దూప తీరినట్టే..

6 Aug, 2016 21:52 IST|Sakshi
దూప తీరినట్టే..
  • ‘మిషన్‌ భగీరథ’పై మహిళల సంబురం
  • వర్గల్‌: మిషన్‌ భగీరథ పథకాన్ని నియోజకవర్గ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇక తమకు దూప తీరినట్టేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం నీటికోసం కొట్లాటలు జరిగేవని, గుక్కెడు నీటికీ ఇబ్బందులు పడుతున్నామని మండల ప్రజలు చెబుతున్నారు. పనులు మానేసి  బోర్ల వద్దకు పరుగులు తీశామంటున్నారు. మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికి నల్లాల ద్వారా నీళ్లొస్తయంటే తమ బాధలు తీరినట్టేనని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.

    తిప్పలు తప్పుతయ్‌
    నిన్న మొన్నటి దాక ఊళ్లె నీళ్ల కోసం మస్తు గోసగోస ఉండె. దూరంగా బోర్ల దగ్గరికి పోయి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. సీఎం సారు ఓట్ల సమయంల ప్రతి ఇంటికి తాగు నీళ్లు ఇస్తమన్నడు. ఇయ్యాల ఆ మాట నిజం చేసుకున్నడు. మాకు ఇగ నీళ్ల బాధ తప్పినట్టే.
    - చిందం లక్ష్మి, మైలారం, మం: వర్గల్‌

    శాన సవులత్‌ అయితది
    నీళ్ల కోసం పనులు బందు పెట్టే కాలం. బోర్లు మర్ల పడి నీళ్లకు శాన తిప్పలైతున్నది. గీసొంటి టైంలా సర్కారు ఇంటింటికి నీళ్లు వచ్చెటట్టు చేసింది. బోరు నీళ్లు తాగితె రోగాలు వస్తయంట. గిపుడు నల్లాల నుంచి శుభ్రమైన నీళ్లు వస్తున్నయ్‌. రోగాల భయం పోయింది.
    - గుర్రాల పోచమ్మ, మైలారం, మం: వర్గల్‌

    కేసీఆర్‌ సారు సల్లంగుండాలె
    మాకు ఆ పొద్దటి నుంచి బోర్ల నీళ్లే దిక్కు. అవి తాగితె రోగాలొస్తయో, రొప్పులొస్తయో మా కైతే తెల్వది. బోరు కాడ తిప్పలు పడాలె. నీళ్లు మోసుకోవాలె. ఇపుడు సర్కార్‌ మాకు నీళ్ల కష్టాలు లేకుండ చేసింది. దూప తీర్చుతున్న కేసీఆర్‌ సారు సల్లంగుండాలె.
    - మాసాన్‌పల్లి కిష్టమ్మ, నెంటూరు, మం: వర్గల్‌

    బిందెలతో ఉరుకెటోళ్లం
    కరువు కాలంల ఊళ్లె నీళ్ల బోర్లు, బావుల కాడ పొలానికి నీళ్లు పారపెట్టె బోర్లు మర్లపడ్డయ్‌. తాగెటందుకు నీళ్లు తెచ్చుకోవాలంటె ఓ పొంటె కూలీ పని బంద్‌ పెట్టుకోవాలె. నీళ్లు ఉన్న బోర్ల కాడికి బిందెలతోని ఉరుకాలె. ఆడికెల్లి నీళ్లు మోసుకోవాలె. కూలీ పని చేసే ప్యాదోళ్లకు శాన కష్టమయ్యేది. ఇపుడు చంద్రశేఖర్‌ సారు ఇండ్లకు నీళ్లు ఇచ్చుడుతోని మాకు బాధలు లేకుండ అయింది. ఆయన దేవుని లాంటి మనిషి.
    - ఎర్రోల్ల లక్ష్మి, నెంటూరు, మం: వర్గల్‌
     

మరిన్ని వార్తలు