నీటి కష్టాలకు ‘యాప్‌’ చెక్‌

30 Jul, 2016 23:33 IST|Sakshi
యాప్ పనితీరును వివరిస్తున్న దానకిషోర్

►  2న లాంఛనంగా ప్రారంభం..
►  9 సమస్యల తక్షణ పరిష్కారానికి శ్రీకారం
►  గ్రేటర్‌లో 24 గంటల నీటిసరఫరా!
►  నల్లాల క్రమబద్ధీకరణకు ఆగస్టు 31 వరకు గడువు
►  1 నుంచి మీటర్ల ఏర్పాటుపై డ్రైవ్‌..
►  ‘మీట్‌ది ప్రెస్‌’లో జలమండలి ఎండీ దానకిశోర్‌

సాక్షి,సిటీబ్యూరో: కలుషిత జలాలు.. పైప్‌లైన్లు, వాల్వ్ లీకేజీ,  మురుగు.. ఇలా తొమ్మిది రకాల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ఆగస్టు రెండు నుంచి ప్రత్యేక ‘మొబైల్‌ యాప్‌’ అందుబాటులోకి రానుందని జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిశోర్‌ తెలిపారు. దీనికి ‘ఆపరేషన్స్‌ అండ్‌ మెయిన్‌టెనెన్స్‌ మానిటరింగ్‌ మొబైల్‌ యాప్‌’గా నామకరణం చేశామన్నారు. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘మీట్‌ది ప్రెస్‌’లో ఆయన వివరాలు వెల్లడించారు. సమావేశంలో బోర్డు డైరెక్టర్లు సత్యనారాయణ, రామేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబు, రవీందర్‌రెడ్డి, ఎల్లాస్వామి ఉన్నారు. ఎండీ మాట్లాడుతూ..

ఈ యాప్‌ గ్రేటర్‌ పరిధిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది లైన్‌మెన్ల చేతిలో ఉండే స్మార్ట్‌ ఫోన్లలో ఉంటుందన్నారు. వారు రోజువారీగా తాము పనిచేస్తున్న పరిధిలో తమ పరిశీలనకు వచ్చిన సమస్యలు, వినియోగదారులు తెలిపిన సమస్యలను తమ వద్దనున్న మొబైల్‌ఫోన్లలో ఫొటో తీసి ఈ యాప్‌లో కనిపించే 9 బటన్స్‌లో సంబంధిత ఫిర్యాదు బటన్‌పై ప్రెస్‌ చేస్తారన్నారు. దీని ద్వారా ఏకకాలంలో ఈ సమాచారం సంబంధిత సెక్షన్‌ మేనేజర్, డీజీఎం, జీఎం, సీజీఎం, ఎండీ, కేంద్ర కార్యాలయంలో ఉండే కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి తక్షణం తెలుస్తుందన్నారు. తద్వారా కొన్ని గంటల వ్యవధిలో ఆ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.

పరిష్కరించే సమస్యలివే..
మొబైల్‌ యాప్‌ తెరపై 9 రకాల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా బటన్స్‌ ఉం టాయి. అవి.. 1. క్లోరిన్‌ లేని నీళ్లు 2.వాల్వ్‌ లీకేజీలు, 3.పైపులైన్ల లీకేజీ, 4.కలుషిత జలాలు, 5. పొంగుతున్న మురుగు, 6.మూతలు లేని మ్యాన్‌హోళ్లు, 7.నీటి బిల్లు అందకపోవడం, 8. మీటర్‌ కావాలని వినియోగదారుడు కోరడం/మీటర్‌ లేకపోవడం, 9. అక్రమ న ల్లా కనెక్షన్‌.

పరిశీలనలో 24 గంటల నీటిసరఫరా..
ప్రస్తుతం కృష్ణా మూడు దశలు, గోదావరి పథకం, సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగినందున నీటి లభ్యత 600 మిలియన్‌ గ్యాలన్లుగా ఉందని ఎండీ తెలిపారు. అయితే 24 గంటల పాటు నీటిసరఫరా అందించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. మహానగరంలో అన్ని ప్రాంతాలకు 24 గంటల పాటు నీరందించేందుకు అవసరమైన పైప్‌లైన్‌ వ్యవస్థ అందుబాటులో లేదని, నగరంలో వెయ్యి కిలోమీటర్ల మార్గంలో పురాతన మంచినీటి పైపులైన్లను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు.

నల్లాల క్రమబద్ధీకరణకు అవకాశం
గ్రేటర్‌ పరిధిలో అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించినట్టు ఎండీ దానకిషోర్‌ తెలిపారు. ఈ గడువులోగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేవలం నల్లా కనెక్షన్‌ చార్జీలు చెల్లించి తమ కనెక్షన్‌ను క్రమబద్ధీకరించుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో సెప్టెంబరు 1 నుంచి కనెక్షన్‌ చార్జీలు రెట్టింపు చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ నల్లాలపై సమాచారం అందించిన పౌరులకుSఅక్రమార్కుల నుంచి వసూలు చేసే రెట్టింపు కనెక్షన్‌ చార్జీల్లో 25 శాతం ప్రోత్సాహకంగా అందజేస్తామన్నారు. 80 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకుని, రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన బీపీఎల్‌ కుటుంబాలకు కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే వారి నల్లా కనెక్షన్‌ను క్రమబద్దీకరిస్తామని తెలిపారు.

మీటర్లు లేని నల్లాలు 6 లక్షలు..
గ్రేటర్‌ పరిధిలో 8.76 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా ఇందులో 6 లక్షల నల్లాలకు మీటర్లు లేవని ఎండీ తెలిపారు. ప్రతి నల్లాకు మీటర్‌ ఏర్పాటు ద్వారా బోర్డు రెవెన్యూ ఆదాయం గణనీయంగా పెంచుకోవడంతో పాటు వినియోగదారులకు అధిక నీటి బిల్లుల మోత లేకుండా చూసేందుకు ఆగస్టు ఒకటి నుంచి మీటర్ల ఏర్పాటుకు నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నట్టు తెలిపారు. ఒకసారి రూ.1500 చెల్లించి మీటర్‌ ఏర్పాటు చేసుకుంటే నాలుగేళ్లపాటు వాడుకున్న నీటికే బిల్లు చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు దక్కుతుందన్నారు. సెప్టెంబరు 30 లోగా నీటి మీటర్లు ఏర్పాటు చేసుకుంటే నెలవారీ నీటిబిల్లులో 5 శాతం రాయితీ లభిస్తుందని, లేకుంటే అక్టోబరు నుంచి రెట్టింపు బిల్లు చెల్లించాలన్నారు.

మరిన్ని వార్తలు