నీటి చార్జీలు ఔట్ సోర్సింగ్!

21 Aug, 2015 01:38 IST|Sakshi

⇒ తొలుత గ్రేటర్ వరంగల్‌లో అమలు
⇒ పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
⇒ నల్లా బిల్లుల వసూళ్లు
⇒ 6.90 శాతానికి తగ్గడమే కారణం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నల్లా బిల్లుల వసూళ్ల బాధ్యతను ఔట్‌సోర్సింగ్ సంస్థలకు అప్పగించనున్నారా..? నగరాలు, పట్టణాల్లో నల్లా బిల్లుల వసూళ్లు అంతంత మాత్రంగా ఉండటంతో ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలి స్తోందా..? దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. నీటి బిల్లుల వసూళ్లలో పురపాలక సంఘాలు విఫలమవుతున్న నేపథ్యంలో ఆ బాధ్యతలను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ మినహా.. రాష్ట్రంలోని ఇతర నగర, పట్టణాల్లో బిల్లుల వసూళ్లు ఇప్పటివరకూ 6.90 శాతమే వసూలవ్వడంతో ప్రభుత్వం ఔట్ సోర్సింగ్‌పై దృష్టి సారించినట్టు సమాచారం.

 1 నుంచి ‘రెవెన్యూ’ పర్యవేక్షణ
 జనాభా ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఉన్న గృహాల సంఖ్యతో పోలిస్తే అధికారిక  నల్లా కనెక్షన్ల సంఖ్య  తక్కువగా ఉంది. ఉన్న అధికారిక కనెక్షన్ల నుంచి సైతం సక్రమంగా బిల్లుల వసూళ్లు లేవు. నీటి బిల్లుల వసూళ్లను పర్యవేక్షిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది ఇతర బాధ్యతలు, పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పురపాలక శాఖ జరిపిన అంతర్గత సమీక్షలో నల్లా బిల్లుల వసూళ్ల బాధ్యతను రెవెన్యూ వి భాగాలకు బదలాయించారు. సెప్టెంబర్ 1 నుంచి నల్లా బిల్లుల బాధ్యతలను మున్సిపాలిటీల రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు పర్యవేక్షించనున్నారు. నల్లా చార్జీల వసూళ్లను ఔట్ సోర్సింగ్‌కు అప్పగిస్తే బిల్లుల ఎగవేతలను నివారించవచ్చనే అంశంపైనా ఈ సమీక్షలో చర్చించినట్లు తెలిసింది.  తొలుత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దీనిని అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది.
 ఇక ఆన్‌లైన్‌లో నల్లా బిల్లులు..
 నల్లా బిల్లుల వసూళ్లు, బకాయిలకు సంబంధించిన సరైన రికార్డులు మున్సిపాలిటీల వద్ద లేవు. బిల్లుల వసూళ్లలో లొసుగులను దాచిపెట్టేందుకు స్థానిక సిబ్బందే రికార్డులను మాయం చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఇకపై ఇలా జరగకుండా నల్లా బిల్లుల వసూళ్లను సైతం ఆన్‌లైన్ చేయాలని నిర్ణయించారు. అక్రమాలను నియంత్రించడానికి ఆస్తి పన్నులు, ఇతరత్రా వసూళ్లను ఏ రోజుకు ఆరోజు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి నీటి బిల్లుల వసూళ్లను సైతం ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయనున్నారు.
 ఇంకా నిర్ణయం తీసుకోలేదు
 నల్లా బిల్లులను ఔట్ సోర్సింగ్ చేయాలన్న అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిగిన బిల్లుల చెల్లింపులు, బకాయిల రికార్డులను ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నాం. ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం.    - శ్రీనివాస్‌రెడ్డి
     జాయింట్ డెరైక్టర్, పురపాలక శాఖ
 

మరిన్ని వార్తలు