వరంగల్ నేతన్నకు జాతీయ అవార్డు

8 Jul, 2016 19:52 IST|Sakshi
వరంగల్ నేతన్నకు జాతీయ అవార్డు

పోచమ్మమైదాన్ (వరంగల్): వరంగల్ చేనేత కార్మికుడికి అరుదైన గౌరవం దక్కింది. నగరంలోని కొత్తవాడకు చెందిన పిట్ట రాములు జాతీయ హ్యాండ్లూం అవార్డుకు ఎంపికైనట్లు శుక్రవారం లేఖ అందింది. ఆ లేఖను రాములు విలేకరులకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో హ్యాండ్లూం ధర్రి(జంపకాన)కి జాతీయ అవార్డు రావడం ఇదే తొలిసారని చెప్పారు.

నాలుగు నెలలపాటు కష్టపడి మొగల్ సామ్రాజ్య వేట విధానాన్ని ధర్రిలో వేశానని, ఈ సమయంలో వేరే పని చేయకుండా దీనికోసమే పని చేశానని తెలిపారు. తన కష్టానికి ఫలితం దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు చెప్పారు. గత ఏడాది మార్చి 15న అవార్డు కోసం దరఖాస్తు చేశానని, పలువురు అధికారులు వచ్చి ధర్రిని పరిశీలించారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 20 మందికి అవార్డులు అందజేస్తారన్నారు.

మరిన్ని వార్తలు