గొంతెండుతోంది..!

10 Apr, 2017 11:00 IST|Sakshi
గొంతెండుతోంది..!

► మూలకు చేరిన బోర్లు
► గిరిజన గ్రామాల్లో పరిస్థితి దారుణం
► పనిచేయని తాగునీటి పథకాలు
► పెద్ద పథకాలకు నిధులు మంజూరుకావు
► చిన్న ప్రతిపాదనలకు కదలిక లేదు..
►తాగునీటికి అల్లాడుతున్న జనం 

పనిచేయని పథకాలు 150
జిల్లాలో ఉన్న బోర్లు16,859
నిర్మాణంలో ఉన్న భారీ రక్షిత పథకాలు 6
సింగిల్‌ విలేజ్‌ స్కీంలు 1262
సమగ్ర మంచినీటి పథకాలు 29
మరమ్మతుల్లో ఉన్న బోర్లు 2,500

విజయనగరం కంటోన్మెంట్‌: జిల్లాలో అధిక సంఖ్యలో తాగునీటి పథకాలు, బోర్లు ఉన్నా ప్రయోజనం శూన్యమే. ప్రజలకు తాగునీటి వెతలు తీరడం లేదు. ప్రతి 250 మందికి ఒక తాగునీటి చేతిపంపు ఉండాలి. దీనికి రెండున్నర రెట్లు బోర్లు జిల్లాలో ఉన్నాయి. అందులో మరమ్మతులకు గురయినవే ఎక్కువ. క్రాష్‌ ప్రోగ్రాం అంటూ అధికారులు చేస్తున్న హడావుడి బోర్లు వరకు వెళ్లడం లేదు. పల్లెల్లోని చేతిపంపులు బాగు పడడం లేదు. మరమ్మతు పనులు అరకొరగానే సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పథకాలు ఉన్నా..
జిల్లాలో చాలా చోట్ల తాగునీటి పథకాలున్నా నీరు సరఫరా కావడం లేదు. బోర్లలో నీరు లేకపోవడం, ట్యాంకులకు నీరు చేరక పోవడం, పైప్‌లైన్ల లీకేజీలు ప్రజలకు శాపంగా మారాయి. నేటికీ జిల్లా ప్రజలుచెలమలు, నేలబావులపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలోని 928  పంచాయతీలకు తాగునీరు అందించేందుకు రూ.3,650 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అన్ని గ్రామాలకూ ఇంటింటికీ కుళాయి ప్రాతిపదికన పంపిన ప్రతిపాదనల్లో కనీసం కదలిక లేదు.

రాష్ట్ర బడ్జెట్‌లో అసలు తాగునీటికి నిధులు మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. పెద్ద పథకాలు మంజూరు కావడం ఆలస్యమవుతుందని గ్రహించిన జిల్లా అధికారులు మరో 110 కోట్లతో కొద్దిపాటి మరమ్మతులతో పనిచేయగలిగే పథకాలకు ప్రతిపాదనలు పంపించారు. వీటికి కూడా ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు. దీంతో జిల్లాలోని సుమారు 150 తాగునీటి పథకాలు మూలకు చేరాయి.

కొత్త పథకాల్లో నాణ్యత డొల్ల !
జిల్లాలో ఆరు పథకాలు గత ఆరేళ్లుగా నిర్మాణంలోనే ఉన్నాయి. ఇటీవలే  దత్తిరాజేరు, ఎస్‌. కోట పథకాలు పూర్తి చేశారు. పూర్తి చేసిన పథకాల్లో సామర్థ్యం కన్నా తక్కువ సైజ్‌ ఉన్న పైపులు వేయడంతో తాగునీరు అంద డం లేదు. దీంతో ఈ పథకం పరి«ధిలోని గ్రామాల్లో మంచి నీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  జమదల, నర్సిపురం, పాచిపెంట, ఎస్‌.కోట రెండు ఫేజుల పథకాలు నేటికీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. దత్తిరాజేరు, ఎస్‌.కోట–1 నిర్మాణాలు పూర్తయ్యాయని కాంట్రాక్టర్లు, అధికారులు చెబుతున్నా చివరి గ్రామాలకు తాగునీరు సరఫరా కావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

ఎస్‌డీపీ గ్రాంట్లతో కొత్త స్కీంలు పెడుతున్నామని ప్రకటించినా పనులు మాత్రం జరుగ డం లేదు. ఇటీవల రూ.38 కోట్లతో 481 పనులు ప్రారంభిస్తే అందులో 155 మాత్రమే పూర్తి చేశారు. మిగతావి నత్తనడకన సాగుతున్నాయి. గొట్లాంలోని రక్షిత నీటి పథకం నుంచి 25 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉండగా నేటికీ పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు. ఏజెన్సీల్లోని ప్రజలు వాగులు, చెలమల్లోని నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు.

సాలూరు మండలం గంజా యి భద్ర గ్రామంలో 200 మంది నివసిస్తున్నా వారికి మంచినీటి బోరు లేదు. దీంతో గ్రామ శివారులో వచ్చే చిన్న గెడ్డ నీటికి అడ్డంగా ఓ చిన్న తుప్పు పట్టిన గొట్టాన్ని ఏర్పాటు చేశారు. దీనినుంచి వచ్చిన కలుషిత నీటితో గొంతు తడుపుకుంటున్నారు. కురుపాం. గుమ్మలక్ష్మీపు రం వంటి గ్రామాల్లో ఊట గుంతలు, నీటి చెలమల నుం చి వచ్చే నీరే ప్రాణాధారం. గొంతు తడుపుకునేందుకు జీవాధారవిుదేనని వారు ఆవేదన చెందుతున్నారు.

ఏజెన్సీలో తీవ్రమైన తాగునీటి సమస్య..  
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రమైంది. సుమారు 8 మండలాల్లో తాగునీటికి జనం అల్లాడుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్మమ్మవలస, మక్కువ, గరుగుబిల్లి, కొమరాడ తదితర మండలాల్లో మంచినీటి ఎద్దడి నెలకొంది. కొద్దిపాటి నీరు ఊరే గుంతలు, ఊట బావులు, చెలమలపై ఆధారపడుతున్నారు. 20 నుంచి వంద కుటుం బాలుండే గిరిజన గూడల్లో ఒక్కో బోరు ఉండడం, కొన్నిచోట్ల బోరు కూడా లేకపోవడంతో కష్టాలు తప్పడంలేదు.

రాత్రంతా ఊరే నీరు సేకరణకు తెల్లవారు జాము నే పరుగులు తీస్తున్నారు. కలుషిత నీటినే తాగుతూ అనా రోగ్యం పాలవుతున్నారు. కురుపాం మండలం ఒప్పంగి లో ప్రజలు వేకువ జామునే వెళ్లి ఊటబావి నుంచి తాగునీరు తెచ్చుకునేందుకు ప్రయాసలు పడుతున్నారు. ఇదే మండలం గొందిలోవలో ఒక్క బోరు మాత్రమే ఉంది.

ఇందులో చుక్క నీరు రావడం లేదు. వేసవికి ముందుగానే ఎండిపోతోంది. గ్రామం ఆవల ఉన్న చెలమలను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ కూడా పడిగాపులు కాస్తేనే తాగునీరు లభ్యమవుతోంది. సాలూరు మండలం గంజాయి భద్రలో తాగునీటి పథకం మంజూరు చేయాలని కోరినా పట్టించుకునేవారే కరువయ్యారు.

చర్యలు తీసుకుంటున్నాం..
జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. సంచార వాహనాల్లో సిబ్బందిని పంపించి తాగునీటి వనరులను బాగుచేయిస్తున్నాం. అవసరమైన పరికరాలను ఎంపీడీఓల ఆధ్వర్యంలో అందజేస్తున్నాం. భారీ రక్షిత పథకానికి ప్రతిపాదనలు చేశాం. అవి వార్షిక ప్రాతిపదికన నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. చిన్నపాటి మరమ్మతులు, సింగిల్‌ విలేజ్‌ స్కీంలపై దృష్టి సారించాం. కొత్తగా 110 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశాం.  –ఎన్వీ రమణమూర్తి, పర్యవేక్షక ఇంజినీరు, ఆర్‌డబ్ల్యూఎస్, విజయనగరం

మరిన్ని వార్తలు