నీళ్లున్నా ..కన్నీళ్లే!

16 Nov, 2016 23:48 IST|Sakshi
నీళ్లున్నా ..కన్నీళ్లే!
– హంద్రీనీవా నుంచి 1 టీఎంసీకి     ఇండెంట్‌ పెట్టిన ఇంజినీర్లు
– అనుమతులు ఇవ్వని ఈఎన్‌సీ
– కృష్ణా బోర్డు కేటాయించిన నీరంతా  ‘అనంత’ జిల్లాకేనని వినిపిస్తున్న వాదన 
 
కర్నూలు సిటీ: రాయలసీమ వాసుల కలల ప్రాజెక్టు హంద్రీనీవా. దీని కోసం జిల్లా ప్రజలు వందలాది ఎకరాల భూములను త్యాగం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి  జిల్లాకు చుక్క నీరు అందని పరిస్థితి. కళ్ల ముందు నీరు పోతున్నా వినియోగించుకోలేని దుస్థితి. తెలుగు దేశం పార్టీ అ«ధికారంలోకి వచ్చినప్పటి నుంచి  హంద్రీనీవా నీటి విషయంలో జిల్లాకు అన్యాయం జరుగుతూనే ఉంది. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదు.
 
ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు మినహా ఏ ప్రాజెక్టులో కూడా ఆశించిన మేరకు నీటి లభ్యత లేదు. దీంతో ఆయకట్టుకు, తాగు నీటికి జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పందికోన నుంచి హంద్రీనీవా నీరు ఒక టీఎంసీ.. జీడీపీ(గాజులదిన్నె ప్రాజెక్టుకు)కి విడుదల చేయాలని.. ఇందుకు అనుమతులు ఇవ్వాలని ఈఎన్‌సీకి కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ లేఖ రాశారు. దీనికి స్పందించకపోగా హంద్రీనీవా నీరు మీరేలా తీసుకుంటారని ఎస్‌ఈపై ఈఎన్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 
 
నీరంతా అనంతకే...!
హంద్రీనీవా కాలువ ద్వారా 40 టీఎంసీల వరద జలాలను రాయలసీమ జిల్లాకు తరలించాలనేది లక్ష్యం. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన 6.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు, సుమారు 33 లక్షల మంది తాగు నీటి అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ఏడాది సుమారు 15 టీఎంసీల నీటిని మల్యాల ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోశారు. ఇందులో జిల్లాకు వచ్చింది ప్రస్తుతం కృష్ణగిరి(0.16 టీఎంసీ), పందికోన(0.65 టీఎంసీ) రిజర్వాయర్లలోని నీటితో కలిపి 2.31 టీఎంసీలు మాత్రమే. అనంతపురం జిల్లాలో పెన్నా అహోబిలం రిజర్వాయర్, జీడీపల్లి రిజర్వాయర్, 53 చెరువులతో కలిపి ఈ నెల 6 నాటీకే అధికారుల లెక్కల ప్రకారమే ప్రస్తుతం సుమారు 10 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు ఖరీఫ్‌లో సుమారు 60 వేల ఎకరాల్లో ఆయకట్టు సాగు చేశారు. తాగు నీటి అవసరాలు తీర్చుకున్నారు. అయినా ఇంకా నీరు కావాలని అడుగుతున్నారు.
 
వాస్తవం ఇదీ..
 కృష్ణా బోర్డు 5 టీఎంసీలను కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులో కర్నూలు, అనంతపురం జిల్లాల పేర్లు ఉన్నాయి. అయితే అనంతపురం జిల్లాకు మాత్రమే ఈ కేటాయింపులని ఆ జిల్లా టీడీపీ నేతలు, అధికారులు వాదిస్తున్నారు. గతేడాది కూడా కాల్వ తూములకు కాంక్రీట్‌ వేసి వచ్చిన నీరంతా అనంతపురం జిల్లాకే తరలించారు. దీంతో అక్కడ గతేడాది వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తలేదు. జిల్లాలో మాత్రం హంద్రీనీవా కాలువ పక్కనే వెళ్తున్నా..ప్రజలు దాహార్తితో అల్లాడారు. దాహం తీర్చేందుకు ట్యాంకర్ల  ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. 
 
మరిన్ని వార్తలు