దాహం..దాహం..

1 Apr, 2016 03:42 IST|Sakshi
దాహం..దాహం..

కడప నగరంలోని పలు కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రతరం
అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడిన కార్పొరేటర్లు
బడ్జెట్ సమావేశంలో తాగునీటి సమస్యపైనే ప్రధాన చర్చ
డివిజన్ల వారీగా దాహార్తి సమస్యలు ఏకరువు
సోమశిల బ్యాక్ వాటర్ స్కీమ్ తీసుకు రావాలని తీర్మానం

కడప కార్పొరేషన్ : కడప నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించడంపై అధికారులు శ్రద్ధ చూపడం లేదని కార్పొరేటర్లు మండిపడ్డారు. ఏ కాలనీలో చూసినా నీటి సరఫరా సక్రమంగా లేదని గురువారం నిర్వహించిన నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేయడంతో తాగునీటి సమస్యే ప్రధాన అజెండాగా తీసుకుని చర్చించారు. నగర మేయర్ కె.సురేష్‌బాబు అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే గుర్రాలగడ్డ, దస్తగిరి జెండా వీధి, రాజాఖాన్‌భాగ్ వీధులకు మంచి నీరు ఇవ్వాలని 31వ డివిజన్ కార్పొరేటర్ ఎంఎల్‌ఎన్ సురేష్ ప్ల కార్డు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంలోనే మేయర్.. తాగునీటిపై చర్చకు అనుమతించారు. 3వ డివిజన్‌లోని శ్రీరామ్‌నగర్, ఆర్కేనగర్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆ డివిజన్ కార్పొరేటర్ కుర్రా లక్ష్మిదేవి సభ దృష్టికి తీసుకు రాగా, దీనికి మేయర్ మద్దతు తెలుపుతూ 3వ డివిజన్‌లో సుమారు 25 వేల మంది ఉన్నారని, వారికి సరిపడా నీరు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

22వ డివిజన్‌లో 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పైప్‌లైన్ పనులను పూర్తి చేయకపోవడంపై ఆ డివిజన్ కార్పొరేటర్ బోలా పద్మావతి సమావేశం మధ్యలో కూర్చొని నిరసన తెలిపారు. ఆరు నెలలుగా తిరుగుతున్నా పనులు ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ పి.చంద్రమౌళీశ్వర్‌రెడ్డి సమాధానం ఇస్తూ రోడ్డు కటింగ్ కోసం రూ. 14 లక్షలు చెల్లించాలని ఆర్‌అండ్‌బీ వారు అడుగుతున్నారని, దీనివల్ల ఆలస్యమవుతోందని చెప్పారు. దీనిపై 15 రోజుల్లో అనుమతి రాకపోతే నగర పాలక సంస్థ పాలకవర్గమంతా ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద ఆందోళన చేయాలని మేయర్ తీర్మానం చేశారు. బండి కనుమ ట్యాంకు నిర్మాణం జరిగి తొమ్మిది నెలలైనా దాన్ని ఎందుకు ఉపయోగంలోకి తీసుకు రాలేదని సభ్యుడు మగ్బూల్‌బాష ప్రశ్నించారు.

నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు సోమశిల బ్యాక్ వాటర్ స్కీం తీసుకు రావాలని ప్రతిపాదించగా సభ ఆమోదం తెలిపింది. అనంతరం రూ.124.32 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను నగర పాలక వర్గం ఆమోదించింది. కార్పొరేషన్ నిధులను జన్మభూమి, ఎన్‌టీఆర్ సుజల పథకాలకు వినియోగించడంపై వైఎస్‌ఆర్ సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ అంచనాల్లోనూ, సవరించిన బడ్జెట్‌లోనూ తప్పులు దొర్లాయని ఎమ్మెల్యే, మేయర్ విమర్శించారు. సమావేశంలో డెప్యూటీ మేయర్ బి.ఆరీఫుల్లా, కార్పొరేటర్లు చల్లా రాజశేఖర్, పాకా సురేష్, జావేద్ అహ్మద్, అన్సర్ అలీ, కో ఆప్షన్ సభ్యులు టీపీ వెంకట సుబ్బమ్మ, నాగమల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 ప్రజాప్రతినిధుల ఆవేదనను అర్థం చేసుకోవాలి : ఎమ్మెల్యే అంజాద్ బాషా
ప్రజాప్రతినిధుల ఆవేదనను అధికారులు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాష సూచించారు. కరువు సమయంలో అత్యవసరంగా పనులు చేసేందుకు ఎలాంటి ఆక్షేపణలు ఉండవని, ఈ మేరకు అధికారులు ముందుండి పని చేయాలన్నారు. జరుగుతున్న పనులపై కమిషనర్ ప్రతిరోజు సమీక్ష చేయాలన్నారు. మన మధ్య ఉన్న లోపాల వల్ల ప్రజలకు నష్టం జరగకూడదని ఆయన తెలిపారు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 10వ తేది వరకు నీటిని విడుదల చేయాల్సిందిగా సంబంధిత మంత్రితో మాట్లాడామని తెలిపారు.

 చర్చకు వచ్చిన ప్రధాన సమస్యలు
ఐదవ డివిజన్‌లోని అశోక్‌నగర్‌లో నాలుగు బోరు బావులకు మోటార్లు బిగించి కనెక్షన్లు ఇవ్వాలి.
11వ డివిజన్‌లోని భాగ్యనగర్ కాలనీ ఎదురుగా ఎంజే కుంటలో ఐదు రోజులకు ఒకసారి కూడా నీరు రావడం లేదు.
12వ డివిజన్‌లోని ఓం శాంతినగర్, ముత్తరాసుపల్లె ప్రాంతాలకు సక్రమంగా నీరు సరఫరా కావడం లేదు.
13వ డివిజన్‌లోని నిరంజన్‌నగర్, ప్రకాశ్‌నగర్ కట్టా, పటేల్ రోడ్డు ప్రాంతాల్లో ఏడాది పొడవునా తాగునీటి సమస్య ఉంటోంది.
30వ డివిజన్‌లో పసుపు వర్ణంలో నీళ్లు సరఫరా అవుతున్నాయి.

మరిన్ని వార్తలు