నీటి దోపిడీ

5 Apr, 2017 00:26 IST|Sakshi
నీటి దోపిడీ

- తాగునీటి ధరలు పెంచేసిన నిర్వాహకులు
- బిందె రూ.10 చొప్పున అమ్ముతున్న వైనం
- శ్రీరామిరెడ్డి పథకంపై అంతు లేని నిర్లక్ష్యం


హిందూపురం అర్బన్‌ : పట్టణంతో తాగునీటి పేరుతో నిలువుదోపిడీ జరుగుతోంది. డిమాండ్‌ ఆధారంగా ట్యాంకర్ల నిర్వాహకులు బిందె రూ.10కు అమ్ముతున్నారు. దీంతో సామాన్య ప్రజలు శుద్ధజలం కొనలేకపోతున్నారు. హిందూపురం ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. 1000 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీరు లభించే పరిస్థితి లేదు. దీంతో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోంది. పట్టణంలో 1.60 లక్షల జనాభాకు రోజుకు సుమారు 12 ఎంఎల్‌డీ నీరు అవసరం. అయితే పీఏబీఆర్‌ నుంచి 3, మున్సిపాల్టీ పరిధిలోని 9 బోర్ల నుంచి 2 ఎంఎల్‌డీ నీరు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో ప్రైవేట్‌ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న ప్రైవేట్‌ ట్యాంకర్ల నిర్వాహకులు అక్రమార్జనకు తెరలేపారు. బిందె తాగునీరు రూ.10కు పెంచేశారు. పట్టణంలో సుమారు 42 వేల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి నీటికోసం రోజుకు రూ.20 ఖర్చవుతోంది. ఈప్రకారం ప్రజలు ప్రైవేట్‌ ట్యాంకర్ల వద్ద తాగునీటి కోసం ప్రతినెలా సుమారు రూ.2.40 కోట్లు వ్యయం చేసి నీటిని కొనుగోలు చేస్తున్నారు. అయినా ప్రజల దాహార్తి తీరడం లేదు.

శ్రీరామిరెడ్డి పథకంపై అలసత్వం
ఆసియాలోనే అతిపెద్దదైన నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి నీటిపథకం నిర్వహణ లోపంతో నిర్వీర్యమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ పథకాన్ని సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వ అధికారులు అంతు లేని అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా హిందూపురం మున్సిపాల్టీతో పాటు 6 నియోజకవర్గాల ప్రజలు తీవ్ర దాహార్తితో అల్లాడిపోతున్నారు. పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌) నుంచి సుమారు 14 వందల కిలోమీటర్ల మేర పైపులైన్లు వేయించి మంచినీరు అందించేందుకు ఆయన చర్యలు తీసుకున్నారు. కానీ సమర్థంగా నిర్వహించలేకపోతున్నారు. ప్రతి ఏటా రూ.కోట్లు వ్యయం చేస్తున్నా పథకాన్ని పటిష్టం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది.

ట్రిప్పునకు రూ.400 ఇస్తాం
హిందూపురం పట్టణంలో తాగునీటి ఇబ్బందుల దృష్యా మున్సిపాల్టీకి కాంట్రాక్టు పద్ధతిన ట్యాంకర్లకు ఇస్తున్న అద్దెను రూ.300 బదులు రూ.400 ఇవ్వడానికి కలెక్టర్‌ అంగీకరించారు. ఈమేరకు మంగళవారం సాయంత్రం మున్సిపల్‌ కమిషనర్‌ విశ్వనాథ్, చైర్‌పర్సన్‌ ఆర్‌.లక్ష్మితో పాటు ఇంజినీరింగ్‌ అ«ధికారులు అనంతపురం తరలివెళ్లి కలెక్టర్‌ కోన శశిధర్‌తో తాగునీటి ఎద్దడి ట్యాంకర్ల కాంట్రాక్టర్ల డిమాండ్‌ను తెలియజేశారు. స్పందించిన కలెక్టర్‌ రూ.400 ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు