ఇబ్బిందెలు

31 Mar, 2016 03:41 IST|Sakshi
ఇబ్బిందెలు

ఇదీ వరస ఖేడ్ కన్నీటి వెత..
తాగునీటికీ తండ్లాటే కానరాని నీటి జాడలు
ఎండిన మంజీర  మూతపడ్డ బోరుబావులు
చుక్కనీరు దొరికితే ఒట్టు
దప్పిక తీరక ఊపిరి వదులుతున్న పశువులు, పక్షులు
‘ఖేడ్’ను వణికిస్తున్న నీటి ఎద్దడి

కరువు... కరువు.. కరువు... ఈ పేరు వింటేనే రైతులు, ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మూడు దశాబ్దాల నాటి తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు మంజీర ఎండిపోగా మరోవైపు భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయాయి. బోరుబావులు, చేతిపంపులు పనిచేయడం లేదు. పంటలు లేకపోగా, తాగునీటికీ తండ్లాట తప్పడం లేదు. బిందెడు నీరు దొరకడమే గగనంగా మారింది. చిన్నాపెద్దా, పిల్లాజెల్లా అంతా బిందెలు పట్టుకుని పొలాల వైపు పరుగులు తీస్తున్నారు. కరువు ధాటికి పశుపక్షాదులు ప్రాణాలు కోల్పోతున్నాయి. మంచినీటి ఎద్దడి ఖేడ్ నియోజకవర్గ ప్రజలను బెంబేలెత్తిస్తోంది.  - మనూరు

పంటల దుస్థితి ఇలా...
మంజీర నది మనూరు మండల పరిధిలో దాదాపు 40 కిలోమీటర్ల మేర పారుతుంది. నది వెంట ఉన్న పరీవాహక గ్రామాల రైతులు ఈ నది నీటిపైనే ఆధారపడి పంటలు సాగుచేసుకుంటున్నారు. 2,348 వేల హెక్టార్ల చెరకు సాగులో ఉంది. వరి పంట 2,538 హెక్టార్లు సాగులో ఉండగా ప్రస్తుతం పూర్తిగా పడిపోయింది. కల్హేర్ మండలంలో కొంత మేర సాగులో ఉంది. చెరకు పంటకు నీరందకపోవడంతో తొలగిస్తున్నారు. బోరు బావులపై ఆధారపడిన రైతులు ఇప్పటికే వ్యవసాయ పనులు మానేశారు. ఉల్లి, వరి, కూరగాయల  సాగు సైతం పడిపోయింది. నీరు లేక సాగులో ఉన్న ఉల్లి ఎండుముఖం పడుతుంది.

మరింత లోతుకు భూగర్భ జలాలు..
గత ఏడాది కంటే ఈ ఏడాది భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయాయి. దీంతో గ్రామాల్లో సైతం తాగునీటికి కటకట ఏర్పడింది. నియోజక వర్గంలోని 165 గ్రామాలు, 226 తండాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు 25 మీటర్ల లోతుకుపైగా పడిపోయాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

 మైదానంలా మంజీర..
మంజీర నది పూర్తిగా ఎండిపోవడంతో మైదానంలా మారింది. ఎటుచూసినా నీటి మడుగులు కన్పించే పరిస్థితి లేదు. నీరులేక మూగజీవాలు సైతం అల్లాడుతున్నాయి. తాగు నీటి కోసం ఇప్పటికే అడవి పందులు, నెమళ్లు వంటి జీవాలు మృత్యువాత పడుతున్నాయి.

 నదిలో తవ్వుతున్న ఊటబావులు..
నియోజకవర్గంలోని ఒక్క కల్హేర్ మండలాన్ని మినహాయిస్తే మొత్తం గ్రామాలు, తండాలకు నీటి సరఫరా కోసం బోరంచ, గుడూరు, షాపూర్ మంచినీటి పథకాలు ఉన్నాయి. మంజీరలో నీరు లేకపోవడంతో తాగునీటి సరఫరాకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నదిలో ఊటబావులు తవ్విస్తున్నారు. ఈ రకంగా రెండురోజులకోమారు సగం గ్రామాలకు నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో సైతం రోజురోజుకూ నీటి లభ్యత తగ్గిపోతోంది. ఏప్రిల్, మే నెలల్లో తాగునీటి ఎద్దడి మరింత పెరిగే అవకాశం ఉంది.

 ఖేడ్ పట్టణంలో..
ఖేడ్ పట్టణంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇన్నాళ్లు వందల రూపాయలు వెచ్చించి ట్యాంకర్ నీటిని కొనుగోలు చేసిన వారు ఇప్పుడు ఆ ధర వెయ్యి రూపాయలు దాటిపోతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఫలి తంగా పట్టణంలోని అనేక మంది ఉద్యోగులు తమ ఇళ్లను ఖాళీచేసి గ్రామాలకు తరలిపోతున్నారు. గ్రామాల్లో ఏదో విధంగా ఈ వేసవిని గడిపితే గండం గట్టెక్కుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిల్లల పరీక్షల కోసం ఖేడ్‌లో ఉంటున్నామని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు