స్వైప్‌ మిషన్‌.. మాకొద్దు బాబోయ్‌ !

20 Dec, 2016 23:14 IST|Sakshi
స్వైప్‌ మిషన్‌.. మాకొద్దు బాబోయ్‌ !
- రైతు బజార్‌లో స్వైప్‌ మిషన్ల ఏర్పాటుకు మార్కెటింగ్‌ శాఖ ప్రయత్నం
- నిర్వహించలేమంటున్న రైతులు, పొదుపు మహిళలు
- కొనుగోలుదారులకూ కష్టమే 
- స్వైప్‌ మిషన్లు ఉంటేనే అమ్మకాలకు అనుమతి అంటూ అధికారుల బెదిరింపు
 
ఒకప్పుడు రైతు బజార్‌లో ఎలక్ట్రానిక్‌ కాటా తప్పని సరిగా ఉపయోగించాలంటే మావల్ల కాదన్న గ్రామీణ రైతులు ఇప్పుడు స్వైప్‌ మిషన్లు తప్పదని అధికారులు ఆదేశించడంతో మాకొద్దు బాబోయ్‌ అంటున్నారు. రైతు బజార్‌లో రూ. 1 మొదలు కొని రూ. 70..80.. ధర ఉండే ఉత్పత్తులను కొనుగోలుదారులు ఒక్కో వ్యాపారి వద్ద ఒక్కో రకం తీసుకుని చిల్లర ఇస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ. 500ఽకు మించి వ్యాపారం జరగదు. ఇలాంటి తరుణంలో స్వైప్‌ మిషన్లు తప్పనిసరి అని మార్కెటింగ్‌ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో విక్రయదారులు బెంబేలెత్తుతున్నారు. అసలు రైతుబజార్‌లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. 
- కర్నూలు(అగ్రికల్చర్‌)
 
మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ అన్ని రైతుబాజర్‌లలో విధిగా నగదురహిత లావాదేవీలు నిర్వహించాలని మార్కెటింగ్‌ అధికారులు, ఎస్టేటు ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేయడంతో వీరు  రైతులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కర్నూలులో మూడు, నంద్యాల, ఆదోనిలో ఒక్కొక్కటి ప్రకారం మొత్తం ఐదు రైతుబజార్‌లు ఉన్నాయి. వీటిన్నింటిలో నగదురహిత లావాదేవీల నిర్వహణకు రైతులు స్వైప్‌ మిషన్‌లు ఏర్పాటు చేసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ తప్పనిసరి అని చెప్పడంతో రైతుల ఆందోళన అంతా..ఇంతా కాదు. అసలు నగదు రహిత లావాదేవీలు అంటే ఏమి? స్వైప్‌ మిషన్‌ ఎలా పని చేస్తుంది? డబ్బులు ఖాతాల్లో ఎలా జమ అవుతాయి...వాటిని ఎలా తీసుకోవాలి? ఇలా ఎన్నో అనుమానాలతో రైతులు, పొదుపు మహిళలు స్వైప్‌పై మొగ్గు చూపడం లేదు. రైతు బజార్‌లో రూ.10, రూ.20 మేర కొనుగోలు చేసే వారు స్వైప్‌ ఉపయోగించడం ఎలా వీలు అవుతుందని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.  నెలసరి నిత్యావసర సరుకులు ఒకే దుకాణంలో రూ.1500 నుంచి రూ2000 వరకు కొనుగోలు చేస్తారు. అక్కడ ఈ మిషన్లు ఉపయోగించడం సులువు కానీ రైతు బజార్‌లో సాధ్యం కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
నిరక్ష్యరాస్యతతో నిర్వహణ ఎలా:
రైతు బజార్‌లో కూరగాయలు అమ్ముకునే రైతులు, పొదుపు మహిళలు దాదాపు నిరక్షరాస్యులే. వీరికి నగదు రహితంపై అసలు కనీస అవగాహన లేదు. తూకంలో కూడా కిలో.. అర కిలో రాళ్లనే ఉపయోగిస్తారు. ఎలకా​‍్ట్రనిక్‌ కాటాను ఉపయోగించలేని వారు సై​‍్వప్‌ మిషన్‌ను ఎలా నిర్వహిస్తారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మార్కెటింగ్‌ అధికారులు బలవంతంగా స్వైప్‌ మిషన్‌ల ఏర్పాటుకు రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. స్వైప్‌ మిషన్‌లు లేకపోతే రైతుబజార్‌లో కూర్చోనివ్వమని బెదిరిస్తున్నారు. రైతుబజార్లలో దళారీలు తిష్టవేశారు. మార్కెటింగ్‌ అధికారులు వీరిని వదలి వారంలో కేవలం రెండు, మూడు రోజలు మాత్రమే కూరగాయలు అమ్మకునే రైతులు, పొదుపు మహిళలను స్వైప్‌ మిషన్‌ల పేరుతో వేధిస్తున్నారు. మాకెందుకు కరెంట్‌ ఖాతాలు అంటూ చెబుతున్నా తీసుకోవాల్సిందేనంటూ ఒత్తిడి చేస్తున్నారు. వినియోగదారులు కూడా రైతుబజార్‌లలో స్వైప్‌ మిషన్‌లు వాడటానికి ఆసక్తి చూపటం లేదు. ఒకచోట అయితే వాడుతాము.. కూరగాయలు ఐదారుగురు దగ్గర కొంటే అందరి దగ్గర వాడాలంటే ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.  
  
