అడుగంటిన ఆశలు

15 Aug, 2015 03:13 IST|Sakshi
అడుగంటిన ఆశలు

- కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ ఖాళీ
- మొత్తం నిల్వ సామర్థ్యం 709.47 టీఎంసీలు.. ఇప్పుడున్నది 188.08టీఎంసీలు
 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రానికి ప్రధాన నీటి వనరులుగా ఉన్న కృష్ణా, గోదావరి నదుల పరీవాహక పరిధిలోని ప్రాజెక్టులన్నీ వట్టిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి మట్టాలన్నీ గణనీయంగా పడిపోతున్నాయి. ఆగస్టు రెండో వారం ముగిసినా ఆశించిన స్థాయి వ ర్షాలు లేకపోవడం, ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ భారీగా నీటి లోటు ఉండటం ఆందోళన కలుగజేస్తోంది.

రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 710 టీఎంసీలు కాగా.. మునుపెన్నడూ లేని రీతిలో ఇప్పుడు కేవలం 188 టీఎంసీల నీరే ఉండడం... అందులోనూ వినియోగార్హమైన నీరు కేవలం 50 టీఎంసీలే ఉండటం తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ కాస్త నీటినీ తాగు అవసరాలకే వినియోగించాలని... సాగు అవసరాలను పూర్తిగా పక్కనపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గతేడాదితో పోలిస్తే మూడో వంతుకు..
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోయాయి. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం, సింగూరు, మానేరు, కడెం ప్రాజెక్టులన్నీ కలిపి నిల్వ సామర్థ్యం 709.47 టీఎంసీలు కాగా... ఇప్పుడు 188.06 టీఎంసీలే ఉన్నాయి. మొత్తంగా 521.41 టీఎంసీల లోటు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టులన్నింటిలో కలిపి 425.50 టీఎంసీల నీరు లభ్యతగా ఉంది.

అంటే గత ఏడాదితో పోల్చినా ఈసారి సుమారు 237 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిలోనూ కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్‌లో కలిపి 20 నుంచి 30 టీఎంసీలు, గోదావరిలో మరో 20 టీఎంసీలు మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుల్లో నీటి లోటుతో 15 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడుతోంది. సాగర్ ఎడమ కాల్వ కింద 6 లక్షల ఎకరాలు, జూరాల కింద లక్ష ఎకరాలు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ కింద ఉన్న మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి లేదు. దీనికి తోడు పాక్షికంగా పూర్తయిన భీమా, నెట్టెంపాడు, ఇచ్చంపల్లి, కల్వకుర్తి, దేవాదుల ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఖరీఫ్‌లో కొత్తగా 6.2 లక్షల ఎకరాలకు నీరివ్వాలన్న ప్రభుత్వ సంకల్పం కూడా వ్యర్థమవుతోంది.

ఆ నిర్ణయం వెనక్కి..
జూరాల ప్రాజెక్టులో గరిష్ట నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలకుగానూ జూలైలో 6.09 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అదే సమయంలో కర్ణాటకలో వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌లకు నీటి చేరిక పెరగడంతో ఆగస్టు రెండో వారం నుంచి జూరాల కింది ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కానీ ఇప్పు డు ప్రాజెక్టులో 5 టీఎంసీల మేర మాత్రమే నీరుండటం, ఎగువన ప్రవాహాలు లేకపోవడంతో... సాగుకు నీరివ్వాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని భవిష్యత్ తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సాగుకు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నాయి.
 
ఎగువ రాష్ట్రాల్లోనూ అంతే..
సరైన వర్షాలు లేనికారణంగా ఎగువన ఉన్న కర్ణాటకలోని ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు పరీవాహకం తక్కువగా ఉండటంతో ఎగువ ప్రాజెక్టులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అవి నిండి దిగువకు నీరొస్తేనే మన ప్రాజెక్టులు నిండుతాయి. ప్రస్తుతం ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో మొత్తంగా 91 టీఎంసీల నీరు కొరతగా ఉంది. ప్రస్తుతం తుంగభద్రకు 17 వేల క్యూసెక్కులు, ఆల్మట్టి, నారాయణపూర్‌లకు 10 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లోలు కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ తొలివారానికి ప్రాజెక్టులు నిండి.. దిగువకు నీరు వచ్చే అవకాశముంది. లేదంటే దిగువ ప్రాజెక్టులకు గడ్డు పరిస్థితి తప్పదు.

మరిన్ని వార్తలు