సాగునీటి గండం

24 Aug, 2017 12:08 IST|Sakshi
సాగునీటి గండం

గోదావరి జిల్లాలకు పొంచివున్న ముప్పు
తెలంగాణలో గోదావరి, దాని ఉపనదులపై 9 ఎత్తిపోతల పథకాలు
అవి పూర్తయితే సహజ జలాల రాకకు అడ్డుకట్టే
పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే శాశ్వత పరిష్కారం
ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన ప్రభుత్వం
పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాలపై మమకారం


కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి డ్యామ్‌ ఎత్తు పెంచినా అప్పటి చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా నేడు కృష్ణా డెల్టా రైతులు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మొదటి పంటకు సైతం నీరందక ఇబ్బందులను చవిచూస్తున్నారు.

తెలంగాణ సర్కారు గోదావరి, దాని ఉప నదులపై ఏకంగా తొమ్మిది ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపడుతోంది. దీంతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే దిగువకు నీళ్లు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి

పోలవరం/కొవ్వూరు :
ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులు రెండో పంటకు సాగునీరు అందక ఇబ్బందులను చవిచూస్తున్నారు. ఏటా రబీ సీజన్‌లో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. 2009 తర్వాత రెండేళ్లు మినహా రెండో పంటకి ఏటా వంతుల వారీ విధానంలో సాగునీరు అందిస్తున్నారు. ఆరేళ్ల నుంచి రెండో పంటకు సీలేరు జలాలపైనే ఆధారపడి నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తొమ్మిది పథకాలు పూర్తయితే భవిష్యత్‌లో మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా సరాసరి 2,500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకునే మార్గం లేకపోవడంతో వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది.

ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో 7.20 లక్షల ఎకరాలకు నీరందించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చుతోంది. 194.60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం గల పోలవరం ప్రాజెక్టు పూర్తయితే సాగునీటి సమస్యకు తెరపడే అవకాశం ఉంది. అంతే కాకుండా 960 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ కేవలం తాత్కలిక లబ్ధిని చేకూర్చే పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాల పేరుతో రూ.3,200 కోట్లు పైగా ప్రజాధనం వృథా చేస్తోంది. కేవలం కమీషన్‌లు దండుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రెండు పథకాల నిర్మాణం చేపట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తొమ్మిది ఎత్తిపోతలు పూర్తయితే గోదావరి ఎడారే....?
నది పరివాహకంలో నీటి లభ్యత పడిపోవడంతో ఏటా రబీ సీజన్‌లో ఉభయ గోదావరి జిల్లా రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం గోదావరి ఉపనదులైన వార్ధా, పెన్‌గంగ, ప్రాణహిత కలిసే ప్రదేశాల్లో రూ.6,286 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, రూ.685 కోట్లతో ప్రాణహిత ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టింది. దిగువన భద్రాచలం సమీపంలో భక్తరామదాసు, సీతారామ పథకం రూ.1,151.59 కోట్లతో, లోయర్‌ పెన్‌గంగ రూ.124.90 కోట్లతో, లెండి రూ.19.02 కోట్లతో, దేవాదుల రూ.695 కోట్లతో, కుంతనాపల్లికి రూ.200 కోట్లతో, బీమా ఎత్తిపోతల పథకాన్ని రూ.125 కోట్లతో చేపట్టింది. గత ఏడాది బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది. ఎగువన ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే వరదల అనంతరం అక్టోబర్, నవంబర్‌లో గోదావరికి వచ్చే సహజ జలాలకు అడ్డుకట్ట పడినట్లే అవుతుంది.

పొంచి ఉన్న ప్రమాదం :
గోదావరికి ఎగువ నుంచి అక్టోబర్‌ నెలలో రోజుకి సగటున 40 వేల క్యూసెక్కులు, నవంబర్‌లో 20 వేల క్యూసెక్కుల చొప్పున మాత్రమే ఇన్‌ఫ్లో వస్తుంది. తెలంగాణలో ఈ ప్రాజెక్టులు పూర్తయితే అక్టోబర్, నవంబర్‌ నెలల్లో ఇన్‌ఫ్లో పడిపోవడం ఖాయం. ఆ సమయంలో గోదావరి జిల్లాల్లో ఖరీఫ్‌ పంట కీలక దశలో ఉంటుంది. ఏటా రబీకి 80 టీఎంసీల నీరు అవసరం. దీనిలో ఎగువ నుంచి సహజ జలాల రూపంలో 40 టీఎంసీలు వస్తుంది. సీలేరు జలాలతో పాటు నీటి పొదుపు చర్యల ద్వారా ఏటా గోదావరి జిల్లాల్లో రబీ సాగు గట్టెక్కుతుంది. ఎగువన ప్రాజెక్టులు పూర్తయితే గోదావరి డెల్టా ఆయకట్టులో 10.13 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఉభయ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కృష్ణా ఆయకట్టు గట్టెక్కాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే శాశ్వత పరిష్కారం.

ప్రచారం ఎక్కువ–పనులు తక్కువ
పోలవరం రిజర్వాయర్‌ ద్వారా 194.60 టీఎంసీల గోదావరి జలాలను నిల్వ చేసుకోవటంతో పాటు 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మరో 79 టీఎంసీల నీటిని లైవ్‌ స్టోరేజ్‌గా వినియోగించుకునే అవకాశం ఉంది. 80 టీఎంసీల నీటిని కృష్ణా జిల్లాకు తరలిస్తే, కృష్ణా నదిలోని 30 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌ వద్ద నుంచి రాయలసీమ అవసరాలకు వినియోగించవచ్చు. 540 గ్రామాలకు తాగునీరుతోపాటు, విశాఖ పరిశ్రమలకు, తాగునీటి అవసరాలకు నీరు అందుతుంది. 2018 నాటికి నీటిని విడుదల చేయాలంటే కాపర్‌ డామ్‌ నిర్మాణాన్ని పూర్తిచేయాలి. ఇంతవరకు కాపర్‌డామ్‌కు సంబంధించి డిజైన్లు ఖరారు కాలేదు.

ఐదు రెట్లు పెరిగిన అంచనా వ్యయం
2005–06లో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10,151.45 కోట్లుగా నిర్ధారించారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఈ ప్రాజెక్టును 2014 ఏప్రిల్‌ 1న జాతీయ  ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ఈప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కేంద్రం ఇచ్చే నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్‌ బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లులకు, ఖర్చు చేసిన నిధులకు పొంతన లేదనే అనుమానాలు ఉన్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.48 వేల కోట్లు పెరిగినట్టు ప్రకటించారు.

మరిన్ని వార్తలు