నో క్యాష్‌ నేపథ్యంలో విత్‌డ్రా ఎలా:
రూ.500, 1000 నోట్ల రద్దుతో ఇప్పటికే బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ఖాతాల్లో ఉన్న డబ్బును తీసుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని బ్యాంకుల్లోను నో క్యాష్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. నగదు ఉన్నా... రూ.2000 నుంచి 4000 మించి ఇవ్వడం లేదు. స్వైప్‌మిషన్‌లను వినియోగించడం ద్వారా నగదు ఖాతాల్లో జమ అయితే తీసుకోవడం ఎలా అని ఆవేదన చెందుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బును పొలం వద్ద కూలీలకు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు.
 
స్వైప్‌ మిషన్లు తప్పనిసరి: సత్యనారాయణ చౌదరి ఏడీఎం
అన్ని రైతుబజార్‌ల్లో స్వైప్‌ మిషన్‌లు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల చివరిలోగా ప్రతి ఒక్కరు కరెంట్‌ ఖాతాలు ప్రారంభించి స్వైప్‌ మిషన్‌లు పెట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సిండికేట్‌ బ్యాంకు, జిల్లా సహకార కేంద్రబ్యాంకు, ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంకు, ఏపీజీబీల్లో కరెంట్‌ ఖాతాలు ప్రారంభించాలని చెబుతున్నాం. ప్రస్తుతానికి 25 మంది రైతులు, 24 పొదుపు గ్రూపుల మహిళల చేత స్వైప్‌ మిషన్‌లు పెట్టిస్తున్నాం. రైతుబజార్‌ల్లో నగదురహిత లావాదేవీలు నిర్వహించాలనేది లక్ష్యం. 
 
స్వైప్‌ మిషన్‌ కష్టమే: శ్రీనివాసగౌడు నందనపల్లి కర్నూలు మండలం
నేను వారంలో రెండుమూడు రోజులే కూరగాయలు అమ్ముకుంటాను. నాకు చదువు రాదు. మా దగ్గర ఒక్కొక్కరు ఒక్కో రకం కూరగాయలు కొంటారు. వీటికి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని అధికారులు చెబుతున్నారు. కరెంటు ఖాతా ప్రారంభించాలం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే రూ.500 వ్యాపారం జరుగదు. మాకెందుకు స్వైప్‌ మిషన్లు. 
 
 డబ్బు పడితే తీసుకునేదెలా: విజయ, పడిదెంపాడు
కూరగాయలు కొంటానికి వచ్చిన వారు ఎక్కడ ఏది బాగా ఉంటే అక్కడే కొనుక్కుంటారు. రైతుబజారుకు వచ్చిన వారు కనీసం ఐదారు మంది దగ్గర కూరగాయలు కొంటారు. అందరి దగ్గర మిషన్‌లను వాడాలంటే సాధ్యం కాదు. మాకు వ్యాపారాలపైనే దృష్టి ఉంటుంది. మిషన్‌ల ద్వారా ఎలా తీసుకుంటాము. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడితే తీసుకోవడం ఎలా... బ్యాంకుల్లో డబ్బులు లేకపోతే ఎలా ఇస్తారు. ఈ వ్యాపారాలకు మిషన్‌లు సరిపోవు.
 
ఒత్తిడి చేయడం మంచిది కాదు: మద్దమ్మ,  భూపాల్‌నగర్‌ 
కరెంటు ఖాతాలు ప్రారంభించాలని, మిషన్‌లు తెచ్చుకోవాలని అధికారులు మహిళలపై ఒత్తిడి తెస్తున్నారు. మాకు చదువు రాదు. కరెంటు ఖాతాలు... స్వైప్‌ మిషన్‌ల పేర్లే వినలేదు. కనీస అవగాహన కూడ లేకపోతే వాటిని ఎలా నిర్వహించాలి. పెద్దపెద్ద వ్యాపారాల దగ్గర వాటిని పెడితే ఉపయోగం ఉంటుంది. ఇప్పటికైన ప్రభుత్వం పునరాలోచన చేయాలి.    
మరిన్ని వార్తలు