భూగర్భ శోకం

19 Mar, 2016 03:02 IST|Sakshi

గత ఫిబ్రవరిలో సగటున 8.65 మీటర్ల లోతులో..
ఈ ఏడాది అదే నెలలో 9.16 మీటర్లు
19 ప్రాంతాల్లో పడిపోయిన నీటిమట్టం
అత్యధికంగా సత్తుపల్లిలో 32.15 మీటర్లు

 భూగర్భం అడుగంటుతోంది. ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పడిపోతోంది. రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో బోర్లు, బావులు చుక్కనీరూ లేకుండా పోతున్నాయి. జిల్లాలోని 19 ప్రాంతాల్లో అప్పుడే నీటిమట్టం అట్టడుగుకు చేరింది. ఇప్పుడే ఇలా ఉంటే మండువేసవిలో ఎలా ఉండాలి..అని ప్రజలు, అధికారులు బెంబేలెత్తుతున్నారు.               - ఖమ్మం సాక్షి ప్రతినిధి

సాక్షిప్రతినిధి, ఖమ్మం: వర్షాభావ పరిస్థితులు, వేసవి ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతుండటంతో భూగర్భ జలం అడుగంటుతోంది. రెండేళ్లుగా వర్షాలు సరిగా లేకపోవడంతో జిల్లాలోని నీటిమట్టం పడిపోతోంది. వ్యవసాయ, మంచినీటి, బోరు బావులు ఎండిపోతున్నాయి. ఇటు సాగు, అటు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది సగటున జిల్లావ్యాప్తంగా ప్రమాదకర స్థితిలో నీటిమట్టం పడిపోయింది. 19 ప్రాంతా ల్లో భూగర్భజలం లోతుల్లోకి వెళ్లింది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే వేసవి గటెక్కేదెలా అని ఇటు అధికారులు.. ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

 అడుగంటిన నీరు
2015 ఫిబ్రవరిలో భూగర్భ జల సగటు మట్టం 8.65 మీటర్లుంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 9.16 మీటర్లకు చేరింది. ఇప్పుడే ఇలా ఉంటే మే, జూన్ నాటికి 10 మీటర్ల లోతులోకి కూడా భూగర్భ జలం వెళ్లే అవకాశం ఉంది. తల్లాడ మండలం అంజనాపురం, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు, టేకులపల్లి మండలం బోడు, దుమ్ముగూడెం, కల్లూరు, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, కామేపల్లి మండలం కొత్తలింగాల, ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం, వెంకటాపురం మండలం మరికల, ముదిగొండ, బోనకల్ మండలం ముష్టికుంట్ల, ఇల్లెందు మండలం నారాయణపురం-ఎస్, చింతకాని మండలం నేరెడ, సత్తుపల్లి మండలం ప్రకాష్‌నగర్, చండ్రుగొండ మండలం రావికంపాడు, టేకులపల్లి మండలం సులానగర్, వేంసూరులలో భూగర్భ జలాలు లోతుల్లోకి వెళ్లాయి.

వేసవి ప్రత్యామ్నాయ ప్రణాళికపై అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు చెప్పినా.. ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా నిధులు జిల్లాకు రాలేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ముందే మేల్కొనాల్సిన అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈసారి మంచినీటి ఇబ్బందులు తప్పవని రాజకీయ పార్టీలు అంటున్నాయి. దీనికితోడు కరువు మండలాల జాబితాలో జిల్లా నుంచి ఒక్క మండలానికి కూడా చోటు దక్కకపోవడంతో కేంద్ర సాయం కూడా కొరవడింది. ప్రధానంగా మంచినీటి వసతులపై ఏజెన్సీలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో గిరిజనులు దాహార్తితో రోజులు గడుపుతున్నారు.

 ఎప్పుడూ ఆ ప్రాంతాల్లోనే...
భూగర్భ జల వనరుల శాఖ నివేదికల ప్రకారం జిల్లాలో ఏటా కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థితిలోకి పడిపోతున్నాయని గుర్తించారు. ఇక్కడ ఇదేస్థాయిలో మంచి నీటికి కూడా కటకట ఏర్పడుతోంది. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న భూముల్లో నీటిమట్టం కొంత వరకు బాగానే ఉన్నా.. ప్రధానంగా ఆయక ట్టేతర ప్రాంతాల్లో మాత్రం ఏటికి ఏడాది భూగర్భ జలాలు పడిపోతుండటం గమనార్హం. టేకులపల్లి మండలం సులానగర్, కల్లూరు, దుమ్ముగూడెం, బనిగండ్లపాడు, ఎం.వెంకటాయపాలెం, బోడు ప్రాంతాల్లో ప్రతి ఏటా నీటిమట్టం తగ్గిపోతోంది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు చెబుతుండగా.. ఈ ప్రాంతా ల్లో నీటి వనరులు పెంపొందించేందుకు చర్యలు తీసుకోకపోవడం కూడా మరో కారణం.

మరిన్ని వార్తలు