శ్రీశైలానికి పెరిగిన వరద

25 Sep, 2016 22:12 IST|Sakshi
శ్రీశైలానికి పెరిగిన వరద
· మరో మూడు రోజుల్లో డ్యాం నిండే అవకాశం
· ఎగువ ప్రాంతాల నుంచి 17 టీఎంసీల నీరు విడుదల
 
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 1,95,568 క్యూసెక్కుల నీరు విడుదలైంది. సోమవారం సాయంత్రానికి 17 టీఎంసీల నీరు శ్రీశైలాన్ని చేరుకోనుంది. ఇప్పటికే డ్యాం నీటిమట్టం 879.50 అడుగులకు చేరుకుంది. సోమవారానికి డ్యాంలో గరిష్టస్థాయి నీటినిల్వలు 200 టీఎంసీలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం జలాశయంలో 215.65 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. మరో 30 టీఎంసీలు వచ్చి చేరితే పూర్తిస్థాయి 885 అడుగులకు చేరుకుంటుంది. వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని మరో మూడు రోజుల్లో డ్యాం గేట్లను తెరచి దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ ఇంజనీర్లు సన్నద్ధమవుతున్నారు. శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో రెండు పవర్‌హౌస్‌లో విద్యుత్‌ ఉత్పాదనను పూర్తిస్థాయిలో చేపడుతున్నారు. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ఏడు జనరేటర్లు, భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో ఐదు జనరేటర్లతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 66,541 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 500 క్యూసెక్కులు, హంద్రీనివా సుజల స్రవంతికి 1680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాలలో 10.40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 
మరిన్ని వార్తలు