ధనదాహం

17 Mar, 2016 04:22 IST|Sakshi
ధనదాహం

నీటిశుద్ధి పేరిట కాసుల వేట    
అనుమతులు లేకుండా విక్రయాలు
పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్లు   
బీఎస్‌ఐ నిబంధనలకు మంగళం
రూ.కోట్లల్లో పన్నుల ఎగవేత     
కేంద్రాలపై లోపించిన పర్యవేక్షణ

జిల్లావ్యాప్తంగా 200కుపైగా వాటర్ ప్లాంట్లు అనుమతి లేకుండా నడుస్తున్నాయి. కేవలం ఐదింటికి మాత్రమే అనుమతి ఉంది..

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నాణ్యతా ప్రమాణాలు పాటించ రు.. అనుమతులు తీసుకోరు.. ప్రాథమిక నిబంధనలు అమలు చేయరు.. ప్రభుత్వానికి పన్నులు చెల్లించరు.. అయితేనేం రూ.కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలో శుద్ధజలం పేరిట మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారుు. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్నారు. కరువైన అధికారుల నియంత్రణతో ఇష్టారాజ్యంగా సాగుతున్న ‘నీళ్ల’ వ్యాపారంలో సామాన్యులే సమిధవులవుతున్నారు. మినరల్ వాటర్ పేరిట జనరల్ వాటర్ సరఫరా

చేస్తూ వినియోగదారులకు లేని రోగాలను అంటగడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. భారత ప్రమాణా ల సంస్థ(బీఎస్‌ఐ) నిబంధనలను పూర్తిగా విస్మరించిన వాటర్ ప్లాంట్ల నిర్వాహకులకు ‘అమ్యామ్యాల’కు రుచి మరిగిన అధికారులు తోడు కావడం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి, బోధ న్, ఆర్మూరు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాలతోపాటు జిల్లా వ్యాప్తంగా మంచి నీళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారుగా 200 వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నా.. కేవలం ఐదింటికీ మాత్రమే బీఎస్‌ఐ అనుమతి ఉంది.

 నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ
జిల్లాలో నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లలో చాలా మంది ప్రమాణాలు పాటించడం లేదు. డబ్బులు ఎరగా వేసి అరకొర వసతులున్న అనుమతులు తెచ్చుకుంటున్న వ్యాపారులు చిన్న చిన్న గదుల్లో ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. నీటిని నిల్వచేసే క్యానులను ప్రతిసారి శుభ్రం చేయకుండానే సరఫరా చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, బాన్సువాడ, ఎల్లారెడ్డిలతోపాటు జిల్లా వ్యాప్తంగా వాటర్ ప్లాంట్లలో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు అందుబాటులో ఉండటం లేదు. పీహెచ్, టీడీఎస్ పరీక్షలు అసలే జరగడం లేదు. శానిటరీ అధికారులు మామూళ్లకు రుచిమరిగి అసలే తనిఖీలు చేయడం లేదు. కొన్ని సంస్థలు ఐఎస్‌ఐ సర్టిఫికెట్లు కలిగినప్పటికీ వాటిని ఏటా రెన్యూవల్ చేయడం లేదు. వాటర్ కేంద్రాలు కచ్చితంగా భూగర్భజలాలను ఉపయోగించాలి. అయితే కొందరు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా వుండగా ఒక లీటరు శుద్ధి జలాన్ని తయారు చేయడానికి మూడు లీటర్ల నీరు వృథా అవుతోంది. ఈ క్రమంలో భూగర్భజలాలను విరివిగా తీయడం వలన ఈ ప్లాంట్లు ఉన్న ప్రాంతంలో భూగర్భ నీటినిల్వలు తగ్గిపోతున్నాయని చుట్టు పక్కల ఉండేవారు ఫిర్యాదులు చేస్తున్నా అక్రమంగా నిర్వహిస్తున్న ప్లాంట్లపై చర్యలు తీసుకోవడానికి అధికారులు జంకుతున్నారు. మినరల్ వాటర్‌పై కూడా 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, సేవ ముసుగులో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ఆ పన్నులు ఎగవేస్తున్నారు.

 అధికారుల ఉదాసీనతే కారణం
మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహించాలంటే ఐఎస్‌ఐ నిబంధనలు పాటించాలి. భారత ప్రమాణాల సంస్థ(బీఎస్‌ఐ) అనుమతుల సమయంలో ఇచ్చిన మార్గదర్శక సూత్రాలు అమలు చేయాలి. వాటర్ ప్లాంట్‌లో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు విధిగా ఉండాలి. వీరు శుద్ధి చేసిన ప్రతి బ్యాచ్‌కు చెందిన నీటిలోని పీహెచ్‌ను పరీక్షిస్తూ ఉండాలి. పీహెచ్ 7 కంటే తగ్గితే కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయని బీఎస్‌ఐ, డాక్టర్లు చెప్తున్నారు. నీటిలో పూర్తిగా కరిగి ఉండే లవణాలను(టీడీఎస్) కూడా పరీక్షించాలి. కొత్తగా ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే కనీసం 10 గదులు ఉండేలా చూడాలి. ఇందులోనే నీటిని పరీక్ష చేసే ల్యాబ్, అందుకు ఉపయోగించే పరికరాల కోసం రెండు గదులు కేటాయించాలి. ఫిల్లింగ్ సెక్షన్, ఆర్‌వో సిస్టంలో 3,000 లీటర్ల కెపాసిటీ డ్రమ్ములను ఏర్పాటు చేయాలి.

 శుద్ధి చేసిన జలాలను నిల్వచేసేందుకు 304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన డ్రమ్ములు వాడాలి. శుద్ధి చేసిన నీటిని తప్పకుండా ఓజోనైజేషన్ చేయాలి. మినరల్ వాటర్‌ను బబుల్స్(క్యాను)లోకి పట్టే ముందు అల్ట్రావైరస్ రేస్‌తో వాటిని శుద్ధి చేయాలి. నీటిని క్యాన్‌లోకి పట్టిన తర్వాత రెండు రోజులపాటు భద్రపరిచి అనంతరం మార్కెట్లోకి పంపాలని బీఎస్‌ఐ నిబంధనలు సూచిస్తున్నాయి. నీటిని సరఫరా చేసే క్యానులకు ప్రతిసారి పొటాషియం పర్మాంగనేట్ లేదా హైపోసొల్యూషన్‌తో కెమికల్ క్లీనింగ్ చేయాలి. సీలుపై నీటిని శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్ ను వేయాలి. నీటిని క్యానులలోకి నింపేవారు చేతులకు గ్లౌజస్ ధరించాలి. శానిటరీ అధికారుల చేత ప్రతినెలా నీటిని తనిఖీ చేయించి రిపోర్టును ఐఎస్‌ఐకి పంపాలి. ప్రతి ఏడాది ఐఎస్‌ఐ గుర్తింపు ఉన్నవాళ్లు తప్పనిసరిగా రెన్యూవల్ చేయించుకోవాలి. ఇవేమీ పాటించకున్నా నిర్వహిస్తున్నారంటే అధికారుల ఉదాసీనతే కారణమన్న చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు