ప్రీమియం సొమ్మంతా చెల్లించాం

8 Aug, 2015 02:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి వసూలు చేసిన పంటల ప్రీమియం సొమ్మును బీమా కంపెనీలకు పూర్తిస్థాయిలో చెల్లించామని.. ఏ బ్రాంచిలోనూ ఆ సొమ్మును దాచుకున్న దాఖ లాలు లేవని బ్యాంకర్లు ప్రభుత్వానికి తెలిపాయి. ఈ విషయంపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, బీమా కంపెనీలతో సమీక్ష  జరిపారు. పంట రుణాలు తీసుకునే రైతుల నుంచి బీమా ప్రీమియం సొమ్మును కోత విధించుకొనే బ్యాంకులు.. ఆ సొమ్మును పూర్తి గా బీమా కంపెనీలకు చెల్లించడంలేదని సర్కారు భావించింది. కొంత మొత్తమే చెల్లించి మిగిలిన సొమ్మును తమ వద్దే ఉంచుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి.

ఇలా రూ.వందల కోట్లు ఎటు పోయాయన్న విషయంపై విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వం కలెక్టర్లను గతంలో ఆదేశించింది. దీనిపై విచారణ చేపట్టిన బ్యాంకులు అటువంటి పరిస్థితి లేదని మంత్రికి చెప్పినట్లు తెలిసింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతుల నుంచి ప్రీమియం సొమ్మును తీసేసుకోవాలన్న నిబంధన ఉంది. పంటల బీమాతో ప్రయోజనం కనిపించక రైతులు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నా.. ప్రీమియం చెల్లించడానికి తిరస్కరిస్తున్నారు. ‘తప్పనిసరిగా’ ప్రీమియం చెల్లించాలన్న అంశంపై అనేకమంది రైతులు కోర్టుల్లో స్టే తెచ్చుకుని ప్రీమియం చెల్లించడంలేదని బ్యాంకులు చెప్పాయి.  అందుకే రుణం తీసుకున్న స్థాయిలో ప్రీమియం కనిపించడం లేదని తేలినట్లు బ్యాంకర్లు పేర్కొన్నారు. కాగా, ఈ ఖరీఫ్‌లో    15 వేల కోట్ల పంట రుణాలివ్వాలన్న లక్ష్యం ఉండగా.. ఇప్పటివరకు 4500 కోట్లు మాత్రమే ఇచ్చారంటూ బ్యాంక్ అధికారులపై పోచారం సీరియస్ అయినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు