చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తాం

9 Jun, 2017 22:30 IST|Sakshi
చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తాం
 – జగనన్న పాలనలో చేనేత కార్మికులకు మూడు సెంట్ల స్థలం
 – రాయితీతో రేషన్‌ సరఫరా, కొత్త మగ్గాలు మంజూరు
– ఎంపీ బుట్టా రేణుక
 
ఆదోని టౌన్‌ : వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారని, జగనన్న పాలనలో చేనేత రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ప్రతి చేనేత కార్మికుడికి మూడు సెంట్ల ఇంటి స్థలం, పక్కా గృహం, రాయితీతో రేషన్, కొత్త మగ్గాలు అందజేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ద్వారకా ఫంక‌్షన్‌ హాలులో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి ఆధ్యర్యంలో ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస యోజన కింద శిక్షణ పొందిన 200 మంది చేనేత కార్మికులకు సర్టిఫికెట్లను అందజేశారు.
 
ఎంపీ మాట్లాడుతూ శిక్షణ ద్వారా మరింత నైపుణ్యం పొందే అవకాశం ఉందన్నారు. పింఛన్లు రాని వారి జాబితాను ఇస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని తెలిపారు. చేనేతలకు వైద్య చికిత్స శిబిరం, ఐడీ కార్డులు మంజూరు చేయిస్తామన్నారు. ఆదోని ఒకటి, కోడుమూరులో 2, ఎమ్మిగనూరులో 3 క్లస్టర్ల ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. క్లస్టర్‌ ద్వారా చేనేతల అభివృద్ధికి కేంద్రం 1.7 కోట్లు మంజూరు చేస్తుందన్నారు. మగ్గాల నేసేందుకు వర్కుషెడ్లు మంజూరుకు కృషి చేస్తానన్నారు. టెక్స్‌టైల్‌, అపెరల్‌ పార్కు ఏర్పాటుతో చేనేతలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు.
 
పెనుగొండలో కేకే ఎక్స్‌ప్రెస్‌ రైలు స్టాపింగ్‌
జిల్లాలోని ముస్లింలు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు ఎమ్మెల్యేల సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గుమ్మనూరు జయరాం వినతిమేరకు ముస్లింల పుణ్యక్షేత్రమైన పెనుగొండలో కేకే ఎక్స్‌ప్రెస్‌ రైలును స్టాపింగ్‌ చేయించామని ఎంపీ తెలిపారు. కోడుమూరులో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.56 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్‌ పోస్టుల భర్తీ, వసతులు కల్పించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఆదోని రైల్వేస్టేషన్‌లో ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. ఎన్‌టీసీ మిల్లు పున:ప్రారంభానికి కృషి చేస్తానన్నారు. పెనుకొండలో కేకే ఎక్స్‌ప్రెస్‌ ఆగేలా చేయడం ముస్లింలకు  శుభవార్త అని ఎమ్మెల్యే  పేర్కొన్నారు.  
 
మరిన్ని వార్తలు