దిష్టిబొమ్మలా ప్రాజెక్టులు

27 May, 2017 23:38 IST|Sakshi
దిష్టిబొమ్మలా ప్రాజెక్టులు

- నీరులేని ముచ్చుకోట, చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్ట్‌లు
- రూ. వందల కోట్ల ప్రభుత్వ సొమ్ము వృథా
- నీరిచ్చి ఆదుకోవాలంటున్న ప్రజలు, రైతులు


పెద్దపప్పూరు : మండలంలోని మూడు తాగు, సాగునీటి ప్రాజెక్ట్‌లున్నా ఎలాంటి ప్రయోజనం లేదని మండల ప్రజలు వాపోతున్నారు.  నాయకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో వందలకోట్ల వ్యయంతో నిర్మించిన  మూడు తాగు, సాగునీటి ప్రాజెక్ట్‌లు నీరులేక నిరుపయోగంగా మారాయి. ప్రాజెక్ట్‌లను నీటితో నింపితే పెద్దపప్పూరు మండలంలోని ప్రతి ఎకరా పంట పొలాలతో సస్యశ్యామలం అవుతుంది. 2005లో మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా మండలంలోని చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను చేపట్టారు. ఇందులో చాగల్లు ప్రాజెక్ట్‌ పనులు పూర్తవడంతో రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. దాదాపు రూ. 244 కోట్ల వ్యయంతో 1.5 టీఎంసీ కెపాసిటీతో ప్రాజెక్ట్‌ నిర్మాణం జరిగింది. ప్రాజెక్ట్‌ను నీటితో నింపితే దాదాపు 10 గ్రామాలకు సాగు, తాగునీటి సమస్యలు తీరతాయి. ప్రాజెక్ట్‌ కింద  దాదాపు 6 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇప్పటి వరకు 1 ఎకరా ఆయకట్టుకు  నీటిని అందించలేని దుస్థితి. రెండోది పెండేకల్లు ప్రాజెక్ట్‌. 

మండలంలోని కుమ్మెత వద్ద దీని నిర్మాణం చేపట్టారు.  పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. దాదాపు రూ.109 కోట్ల వ్యయంతో దీని నిర్మాణం జరిగింది. ప్రాజెక్ట్‌ పూర్తయితే పెద్దపప్పూరు, తాడిపత్రి  మండలాలకు తాగు, సాగునీటికి ఉపయోగం.  తాడిపత్రి మండలంలో భూసేకరణ పనుల్లో జాప్యం జరగడంతో  ప్రధాన కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడోది ముచ్చుకోట రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయి దాదాపు 33 సంవత్సరాలు అవుతోంది. అప్పట్లో దాదాపు రూ.80 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టారు.  ఇప్పటి వరకు నీటి కేటాయింపులు లేకపోవడంతో  రిజర్వాయర్‌ నిరుపయోగంగా మారింది. రిజర్వాయర్‌కు నీరు చేరితే మండలంలోని ముచ్చుకోట, వరదాయపల్లి, నామనాంకపల్లి, చిక్కేపల్లితో పాటు పుట్లూరు మండలంలోని రెండు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి సాగునీటికి అనుకూలం అని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌లకు నీటి కేటాయింపులు లేకపోవడంతో మూడు ప్రాజెక్ట్‌లు నిరుపయోగంగా మారాయి. అధికారులు, నాయకులు ప్రాజెక్ట్‌లను నీటితో నింపితే మండలంలోని అన్ని గ్రామాలు పాడిపంటలతో సస్యశ్యామలమవుతాయి.

ప్రాజెక్ట్‌లను నింపాలి
మండలంలోని చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్ట్‌లతో పాటు  ముచ్చుకోట రిజర్వాయర్‌ను నీటితో నింపాలి. ప్రాజెక్ట్‌లలో నీరు చేరితే అన్ని గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. నీరు లేక వందల  కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్‌లు నిరుపయోగంగా మారాయి. నాయకులు, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకొవాలి.
-  రఘునాథరెడ్డి, రైతు, పెద్దపప్పూరు

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా