పాకాలకు లీకేజీ గండం

2 Aug, 2016 00:28 IST|Sakshi
పాకాలకు లీకేజీ గండం
  • తూముల నుంచి వృథాగాపోతున్న నీరు
  • మరమ్మతులు చేయించడంపై దృష్టిసారించని అధికారులు
  • ఏళ్లు గడుస్తున్నా షటర్లు మార్చని వైనం
  • ఆందోళనలో ఆయకట్టు రైతులు
  •  
    ఖానాపురం : ‘ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుదాం’ అంటూ జల పరిరక్షణ కోసం నినాదాలు ఇస్తుంటారు అధికారులు. కానీ వర్షం రూపంలో ప్రకృతి ప్రసాదించిన జల వనరులు కళ్లెదుటే నేల పాలవుతున్నా పట్టించుకోని దుస్థితి పలుచోట్ల కనిపిస్తోంది. మండలం పరిధిలోని పాకాల సరస్సు తూములకు లీకేజీ గండం చుట్టుముట్టింది. రెండు తూముల షటర్లు శిథిలావస్థలో ఉన్నాయి. అయినా ఐబీ అధికారులు గత కొన్నేళ్లుగా మరమ్మతు చేయించలేదు. ఫలితంగా ఏటా వర్షాకాలంలో తూముల నుంచి నీరు వృథాగాపోతోంది. ఈ లీకేజీల కారణంగా రబీ సీజన్‌లో క్యారీ ఓవర్‌ సిస్టమ్‌ ప్రకారం 10 ఫీట్ల వరకు ఉండాల్సిన నీటిమట్టం 5 ఫీట్లకు పరిమితం అవుతోంది. దీంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 1902 సంవత్సరంలో కాకతీయుల పాలనా కాలంలో పాకాల సరస్సు తూములు నిర్మించారని చెబుతారు. వాటికి మరమ్మతులు చేయించడంపై అధికారులు ఇప్పటికైనా దృష్టిసారించాలి. కాగా, సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.03 అడుగులు. ఇది పూర్తిస్తాయిలో నిండితే ఖరీఫ్, రబీలో ఆయకట్టు రైతులు ఆనందోత్సాహాలతో పంటల సాగుకు నడుం బిగిస్తుంటారు. అన్నదాతల ఆనందం పదికాలాల పాటు పరిఢవిల్లాలంటే జలసిరులను అందిస్తున్న పాకాల సరస్సును కంటికిరెప్పలా కాపాడాల్సిన అవసరం ఉంది. 
     
    నీటి వృథాను అరికట్టాలి 
     
    తూముల నుంచి నీరు వృథాగా పోకుండా చూడాలి. అప్పుడే సరస్సు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంటుంది. షటర్లకు మరమ్మతులు చేయించాలి. తద్వారా ఆయకట్టు రైతులకు ఎటువంటి బెంగ ఉండదు. – జినుకల సురేష్, రైతు, అశోక్‌నగర్‌
     
    రూ.40 కోట్లతో ప్రతిపాదనలు
     
    పాకాలలో ప్రధాన తూముల ద్వారా నీరు వృథాగా పోతున్న విషయం వాస్తవమే. తూములు, కాల్వల మరమ్మతుల కోసం రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించాం. దీన్ని ప్రభుత్వానికి పంపుతాం. తూములు, షటర్లకు మరమ్మతులు చేసి లీకేజీలను అరికడతాం. – సుదర్శన్‌రావు, ఐబీ డీఈ  
>
మరిన్ని వార్తలు