిపేట వద్ద బస్సు ఎక్కిస్తానని చెప్పి తన బైక్‌పై ఎక్కించుకున్నాడు. పోలీసులు, మీడియా కంట పడే అవకాశం ఉందంటూ సమీపంలోని గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లాడు. మీడియాకు, పోలీసులకు దొరికిపోతావా, లేకుంటే తాను చెప్పినట్టు వింటావా అని ఆమెను బెదిరించి ఆ రాత్రంతా పలుమార్లు అత్యాచారం చేశాడు.

అనంతరం ఆమెను బస్సు ఎక్కించేశాడు. అయితే, జరిగిన ఘోరాన్ని బాధితురాలు వినయ్‌కు చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. అయినా, తాను పెళ్లి చేసుకుంటానని, ధైర్యంగా ఉండమని వినయ్ భరోసా ఇచ్చాడు. బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని సముదాయించాడు. అయితే, రీనాకర్ ....పోలీసులు, మీడియాకు ఈ విషయం తెలిసిందని, వారిని మేనేజ్ చేయాలని చెప్పి రూ.30 వేలు ఇవ్వాలని వినయ్‌ను వేధించడం ప్రారంభించాడు.

 

భయంతో వినయ్ రూ.5 వేలు ఇచ్చినా రీనాకర్ సంతృప్తి చెందలేదు. అతడి వేధింపులతో విసిగిపోయిన వినయ్ సోమవారం శాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, రీనాకర్ను అదుపులోకి తీసుకని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు నేరాన్ని అంగీకరించనిట్లు సమాచారం. అతడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న రీనాకర్‌ను టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సోమవారమే బహిష్కరించారు. కాగా రీనాకర్పై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు